Municipal Elections: ముగిసిన ప్రచార హోరు.. జన ప్రభంజనంతో బీఆర్ఎస్ జోరు!

నల్లగొండ, ఏపీబీ న్యూస్: నల్లగొండ నగరపాలక సంస్థ ఎన్నికల ప్రచారానికి నేటితో తెరపడింది. ప్రచార ఆఖరి రోజున బీఆర్ఎస్ అభ్యర్థుల తరపున మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి నిర్వహించిన రోడ్ షోలు, కార్నర్ మీటింగ్లు జనసందోహంతో హోరెత్తాయి. ఎమ్మెల్సీ మంకెన కోటిరెడ్డి, కంచర్ల కృష్ణారెడ్డిలతో కలిసి పలు డివిజన్లలో ఆయన నిర్వహించిన సుడిగాలి పర్యటనలకు ఓటర్ల నుంచి అనూహ్య స్పందన లభించింది.

Kancharla Bhupal Reddy and Mankena Kotireddy during Nalgonda roadshow

17, 11, 13, 6, 30 నుండి 35 వరకు గల వివిధ డివిజన్లలో కంచర్ల భూపాల్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన విడుదల చేసిన నల్లగొండ అభివృద్ధి కరపత్రం ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో తాను ఎమ్మెల్యేగా 1500 కోట్ల రూపాయల నిధులు వెచ్చించి నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దామని, నేడు ఆ పనులే సాక్ష్యమని ఆయన గుర్తు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అభివృద్ధి నిధులను అనవసర పనులకు మళ్లించిందని, దీనివల్ల ఉదయసముద్రం ట్యాంక్ బండ్, కళాభారతి వంటి కీలక ప్రాజెక్టులు అర్ధాంతరంగా ఆగిపోయాయని ఆయన విమర్శించారు.

టికెట్ల కేటాయింపులో బీఆర్ఎస్ అనుసరించిన సామాజిక వ్యూహం పార్టీకి కలిసొచ్చేలా కనిపిస్తోంది.

  • ముస్లిం ఓటర్ల మొగ్గు: ప్రభావిత ప్రాంతాలలో బీఆర్ఎస్కు అనూహ్య ఆదరణ లభిస్తోంది. ముఖ్యంగా 9 స్థానాలను ముస్లిం అభ్యర్థులకు కేటాయించడం ఆ వర్గాల్లో సంతృప్తిని నింపింది.
  • బీసీ, ఎస్సీ ప్రాధాన్యత: జనరల్ స్థానాల్లోనూ ముగ్గురు దళితులకు, 11 స్థానాల్లో వెనుకబడిన వర్గాలకు అవకాశం ఇవ్వడం ద్వారా పార్టీ అన్ని వర్గాలను ఆకర్షించింది.
  • కొత్త ముఖాలు: ఎక్కువ మంది విద్యావంతులైన కొత్త వారికి అవకాశం ఇవ్వడంపై సానుకూలత వ్యక్తమవుతోంది.

గతంలో కాంగ్రెస్ కౌన్సిలర్లుగా పనిచేసిన వారిపై ఉన్న స్థానిక వ్యతిరేకతను బీఆర్ఎస్ తమకు అనుకూలంగా మలుచుకుంటోంది. ప్రతి డివిజన్లోనూ అధికార కాంగ్రెస్తో బీఆర్ఎస్ ‘ఢీ అంటే ఢీ’ అనేలా తలపడుతోంది. డప్పు వాయిద్యాలు, కోలాటాలు మరియు మహిళల మంగళహారతులతో పార్టీ శ్రేణులు ముగింపు ప్రచారాన్ని పండుగలా నిర్వహించాయి. అభివృద్ధిని కాంక్షించే వారు ‘కారు’ గుర్తుకే ఓటు వేయాలని కంచర్ల విజ్ఞప్తి చేశారు.

Share
Share