మంత్రి కోమటిరెడ్డి పై నిప్పులు చేరిగిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే

నల్లగొండ, ఏపీబీ న్యూస్: నల్గొండ అభివృద్ధికి ఇప్పటివరకు ఎన్ని నిధులు తెచ్చారో చెప్పాలని మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి ఆర్ అండ్ బి(R&B) మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సవాల్ విసిరారు. బుధవారం అభ్యర్థుల తొలి జాబితా ప్రకటించిన నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు. గతంలో నల్గొండ మున్సిపాలిటీని కాంగ్రెస్ పాలకులు పూర్తిగా నిర్లక్ష్యం చేశారని, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే నల్గొండను సుందర నగరంగా తీర్చిదిద్దామని తెలిపారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నల్గొండను దత్తత తీసుకుని సమగ్ర అభివృద్ధి చేశారని కంచర్ల పేర్కొన్నారు. దాదాపు రూ.1300 కోట్లతో పట్టణంలో ఐటీ హబ్, మెడికల్ కళాశాల, రోడ్ల అభివృద్ధి, తాగునీరు, శానిటేషన్, అండర్గ్రౌండ్ డ్రైనేజీ, ట్రాఫిక్ జంక్షన్ల నిర్మాణం జరిగిందన్నారు. కేటీఆర్ ప్రత్యేక చొరవతో వందల కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేశామని చెప్పారు.

నల్గొండకు కార్పొరేషన్ అర్హత రావడమంటే అది పూర్తిగా బీఆర్ఎస్ చొరవ వల్లేనని స్పష్టం చేశారు. ప్రజల సౌకర్యం కోసం ఏర్పాటు చేసిన ఆర్అండ్బి గెస్ట్ హౌస్ను మంత్రి క్యాంపు కార్యాలయంగా మార్చుకున్నారని, ఫ్లైఓవర్, ఔటర్ రోడ్డు పనుల కాంట్రాక్టర్లను బెదిరించి వసూళ్లు చేసి, ఆ డబ్బులతో స్కూల్ నిర్మించి తమ పేర్లు పెట్టుకున్నారని విమర్శించారు. ఎన్జీ(NG) కళాశాల అభివృద్ధికి రూ.36 కోట్లు, కళాభారతి అభివృద్ధికి రూ.90 కోట్లు మంజూరైనా ఇప్పటివరకు పనులు చేపట్టలేదని ప్రశ్నించారు. ఛాయా సోమేశ్వరాలయ అభివృద్ధి పనులకు ఇప్పటివరకు టెండర్లు ఎందుకు పిలవలేదని భూపాల్ రెడ్డి ప్రశ్నించారు.

Share
Share