- వెన్నుపోటు పొడవాలని చూసిండు
- ఈ జన్మకు ఎమ్మెల్యే పదవి ఎక్కువ
- మున్సిపల్ పదవుల పైన ఎలాంటి ఆశలేదు
- రెండు కోట్ల చెక్కు ఫేక్ కాదు.. డబ్బులు ఖాతాలోనే ఉన్నయ్
- సోషల్ మీడియాను అడ్డం పెట్టుకుని అసత్య ప్రచారం
- సీఎం రేవంత్ సమక్షంలో ఎమ్మెల్యే బత్తుల భావోద్వేగం
నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రావు ఎంతటి వెన్నుపోటు దారుడో ఇక్కడున్న మీ అందరికి తెలుసని, ఈ ఎన్నికల్లో తన కుటుంబాన్ని రోడ్డుకు మీదకు తెచ్చిండని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి సీఎం రేవంత్ సమక్షంలో తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. బుధవారం మిర్యాలగూడలో జరిగిన బహిరంగ సభకు అధ్యక్షత వహించిన ఎమ్మెల్యే ఈ ఎన్నికల్లో ఆయన పడ్డపాట్ల గురించి సీఎంకు వివరించారు. ఎమ్మెల్యే పదవినే అదృష్టంగా భావిస్తున్నానని, అంతకుమించిన పదవులు ఏవీ తనకు అక్కరలేదని ఎమ్మెల్యే అన్నారు. జానారెడ్డి, రఘువీర్ రెడ్డి, శంకర్ నాయక్ నేతృత్వంలో తాను పనిచేయడానికి సిద్ధంగా ఉన్నానని అన్నారు. కానీ ఇక్కడ మాజీ ఎమ్మెల్యే మున్సిపల్ ఎన్నికల్లో వెన్నుపోటు చర్యలకు పాల్పడ్డారని, దాంతోనే మరో గత్యంతరం లేక తన కుటుంబంతో నామినేషన్లు వేయించాల్సి వచ్చిందని, అంతే తప్పా నాకు ఎలాంటి పదవుల పైన వ్యామోహం లేదని అన్నారు.

రూ.2కోట్ల చెక్కు..
సీఎంకు అందజేసిన రూ.2కోట్ల చెక్కు పైన కూడా సోషల్ మీడియాను అడ్డంపెట్టుకుని ఫేక్ చెక్కు అని అసత్య ప్రచారం చేశారని, కానీ ఇప్పటి వరకు బ్యాంకు అకౌంట్లలో రెండు కోట్లు అట్లాగే ఉన్నాయని బ్యాంకు స్టేట్మెంట్ను చూపించారు. ఆనాడు రెండు కోట్లతో రైతులకు యూరియా ఉచితంగా పంపిణీ చేయాలని సీఎంను కోరడం జరిగిందని, కానీ అలా చేయడం వల్ల కేంద్రం నుంచి యూరియా సబ్సిడీ రాదని సీఎం చెప్పిండని అన్నారు. ఈ రెండు కోట్లు సీఎంఆర్ఎఫ్ ఖాతాలోకి వెళ్తాయని, అలా కాకుండా ప్రభుత్వం నుంచి మరికొన్ని నిధులు మంజూరు చేస్తానని, ఈ రెండు కోట్లతో కలిపి మిర్యాలగూడలో రైతుల సంక్షేమం కొరకు వినియోగించాలని సీఎం సూచించారని, దాంతో అప్పటి నుంచి ఈ రెండు కోట్లు బ్యాంకు అకౌంట్లోనే ఉన్నాయని ఎమ్మెల్యే చెప్పారు. నల్లగొండ, హైదరాబాద్ లో సోషల్ మీడియాను అడ్డంపెట్టుకుని తన పైన తప్పుడు ప్రచారం చేస్తున్నారని తీవ్ర ఆవేధన వ్యక్తం చేశారు.