ఉచితబస్సు ప్రయాణం కోసం రూ.10 వేల కోట్లు: మంత్రి కోమటిరెడ్డి

యాదగిరిగుట్ట, ఏపీబీ న్యూస్: యాదగిరిగుట్ట తో పాటు యాదగిరిగుట్ట టౌన్ కూడా అభివృద్ధి చేయడం జరుగుతుందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. మంగళవారం అందుకోసం 100 కోట్లతో యాదగిరిగుట్టలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులు త్వరలో చేపట్టడం జరుగుతుందన్నారు. కొత్తగా స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు చేయాలని తెలిపారు. యాదగిరిగుట్టలో 210 కోట్ల వ్యయం తో చేపట్టిన పైప్ లైన్ పనులు త్వరలో పూర్తి కావొస్తున్నందున ప్రతి ఇంటికి గోదారి జలాలు అందుతాయన్నారు. గంధమల్ల రిజర్వాయర్ ప్రాజెక్ట్ పూర్తి అయితే పరిసర ప్రాంతాలకు, రైతులకు లక్ష ఎకరాలకు సాగు నీరు అందించడం జరుగుతుందని తెలిపారు.

మంగళవారం ఇందిరా మహిళా శక్తి సంబరాల్లో భాగంగా మెప్మా ఆధ్వర్యంలో రూ.98.23 లక్షల వడ్డీలేని రుణాల చెక్కును అందజేశారు. ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య పాల్గొన్న ఈ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టామన్నారు. మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణాన్ని ప్రవేశపెట్టిందని రాష్ట్రంలో 265 కోట్ల మంది ఉచిత బస్సు ప్రయాణం చేసినట్లు అందుకు గాను ప్రభుత్వం 10 వేల కోట్లు ఖర్చు చేస్తుందని తెలిపారు. ధనిక కుటుంబ సభ్యులు ఏ బియ్యం అయితే తింటున్నారో అవే సన్న బియ్యం ప్రతి పేద ప్రజల కడుపు నిండా అన్నం తినాలనే లక్ష్యంతో మనిషికి ఆరు కిలోల చొప్పున సన్న బియ్యం ఇస్తున్నామని అన్నారు. యాదగిరిగుట్ట మున్సిపాలిటీలో అర్హులైన 16,152 మందికి కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయడం జరిగిందన్నారు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నామన్నారు. ప్రతి నియోజకవర్గంలో మహిళలు ఆర్థికంగా, బలోపేతం చేయడం కోసం పెట్రోల్ బంకులు కూడా మహిళల పేరున ఇస్తున్నామన్నారు.

విప్ బీర్ల ఐలయ్య మాట్లాడుతూ మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడమే ప్రజాపాలన ప్రజా ప్రభుత్వ ఉద్దేశమని, అందులో భాగంగానే వడ్డీ లేని రుణాలను మంజూరు చేయడం జరిగిందన్నారు. ప్రతి ఆడ బిడ్డకు పుట్టింటి సారెగా ఇందిరమ్మ చీరలు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. 18 సంవత్సరాల నుండి 100 సంవత్సరాల లోపు ఉన్న ప్రతి మహిళలకు ఇందిరమ్మ చీరలు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంకు గాను వివిధ బ్యాంకులు, శ్రీనిధి వారి సహకారంతో 87 సంఘాలకు రూ.12,73,00,000 బ్యాంకు లింకేజి చెక్కును స్వయం సహాయక సంఘాల సభ్యులకు అందజేశారు.

Share
Share