Breaking News: ఈనెల 24 నుంచి 27 వరకు బ్యాంకులు మూతపడే అవకాశం

హైదరాబాద్, ఏపీబీ న్యూస్: బ్యాంక్ ఉద్యోగులు ఐదు రోజుల పని వారాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సమ్మెకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో జనవరి 24 నుంచి 27 వరకు దేశవ్యాప్తంగా బ్యాంకింగ్ సేవలు అంతరాయం కలగవచ్చని సమాచారం. ఉద్యోగ సంఘాల నిర్ణయంతో ఈ తేదీల్లో ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులు పూర్తిగా లేదా భాగంగా మూతపడే అవకాశం ఉంది.

బ్యాంకింగ్ రంగంలో ఇతర ప్రభుత్వ రంగ సంస్థల మాదిరిగా వారానికి ఐదు రోజుల పని విధానాన్ని అమలు చేయాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇప్పటికే ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వానికి, బ్యాంక్ మేనేజ్మెంట్కు పలుమార్లు విజ్ఞప్తులు చేసినప్పటికీ సానుకూల నిర్ణయం రాకపోవడంతో సమ్మెకు దిగాల్సి వచ్చిందని సంఘాలు వెల్లడించాయి.

ఈ సమ్మె కారణంగా చెక్ క్లియరెన్స్, నగదు ఉపసంహరణ, డిపాజిట్ సేవలు, రుణాల మంజూరు వంటి కీలక బ్యాంకింగ్ కార్యకలాపాలు ప్రభావితమయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా నాలుగు రోజుల పాటు వరుసగా బ్యాంకులు పనిచేయకపోతే ఖాతాదారులు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అత్యవసర సేవలకు సంబంధించి బ్యాంకులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తాయా లేదా అన్నది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఖాతాదారులు ముందస్తుగా అవసరమైన లావాదేవీలను పూర్తి చేసుకోవాలని సూచనలు వెలువడుతున్నాయి.

Share
Share