మున్సిపల్​ ఎన్నికల్లో.. బాకీ కార్డులతో విస్తృతంగా ప్రచారం చేయాలి: కేటీఆర్​, హారీష్​ రావు

నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు కోసం సమన్వయంతో పని చేయాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హారీష్రావు ఉమ్మడి జిల్లా మాజీ ఎమ్మెల్యేలకు దిశానిర్ధేశం చేశారు. శనివారం హైదరాబాద్ లో తెలంగాణ భవన్లో ఎన్నికల సన్నాహాక సమావేశం జరిగింది. గత పదేళ్లలో మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి గురించి ప్రజలకు వివరించాలని, అదే క్రమంలో ఈ రెండేళ్లలో కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టాలని, పార్టీ రూపొందించిన బాకీ కార్డును ప్రజల్లో కి విస్తృతంగా తీసుకెళ్లాలని చెప్పారు. పలు నియోజకవర్గాల్లో మాజీలకు, సీనియర్ నాయకులకు మధ్య ఉన్న విభేదాలను తొలగించేందుకు పార్టీ తరపున ఇంచార్జిలను నియమిస్తామని, అభ్యర్థుల ఎంపికలో తేడాలు రాకుండా ఇంచార్జిలు సమన్వయం చేస్తారని తెలిపారు. ఆలేరు, భువనగిరి, మునుగోడు, కోదాడ, హుజూర్నగర్, నాగార్జునసాగర్, దేవరకొండ, నల్లగొండ నియోజకవర్గాల్లో మాజీలకు, సీనియర్ లీడర్లకు మధ్య విభేదాలు ఉన్నాయి. కౌన్సిలర్ టికెట్ల కోసం ఇరువర్గాలు పోటీ పడే పరిస్థితి తలెత్తకుండా ఇంచార్జిలు సమన్వయం చేయనున్నారు.

nlg brs leaders with ktr harish rao

అభ్యర్థులను ఎంపిక చేసేందుకు పార్టీ తరపున సర్వే చేయనున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేనాటికి అభ్యర్థులను ఎంపిక చేయడానికి వార్డుల్లో సర్వే చేస్తారు. రిజర్వేషన్లు ప్రకటించినందున ఏ వార్డులో ఏ అభ్యర్థి అయితే బలంగా ఉంటాడో సర్వేల ద్వారా ఎంపిక చేస్తామని కేటీఆర్, హారీష్రావు చెప్పినట్టు తెలిసింది. ఈ ఎన్నికల్లో పార్టీ బలం 50 శాతం ఉంటే, సామాజిక నేపథ్యం మరొక 50శాతం ప్రభావితం చేయనుంది. దీని ప్రకారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుందని మాజీలకు స్పష్టం చేశారు.

మెజార్టీ సీట్లు గెలవడం పైనే నియోజకవర్గ ఇంచార్జిలు (మాజీ ఎమ్మెల్యేలు) దృష్టి పెట్టాలి. స్థానికంగా ఉన్న సమస్యల గురించి అధికార పార్టీని నిలదీయాలి. గత పదేళ్లలో బీఆర్ఎస్ మున్సిపాలిటీల అభివృద్ధి కొరకు వందల కోట్లు ఖర్చు పెట్టింది. ఆ పనులకే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. రెండేళ్లలో కొత్తగా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టలేదనే సంగతి ప్రజలకు వివరించాలి. వీటితోపాటు తులం బంగారం, నాలుగు వేల ఫించన్ ఇవ్వలేదనే సంగతిని ప్రజలకు తెలియజేయాలి. తద్వారా మెజార్టీ సీట్లు గెలుపొందాలి.

ఎన్నికల ప్రచారానికి పిలిస్తే ఎక్కడికైనా వస్తామని కేటీఆర్, హారీష్ రావు తెలిపారు. కాంగ్రెస్ అధికార దుర్వినియోగానికి పాల్పడే అవకాశం ఉందని, కాబట్టి ఇంచార్జిల కోరిక మేరకు గట్టిపోటీ ఉన్న చోట ఎన్నికల ప్రచారానికి వస్తామని, అభ్యర్థులకు ఆమేరకు భరోసా ఇస్తామని చెప్పారు. ఇప్పటికే సర్వే ప్రారంభమైందని, ఆదివారం నుంచి అన్ని మున్సిపాలిటీల్లో సర్వే ముమ్మరం చేస్తామని మాజీ ఎమ్మెల్యేలకు చెప్పినట్టు తెలిసింది.

Share
Share