Breaking News: మున్సిపల్​ ఎన్నికల్లో కాంగ్రెస్​ కోవర్టు ఆపరేషన్.. బీఆర్​ఎస్ బీ కేర్‌ఫుల్..

నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ను నామరూపాలు లేకుండా చేసేందుకు కాంగ్రెస్ లీడర్లు కోవర్టు ఆపరేషన్కు తెరతీశారు. ఒకప్పుడు కాంగ్రెస్లో చేరిన బీఆర్ఎస్ లీడర్లు మళ్లీ సొంత గూటికి వచ్చేందుకు సిద్ధమవుతున్నరు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు, తర్వాత పార్టీని వీడిన కౌన్సిలర్లు, పలువురు లీడర్లు తిరిగి సొంతగూటికి వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. అయితే వీళ్లలో చాలా మంది కాంగ్రెస్ కోవర్టులేనని, వాళ్లను నమ్మిపార్టీలో చేర్చుకుంటే మరోసారి మోసపోవడం ఖాయమని సీనియర్లు హెచ్చరిస్తున్నారు. ప్రధానంగా నల్లగొండ, మిర్యాలగూడ, దేవరకొండ, సూర్యాపేట, భువనగిరి, చౌటుప్పుల్, కోదాడ, హుజూర్నగర్లో చేరికలు మొదలయ్యాయి. నల్లగొండ, మిర్యాలగూడలో వలసలు ఊపందుకున్నాయి. వలసొచ్చిన కౌన్సిలర్లు, లీడర్లను అప్పుడే ఎన్నికల అభ్యర్థులుగా మాజీ ఎమ్మెల్యేలు ప్రకటించడం కలవరం పుట్టిస్తోంది. ఎన్నికల నోటిఫికేషన్ కూడా వెలువడక ముందే అభ్యర్థులను ప్రకటించడం తొందరపాటు చర్య అని సీనియర్లు ఆందోళన చెందుతున్నారు. గత ఎన్నికలను గుణపాఠంగా భావించి అభ్యర్థుల ఎంపికలో ముందు జాగ్రత్త వహించాలని సూచిస్తున్నారు. 

బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన మాజీ కౌన్సిలర్లకు, పలువురు ఆశావహులకు టికెట్లు దక్కడం కష్టమని చెపుతున్నారు. సర్వేల ప్రకారం అభ్యర్థుల ఎంపిక ఉంటదని చెప్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఎమ్మెల్యేల నుంచి డబ్బులు ఆశించి పార్టీ మారారు. ఈవిధంగా పార్టీ మారిన కౌన్సిలర్లు, మున్సిపల్ చైర్మన్ ల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. గత రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో మున్సిపాలిటీల్లో అధికార పార్టీ కౌన్సిలర్లకు ఇచ్చినంత ప్రయార్టీ వలసొచ్చిన కౌన్సిలర్లకు ఇవ్వలేదు. కాంట్రాక్టులు, పైరవీలు, రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లో మొండిచేయి చూపారు. డబ్బులు ఆశించి పార్టీ మారడం ఒకటైతే, పదేళ్ల పాటు అధికారం అనుభవించి, మళ్లీ పదవుల కోసం కాంగ్రెస్లో చేరడం ఆ పార్టీ లీడర్లకు అస్సలు నచ్చలేదు. దీంతో చాలా మంది వలస కౌన్సిలర్లకు టికెట్ల కోత పెట్టాలని డిసైడ్ అయ్యారు. ఇంటిలిజెన్స్ సర్వేలు, ప్రైవేటు సర్వేలను అడ్డంపెట్టి టికెట్ల కోత పెట్టేందుకు జాబితాలు ప్రిపేర్ చేస్తున్నారు. ఈ తంతంగాన్ని ముందుగానే పసిగట్టిన వారంతా మెల్లగా కాంగ్రెస్ నుంచి జారుకుని బీఆర్ఎస్, బీజేపీ వైపు తొంగి చూస్తున్నారు.

బీఆర్ఎస్, బీజేపీ, కమ్యూనిస్టులు కలిస్తే కాంగ్రెస్ మెజార్టీ సీట్లు దక్కించుకోవడం కష్టమని ఇంటిలిజెన్స్ రిపోర్ట్లు చెపుతున్నాయి. దాంతో మెజార్టీ సీట్లు కైవసం చేసుకునేందుకు నికాసైన అభ్యర్థులను నిలబెట్టాలన్నదే కాంగ్రెస్ టార్గెట్, మరోవైపు ప్రత్యర్థులను దెబ్బ తీసేందుకు కోవర్డు ఆపరేషన్ కూడా ప్లాన్ చేస్తున్నారు. మున్సిపల్టికెట్ ఆశిస్తున్న తమ అనుచరులు, సన్నిహితులకు, వలస లీడర్లకు కాంగ్రెస్లో టికెట్ కష్టమని ముందస్తు లీకులు ఇస్తున్నారు, దాంతో  మొన్నటి వరకు కాంగ్రెస్ ముఖ్య నేతలతో అంటకాగిన వాళ్లను మెల్లగా బీఆర్ఎస్ వైపు ఎగతోస్తున్నారు. బీఆర్ఎస్, బీజేపీ పొత్తు వల్ల నష్టం జరిగే మున్సిపాలిటీల్లో కోవర్టు ఆపరేషన్ ప్రయోగించనున్నారు. దీనిలో భాగంగా సామాజిక అంశాలను ప్రామాణికంగా తీసుకుంటున్నారు. ముఖ్యంగా ముస్లింలు, బీసీలు, ఎస్సీలు ఉన్న ఏరియాల పైనే ఫోకస్ పెట్టారు.

బీఆర్ఎస్కు చాలా చోట్ల అభ్యర్థులు కరువయ్యారు. బలమైన అభ్యర్థుల కోసం వెతుకులాడుతున్నారు. దీంతోనే అవతలి పార్టీ నుంచి ఎవరొచ్చిన కండువ కప్పేస్తున్నారు. వాళ్లనే పార్టీ అభ్యర్థులుగా ప్రకటిస్తున్నారు. ఇలాంటి తొందరపాటు చర్య వల్ల ఎన్నికల్లో నష్టపోయే ప్రమాదం ఉంటదని, ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే వరకు వేచి చూస్తే బాగుంటదని సీనియర్లు సూచిస్తున్నారు. బీజేపీ, కమ్యూనిస్టుల పొత్తు కొలిక్కి వచ్చే వరకు వేచిచూడాలని, సమన్వయం పాటించి సీనియర్ల అభిప్రాయాలు పరిగణలోకి తీసుకున్నాకే చేరికలు ప్రోత్సహించాలని, లేదంటే ఎన్నికల్లో అభాసుపాలవడం ఖాయమని హెచ్చరిస్తున్నారు.

Share
Share