హైదరాబాద్, ఏపీబీ న్యూస్: స్విట్జర్లాండ్లోని డావోస్లో జరుగుతున్న ప్రతిష్ఠాత్మక ప్రపంచ ఆర్థిక సదస్సు (World Economic Summit)లో తెలంగాణ రాష్ట్రం తరఫున భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. అంతర్జాతీయ వేదికపై తెలంగాణ అభివృద్ధి దృక్పథాన్ని ప్రాతినిధ్యం వహిస్తూ ఆయన కీలక సమావేశాల్లో పాల్గొనడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఈ సందర్భంగా స్వనితి (Swaniti) ఆధ్వర్యంలో నిర్వహించిన “ది మెరిడియన్ కలెక్టివ్ – సబ్నేషనల్ కమిట్మెంట్ చార్టర్ (The Meridian Collective – Subnational Commitment Charter)” కార్యక్రమానికి ఎంపీ హాజరయ్యారు. ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్రం తీసుకుంటున్న అభివృద్ధి, పాలన సంస్కరణలు, స్థిరమైన ఆర్థిక వృద్ధిపై కట్టుబాట్లను అంతర్జాతీయ ప్రతినిధుల ముందు వివరించారు.
ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల ప్రతినిధులు, విధాన రూపకర్తలు, పరిశ్రమల నాయకులతో కలిసి రాష్ట్రాల పాత్ర, ఉప-జాతీయ స్థాయిలో విధానాల అమలు, ప్రజా ప్రయోజనాల సాధన వంటి అంశాలపై సార్ధకమైన చర్చలు జరిగాయి. ఈ చర్చలు తెలంగాణ రాష్ట్రానికి గ్లోబల్ స్థాయిలో గుర్తింపును మరింత బలపరిచేలా ఉంటాయని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అభిప్రాయపడ్డారు.
డావోస్ వేదికపై తెలంగాణ ప్రగతి, పెట్టుబడుల అవకాశాలు, భవిష్యత్ అభివృద్ధి దిశలను ప్రపంచానికి పరిచయం చేయడం గర్వకారణమని ఆయన పేర్కొన్నారు. ఈ సదస్సు ద్వారా రాష్ట్రానికి కొత్త పెట్టుబడులు, అంతర్జాతీయ సహకారం లభించే అవకాశాలు మరింత పెరుగుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.