- ప్రత్యేక లీడర్షిప్ కోర్సులో చేరిక
- సిట్టింగ్ సీఎంగా అరుదైన గుర్తింపు
హైదరాబాద్, ఏపీబీ న్యూస్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిష్ఠాత్మక హార్వర్డ్ యూనివర్సిటీలో ప్రత్యేక లీడర్షిప్ కోర్సులో చేరనున్నారు. అమెరికాలోని హార్వర్డ్ కెనెడీ స్కూల్ ఆఫ్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఐదు రోజుల ఎగ్జిక్యూటివ్ లీడర్ షిప్ ప్రోగ్రామ్కు ఆయన నమోదు చేసుకున్నారు.
ఈ నెల 25 నుంచి 30 వరకు కొనసాగనున్న ఈ కోర్సు ‘లీడర్షిప్ ఫర్ ది ట్వంటీ ఫస్ట్ సెంచరీ: కేయాస్, కాన్ఫ్లిక్ట్ అండ్ కరేజ్’ అనే అంశంపై నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో తరగతులకు హాజరు, అసైన్మెంట్లు, హోంవర్క్, గ్రూప్ ప్రాజెక్టులు వంటి అంశాలు భాగంగా ఉంటాయి. వాస్తవ ప్రపంచంలో ఎదురయ్యే సంక్లిష్ట సమస్యలను కేస్ స్టడీస్ రూపంలో విశ్లేషించి, వాటికి పరిష్కారాలు కనుగొనడంపై ఈ శిక్షణా కార్యక్రమంలో ప్రధానంగా దృష్టి సారిస్తారు. ఐదు ఖండాలకు చెందిన 20కి పైగా దేశాల నుంచి సీనియర్ నాయకులు, పాలన నిపుణులు ఈ కోర్సులో పాల్గొననున్నారు.
పదవిలో ఉన్న సమయంలో ఐవీ లీగ్ యూనివర్సిటీలో ఇలాంటి లీడర్షిప్ కోర్సులో పాల్గొంటున్న తొలి భారత ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గుర్తింపు పొందనున్నారు. కోర్సు విజయవంతంగా పూర్తి చేసిన అనంతరం హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి ఆయనకు అధికారిక సర్టిఫికేషన్ అందజేయనున్నారు. ఆధునిక నాయకత్వ విధానాలు, సంక్షోభ నిర్వహణ, నిర్ణయ సామర్థ్యాలపై అవగాహన పెంచుకుని, వాటిని తెలంగాణ పాలనలో అమలు చేయాలనే లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి ఈ కోర్సులో పాల్గొంటున్నట్లు సమాచారం.