కాంగ్రెస్​ అధికారంలోకి వచ్చాకే రైతులకు మంచి రోజులు: మంత్రి కోమటిరెడ్డి

  • నల్లగొండలో రూ.8 కోట్ల వ్యవసాయ యంత్రాల పంపిణీ
  • రైతు పక్షపాత ప్రభుత్వమని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్య

నల్లగొండ, ఏపీబీ న్యూస్: వైఎస్సార్ హాయాంలో ఆగిపోయిన సబ్సిడీ పరికరాల పంపిణీ మళ్లీ మొదలు పెట్టామని, రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని, తమది పూర్తిగా రైతు పక్షపాత ప్రభుత్వమని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. సోమవారం నల్లగొండ జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణలో నిర్వహించిన కార్యక్రమంలో రూ.8 కోట్ల విలువైన వ్యవసాయ యంత్ర పరికరాలను రైతులకు పంపిణీ చేశారు. ఈ పరికరాలను 50 శాతం వరకు సబ్సిడీపై అందజేస్తున్నట్లు తెలిపారు.

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన మంత్రి, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు మంచి రోజులు వచ్చాయని అన్నారు. రెండు లక్షల రూపాయల లోపు రుణాలు ఉన్న రైతులకు సంబంధించిన దాదాపు రూ.20 వేల కోట్ల రుణాలను రుణమాఫీ చేశామని, అంతేకాక ప్రభుత్వం మారే నాటికి బకాయి ఉన్న రైతుబంధు మొత్తాలను కూడా చెల్లించామని తెలిపారు.

గతంలో వైఎస్ఆర్ హయాంలో వ్యవసాయ యంత్ర పరికరాల పంపిణీ జరిగినప్పటికీ, ఆ తర్వాత అవి నిలిచిపోయాయని, ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం మళ్లీ ఈ పథకాన్ని ప్రారంభించామని చెప్పారు. నల్లగొండ జిల్లాలో చిన్న, సన్నకారు, మహిళా రైతులు, ఎస్సీ, ఎస్టీ రైతులకు 50 శాతం సబ్సిడీపై యంత్ర పరికరాలు అందజేస్తున్నామని, ఇతర రైతులకు 40 శాతం సబ్సిడీతో పంపిణీ చేస్తున్నట్లు వివరించారు.

రాష్ట్రంలో వ్యవసాయ యంత్ర పరికరాల పంపిణీలో నల్లగొండ జిల్లా రెండవ స్థానంలో ఉందని తెలిపారు. సంక్రాంతి సందర్భంగా ముందుగా ఖమ్మం జిల్లాలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ఈ పరికరాలను పంపిణీ చేశారని, ఆ తరువాత నల్లగొండలో కార్యక్రమం నిర్వహించామని చెప్పారు. రైతులు, మహిళల కళ్లల్లో ఆనందం చూడడమే తమ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేయడం కోసం ఆర్టీసీకి రూ.10 వేల కోట్లను ప్రభుత్వం చెల్లించిందని తెలిపారు. అలాగే 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్తు పథకం ద్వారా 50 లక్షల కుటుంబాలకు రూ.5,600 కోట్ల భారం ప్రభుత్వం మోయిందని చెప్పారు.

నల్లగొండ పట్టణంలో ఎస్ఎల్బీసీ సమీపంలో నిర్మిస్తున్న పెట్రోల్ పంపును ఏప్రిల్ నెలలో ప్రారంభిస్తామని వెల్లడించారు. అదేవిధంగా రూ.200 కోట్ల వ్యయంతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలను నిర్మిస్తున్నామని, రాష్ట్రవ్యాప్తంగా 100 నియోజకవర్గాల్లో ఇవి ఇప్పటికే ప్రారంభమయ్యాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్, జాయింట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ శ్రవణ్తో పాటు ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Share
Share