సూర్యాపేట, ఏపీబీ న్యూస్: సూర్యాపేట జిల్లా మునగాల మండలం మాధవరం గ్రామంలో రాజకీయ ఉద్రిక్తతలకు సంబంధించిన ఘటన చోటుచేసుకుంది. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో మూడవ వార్డు నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన మున్నా లింగయ్య ఘన విజయం సాధించడంతో పాటు, గ్రామ సర్పంచ్ పదవిని కూడా బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది.
ఈ నేపథ్యంలో, లింగయ్య కుటుంబానికి చెందిన పశువుల మేత కోసం నిల్వ ఉంచిన గడ్డివామును గుర్తుతెలియని వ్యక్తులు రెండు రోజుల క్రితం పెట్రోల్ పోసి దగ్ధం చేసినట్లు సమాచారం. ఈ ఘటనలో గడ్డివాము పూర్తిగా కాలిపోయింది. ఈ సంఘటనను తెలుసుకున్న కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ మాధవరం గ్రామానికి చేరుకుని దగ్ధమైన గడ్డివామును పరిశీలించారు. అనంతరం బాధిత కుటుంబాన్ని పరామర్శించి, వారికి ధైర్యం చెప్పారు.
ఈ సందర్భంగా బొల్లం మల్లయ్య యాదవ్ మాట్లాడుతూ, నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీకి లభించిన మెజార్టీ విజయాన్ని జీర్ణించుకోలేక ప్రత్యర్థులు గ్రామాల్లో కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ కార్యకర్తలపై వ్యక్తిగత దాడులు, ఆస్తి నష్టం, భయాందోళనలు సృష్టించడం వంటి ఘటనలు వరుసగా జరుగుతున్నాయని విమర్శించారు.
ఇలాంటి ఘటనలకు స్థానిక ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి ప్రోత్సాహం ఉందని ఆరోపిస్తూ, పోలీసులు కూడా తగిన చర్యలు తీసుకోవడంలో జాప్యం చేస్తున్నారని తెలిపారు. ఇప్పటివరకు ఈ గడ్డివాము దగ్ధం కేసులో నిందితులను గుర్తించకపోవడం పలు అనుమానాలకు దారితీస్తోందని అన్నారు. పోలీసులు వెంటనే స్పందించి, ఈ ఘటనకు బాధ్యులైన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ డిమాండ్ చేశారు. చట్టం, శాంతి భద్రతలు కాపాడేందుకు నిష్పక్షపాత విచారణ అవసరమని ఆయన స్పష్టం చేశారు.