- 19 డివిజన్లలో ముగిసిన తొలి విడత ఎన్నికల ప్రచారం
- మళ్లీ పాతరోజులను గుర్తు చేసుకుంటున్న జనం
- మంత్రి పర్యటనతో మారుతున్న సమీకరణాలు
- స్మార్ట్ సిటీ కామెంట్స్ పైన అనూహ్య స్పందన
- రెండు వేల కోట్లతో పట్టణాభివృద్ధి
- 48 డివిజన్లలో కాంగ్రెస్ను గెలిపిస్తే మరిన్ని నిధులు
నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: నల్లగొండ కార్పోరేషన్ ఎన్నికల్లో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పర్యటనతో పార్టీ కేడర్లో జోష్ కనిపిస్తోంది. 48 డివిజన్లలో పార్టీ అభ్యర్థులను గెలిపించి క్లీన్ స్వీప్ చేయాలన్నది మంత్రి టార్గెట్. అసెంబ్లీ ఎన్నికల తరహాలో కార్పోరేషన్ కైవసం చేసుకునేందుకు అభ్యర్థులను వెంట బెట్టుకుని ప్రజలతో మమేమకమవుతున్నారు. ఇప్పటికే రెండు విడతల్లో 19 డివిజన్లలో ఎన్నికల ప్రచారం ముగించారు. దీనిలో భాగంగా ఎన్నికల్లో అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపిస్తే సీఎం ను ఒప్పించి భారీగా నిధులు తెస్తానని, హైదరాబాద్ తరహాలో నల్లగొండను స్మార్ట్ సిటీగా మారుస్తానని హామీ ఇస్తున్నారు. ప్రస్తుతం రెండు వేల కోట్లతో పట్టణంలో అభివృద్ధి పనులు నడుస్తున్నాయని, ఓవైపు ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం, మరోవైపు లతీఫ్ సాహెబ్ గుట్టకు ఘాట్ రోడ్డు పనులు శరవేగంగా జరుగుతున్నాయని, పట్టణ ప్రజలకు 24 గంటల నీటి సరఫరా అందించేందుకు పైలెట్ ప్రాజెక్టు కింద 11 ట్యాంకులు కడ్తున్నామని ప్రజలకు వివరిస్తున్నారు. కార్పోరేషన్ కైవసం అయితే కేంద్రం నుంచి భారీగా నిధులు తెస్తానని, పేద, నిరుపేద ప్రజలకు పక్కా ఇళ్లు నిర్మిస్తానని మంత్రి చెపుతున్నారు. మళ్లీ పాత వెంకన్నను చూస్తున్న జనం.

మళ్లీ పాత వెంకన్న కనిపిస్తున్నడని జనంలో చర్చ
ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి, తెలంగాణ రాష్ట్రం కోసం మంత్రి పదవి త్యాగం చేసిన రోజులను మహిళలు, ప్రభుత్వ ఉద్యోగులు, తెలంగాణ ఉద్యమకారులు రిటైర్డ్ ఉద్యోగులు గుర్తుచేసుకుంటున్నారు. చిన్న వయసులోనే కొడుకును కోల్పోయిన మంత్రి పేద ప్రజలు, విద్యార్థుల కోసం ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా అందిస్తున్న సేవల గురించి ప్రజల్లో విశేష స్పందన కనిపిస్తోంది. ఇటీవల బొట్టుగూడ స్కూల్ ఓపెనింగ్ వచ్చిన పూర్వ విద్యార్థులు, లెక్చరర్లు, విద్యార్థుల తల్లిదండ్రులు మంత్రి సేవలను కొనియాడుతున్నారు. అంతేగాక పేద ప్రజలకు మెరుగైన వైద్యం కోసం ప్రభుత్వ ఆసుపత్రిలో కోటి రూపాయాల ఖర్చుతో ల్యాప్రోస్కోపిక్ మిషన్, గర్బిణీలకు డెలవరీ కోసం మెరు గైన వసతులు కల్పించడం, నర్సింగ్, ఫార్మా కాలేజీలు, ఎంజీ యూనివవర్సిటీలో కొత్త కోర్సుల గురించి మంత్రి ప్రజలకు వివరిస్తున్నారు.
నల్లగొండ నాకు ప్రాణం
నల్లగొండ నాకు ప్రాణంతో సమానమని, ఇది నా సొంతు ఇల్లు లాంటిదని, ఐదు సార్లు ఎమ్మెల్యేగా ఇక్కడి ప్రజలు ఆదరించారని, అంతే నమ్మకంతో కార్పోరేషన్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తానని, డ్రైనేజీలు, సీసీరోడ్లు, పార్క్ల నిర్మాణం చేపడ్తామని, క్లాక్టవర్ సెంటర్లో అద్భుతమైన ప్రాజెక్టును రూపొందిస్తున్నామని మంత్రి చెప్పారు.

శరవేగంగా మారుతున్న పాలిటిక్స్
నల్లగొండ కాంగ్రెస్ లీడర్ల పట్ల ప్రజల్లో మొన్నటి వరకు కనిపించిన వ్యతిరేకత వెంకటరెడ్డి రాకతో తొలిగిపోయిందని సీనియర్ లీడర్లు అభిప్రాయపడుతున్నారు. అభ్యర్థుల ఎంపిక వ్యవహారంలోనే మంత్రి తీసుకున్న జాగ్రత్తలు పార్టీకి పునర్జీవంపోశాయని అంటున్నారు. ఇంటిలెజిన్స్ సర్వేలు, మేధావులు, వివిధ వర్గాల ప్రజల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని అభ్యర్థులను ప్రకటించినప్పటి నుంచే ప్రత్యర్థుల్లో గుబులు మొదలైందని అన్నారు. ఎన్నికల ప్రచారం లో భాగంగా మంత్రి సమక్షంలో వలసలు కూడా మొదలయ్యాయి. బీజేపీ 34 వవార్డు సీనియర్ నేత దోనాల నాగార్జునరెడ్డి కాంగ్రెస్లో చేరడంతో ఆపార్టీకి షాక్ తగిలింది. బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు ఎప్పుడో ప్రజాదరణ కోల్పోయాయని మంత్రి చేస్తున్న వ్యాఖ్యలు రాజకీయంగా హీటెక్కిస్తున్నాయి.

సమన్వయంతో కదులుతున్న కేడర్
కార్పోరేషన్ ఎట్టిపరిస్థితుల్లో క్లీన్ స్వీప్ చేయాలనే లక్ష్యంతో పార్టీలో సమన్వయం దిశగా చేపట్టిన చర్యలు ఎన్నికల ప్రచారంలో సత్ఫలితాలు ఇస్తున్నాయి. ముఖ్యంగా అభ్యర్థుల ఎంపిక, సర్వేలు, లీడర్ల మధ్య సమన్వయం వంటి వ్యవహారాలను మంత్రి ఆదేశాల మేరకు తిప్పర్తి మాజీ జడ్పీటీసీ పాశం రామిరెడ్డి సమన్వయకర్తగా వ్యవహరించారు. మాజీ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, గుమ్మల మోహన్రెడ్డి, పాశం రామిరెడ్డి, అబ్బగోని రమేష్ గౌడ్ తదితరులు వ్యూహాత్మకంగా వ్యవహారించారు. మేయర్, డెప్యూటీ మేయర్, నుడా చైర్మన్ వంటి పదవుల విషయంలో హామీ ఇవ్వడంతో పట్టణ ఓటర్లలో స్పష్టత వచ్చిందనే చెప్పాలి.