- మిర్యాలగూడ మున్సిపాలిటీ ఎన్నికల్లో రచ్చకెక్కుతున్న విభేదాలు
- కౌన్సిలర్ అభ్యర్థుల ఎంపికలో గందరగోళం
- ఎమ్మెల్యే బత్తుల, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, ఎంపీ రఘువీర్ రెడ్డి వర్గీయుల మధ్య పోటీ
- చైర్మన్ పదవి రెడ్లకే ఇవ్వాలనే ప్రతిపాధన
నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: మిర్యాలగూడ కాంగ్రెస్ పార్టీలో ట్రయాంగిల్ వార్ నడుస్తోంది. మున్సిపల్ ఎన్నికల్లో కౌన్సిలర్ల టికెట్ల కోసం అభ్యర్థుల మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, ఎంపీ రఘువీర్ రెడ్డి వర్గీయుల మధ్య విభేదాలు రచ్చకెక్కుతున్నాయి. కౌన్సిలర్ టికెట్ కోసం ఈ ముగ్గురు నేతల అనుచరులు పోటీపడుతున్నారు. దీంతో ఇప్పటి వరకు క్యాండేట్ల ఎంపిక కొలిక్కి రాలేదు. ప్రత్యర్ధి బీఆర్ఎస్ శిభిరంలో అభ్యర్థుల ప్రకటన జరిగి పోతుండగా, కాంగ్రెస్‌లో మాత్రం గ్రూపు రాజకీయాలు వేడిపుట్టిస్తున్నాయి. మరోవైపు మాజీ చైర్మన్ తిరునగర్ భార్గవ్ పరిస్థితి ఏంటన్నది తేల్చలేదు. కాంగ్రెస్‌లో ఆయన చేరికను అడ్డుకున్న తరుణం లో సీనియర్ నేత జానారెడ్డి చొరవతో భార్గవ్ పార్టీలో కొనసాగుతున్నారు. అయితే మున్సిపల్ ఎన్నికల్లో ఆయన వర్గానికి ఎంతమేర ప్రయార్టీ ఇస్తారన్నది ప్రశ్నార్ధకంగానే మారింది. చైర్మన్ పదవి జనరల్ మహిళలకు రిజర్వు అయిన సంగతి తెలిసిందే. దీంతో చైర్మన్ పదవి ఈసారి వైశ్య సామాజిక వర్గానికి ఇస్తారా? లేదంటే రెడ్డి వర్గానికి ఇస్తారన్నది సస్పెన్స్‌గానే ఉంది. రేసులో మాత్రం ఇద్దరు ముగ్గురు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.
రఘువీర్ ఎంట్రీ ఇవ్వాల్సిందే
మాజీ చైర్మన్ తిరునగరు భార్గవ్ ప్రస్తుతానికి తటస్థంగానే ఉన్నారు. భార్గవ్ ప్రభావం పది వార్డుల్లో ఉంది. ఇంకోవైపు ఎంపీ రఘువీర్ రెడ్డి వర్గానికి చెందిన ముస్లిం, మైనార్టీ నాయకులు కౌన్సిలర్ పదవి ఆశిస్తున్నారు. ఎమ్మెల్సీ శంకర్ నాయక్ వర్గం పలు వార్డుల్లో టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. సర్వేల ప్రకారం అభ్యర్థులను ఎంపిక చేయాలని అధిష్టానం ఆదేశించిన సంగతి తెలిసిందే, కానీ గ్రూపు గొడవల వల్ల అభ్యర్థుల ఎంపిక కొలిక్కిరాలేదు. విశ్వనీయ సమాచారం మేరకు రఘువీర్‌రెడ్డి వర్గీయులకు 15 వార్డులు ఇస్తామనే ఒప్పందం జరిగినట్టు తెలిసింది, దీంతో ఎమ్మెల్యే వర్గం భగ్గుమంటోంది. ఆ వార్డుల్లో ఎమ్మెల్యే వర్గీయులు బలంగా ఉండటంతో ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. ప్రత్యర్ధి శిభిరంలో అభ్యర్థుల ఎంపిక శర వేగంగా జరుగుతోంది. బీజేపీ, కమ్యూనిస్టులతో లోపాయికారికంగా పొత్తులు కుదుర్చుకుంటున్నారు. కానీ కాంగ్రెస్ లో మాత్రం అభ్యర్థుల ఎంపికలోనే గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఎంపీ రఘువీర్ రెడ్డి ఎంట్రీ ఇస్తే తప్పా టికెట్ల పంచాయితీ తేలదని పార్టీ సీనియర్లు చెపుతున్నారు.
కౌన్సిలర్ల ఎంపికలోనే అయోమయం
కౌన్సిలర్ల ఎంపిక అయోమయంగా మారింది. 48 వార్డుల్లో 13 జనరల్ మహిళ, బీసీ జనరల్ 8, బీసీ మహిళ 8 రిజర్వు కాగా, మిగతా స్థానాలు ఎస్సీ, ఎస్టీలకు రిజర్వు అయ్యాయి. అయితే ఈ ఎన్నికల్లో కౌన్సిలర్‌గా పోటీచేద్దామని భావించిన ఆశావహుల ఆశలు నీరుగారిపోయాయి. జనరల్ స్థానాలు బీసీలకు రిజర్వు కావడం, బీసీ వార్డులు రొటేషన్‌లో ఎస్సీ, జనరల్‌కు మారడంతో ఆశావహుల అంచనాలు తలకిందులయ్యాయి. దీంతో చైర్మన్ పదవి ఆశించిన అభ్యర్థులు సైతం వేరొక వార్డు నుంచి పోటీ చేయాల్సిన పరిస్థితి నెలకొంది.
చైర్మన్ రేసులో ప్రముఖులు
మున్సిపల్ చైర్మన్ రేసులో ప్రముఖంగా ఇద్దరు, ముగ్గురు పేర్లు వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ప్రధాన అనుచరుడు వేణుగోపాల్ రెడ్డి భార్యను చైర్మన్ అభ్యర్థిగా బరిలో దింపాలని చూస్తున్నారు. ప్రస్తుతం ఆమె కేఎన్ఎం కాలేజీలో పనిచేస్తున్నారు. చైర్మన్ కనఫర్మ్ అయితే ఆమె ఉద్యోగానికి రాజీనామా చేయించాలనే ఆలోచనలో ఉన్నారు. ఒకటో వార్డు మాజీ కౌన్సిలర్ జలధర్రెడ్డి భారీ బడ్జెట్‌తో సిద్ధంగా ఉన్నారు. చైర్మన్ ఛాన్స్ ఇస్తే ఖర్చు కు వెనకాడేది లేదని స్పష్టం చేస్తున్నారు. వైశ్య సామాజిక వర్గానికి చెందిన మిట్టపల్లి వెంకటేశం తన తల్లిని చైర్మన్ అభ్యర్థిగా నిలబెట్టాలనే ఆలోచనలో ఉన్నారు. గతంలో వైశ్యులకు చైర్మన్ అవకాశం ఇచ్చినందున ఈసారి రెడ్లకు ఇవ్వాలనే ప్రతిపాధన తెరపైకొచ్చింది.