APB News Exclusive: ఎపిసోడ్ -2: మళ్లీ బడా బాబులకేనా..? రెడ్‌క్రాస్‌ పగ్గాలు!

నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: నల్లగొండ రెడ్క్రాస్ సొసైటీ ఈ సంస్థ ఇప్పుడు సేవల కంటే పదవుల చుట్టూనే ఎక్కువగా చర్చకు వస్తోంది. తాజాగా ఎన్నికల ప్రక్రియ తెరపైకి రావడంతో మరోసారి పగ్గాలు చేపట్టేందుకు ప్రస్తుత పాలకవర్గం పావులు కదుపుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇన్నేళ్లుగా సంస్థను నడిపించిన వారే మళ్లీ అధికారంలోకి వస్తే రెడ్క్రాస్ పరిస్థితి మారేదేమిటి? ఇప్పటి వరకు ఎదురైన విమర్శలకు సమాధానం చెప్పకుండా మరోసారి పీఠం దక్కించుకోవడమే లక్ష్యంగా వ్యవహరిస్తే సంస్థ సేవలు మరింత కుంటుపడవా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.  హైదరాబాద్ కేంద్రంగా స్థిరపడి, నల్లగొండలో వందల కోట్ల వ్యాపార వ్యవహారాల్లో నిత్యం బిజీగా ఉండే కొందరు ప్రముఖులకు రెడ్క్రాస్ పదవులు చేపట్టేంత సమయం ఉందా? సంస్థను సేవా మార్గంలో నడిపించే సంకల్పం ఉందా? లేక పదవులు సామాజిక హోదా, ప్రతిష్ఠకు చిహ్నాలుగా మారుతున్నాయా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుత పాలకవర్గం పనితీరుపై వస్తున్న విమర్శల నేపథ్యంలో ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత వారిపైనే ఉంది.

రెడ్క్రాస్ వంటి సేవా సంస్థకు నాయకత్వం వహించాలంటే పేరు, పలుకుబడి, ఆర్థిక స్థోమత ఒక్కటే సరిపోవు. ప్రజల అవసరాలను గుర్తించడం, రక్తదాతలను సమీకరించడం, ఆరోగ్య అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం, అత్యవసర సమయాల్లో బాధితులకు అండగా నిలవడం ముఖ్యం. అయితే నల్లగొండ రెడ్క్రాస్లో గత కొన్నేళ్లుగా ఈ తరహా కార్యక్రమాలు ఆశించిన స్థాయిలో సాగడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. వందల కోట్ల రూపాయల ఫైనాన్స్, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు నిర్వహించే ప్రముఖులు వేసవిలో క్లాక్టవర్ సెంటర్ వద్ద చలివేంద్రం ఏర్పాటు చేసి రెండు కుండలతో నీళ్లు అందించినంత మాత్రాన సేవా బాధ్యత పూర్తయినట్లు కాదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. రెడ్క్రాస్ వంటి సంస్థకు రక్తదాన శిబిరాలు, ఆరోగ్య పరీక్షలు, పేద రోగులకు సహాయం, విపత్తుల సమయంలో సహాయక చర్యలు, యువతను సేవా కార్యక్రమాల్లో భాగస్వాములను చేయడం వంటి నిరంతర కార్యక్రమాలు చేపట్టాలి. ఇలాంటి సేవల విషయంలో ప్రస్తుత పాలకవర్గం పనితీరుపై ప్రశ్నలు తలెత్తుతుండటంతో, మరోసారి అవకాశం కోరే ముందు ఇప్పటి వరకు చేసిన సేవల లెక్క చెప్పాలన్న డిమాండ్ వినిపిస్తోంది.

నిజంగానే రెడ్క్రాస్ అభివృద్ధిపై చిత్తశుద్ధి ఉంటే, నిబంధనల ప్రకారం ఎన్నికలు నిర్వహించి కొత్తవారికి అవకాశం కల్పించడంలో అభ్యంతరమేమిటి? రెండేళ్లకోసారి జరగాల్సిన ఎన్నికలు పారదర్శకంగా జరిగాయా? గత 12 ఏళ్లుగా ఒకే కమిటీ కొనసాగుతోందన్న ఆరోపణల వెనుక వాస్తవాలేమిటి? ఏకగ్రీవ తీర్మానాలతోనే పదవులు దక్కించుకుంటున్నారన్న విమర్శలకు సమాధానం ఏమిటి? సేవా సంస్థలో నాయకత్వం అనేది శాశ్వత హక్కు కాదు. సభ్యుల విశ్వాసం, పనితీరు, సేవా కార్యక్రమాల ఆధారంగా నాయకత్వం కొనసాగాలి. ఎన్నికల ప్రక్రియలో పోటీకి, కొత్త ఆలోచనలకు, యువతకు అవకాశం ఉండాలి. కానీ సభ్యత్వాల నమోదు పరిమితంగా ఉండటం, కొత్తవారికి అవకాశాలు తగ్గాయన్న ఆరోపణలు నిజమైతే, ఎన్నికల పారదర్శకతపై సందేహాలు తలెత్తడం సహజమే. ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్న తరుణంలో పాత పాలకవర్గం మరోసారి పగ్గాలు చేపట్టేందుకు ప్రయత్నిస్తోందన్న విమర్శల నేపథ్యంలో, గతంలో సంస్థ ఎలా నడిచింది? ఎన్ని ఎన్నికలు జరిగాయి? ఎన్ని సేవా కార్యక్రమాలు చేపట్టారు? అన్న వివరాలు కీలకంగా మారాయి.

నల్లగొండ రెడ్క్రాస్లో సభ్యత్వాల నమోదు విషయంలో రాష్ట్ర గవర్నర్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. రాష్ట్రస్థాయిలోనే సభ్యత్వాల పరంగా జిల్లా వెనుకబడటంపై ప్రశ్నలు ఎదురవడంతోనే నమోదు ప్రక్రియలో కదలిక వచ్చిందన్న విమర్శలు ఉన్నాయి. అంతకుముందు సుమారు 400 మంది సభ్యులే ఉన్నట్లు చెబుతుండగా, గవర్నర్ జోక్యం తర్వాత కొద్దిరోజుల్లోనే సభ్యుల సంఖ్య 1,200కు చేరినట్లు సమాచారం. ఇక్కడే అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇన్నేళ్లుగా సభ్యత్వాల పెంపుపై ఎందుకు దృష్టి పెట్టలేదు? కొత్త సభ్యులను చేర్చుకోవడానికి ఇప్పటివరకు ఉన్న అడ్డంకులేమిటి? గవర్నర్ ప్రశ్నించిన వెంటనే సభ్యత్వాలు ఇంత వేగంగా ఎలా పెరిగాయి? నమోదు ప్రక్రియలో పారదర్శకత పాటించారా? కొత్తగా చేరిన సభ్యుల వివరాలు, వారి సభ్యత్వ గడువు, ఓటు హక్కు అర్హతలు ఏమిటి? ఎన్నికల వేళ సభ్యత్వాల పెంపు జరిగితే, ఆ ప్రక్రియను ఎవరు పర్యవేక్షిస్తున్నారు? అన్న అంశాలపై స్పష్టత అవసరం.

కొత్త సభ్యులు పెరిగితే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలు విస్తరిస్తాయనే ఉద్దేశంతోనే గతంలో సభ్యత్వ నమోదును పట్టించుకోలేదన్న ఆరోపణలూ వినిపిస్తున్నాయి. ఈ ఆరోపణల్లో వాస్తవమెంతన్నది సభ్యత్వ రిజిస్టర్లు, నమోదు తేదీలు, ఎన్నికల నిబంధనలు పరిశీలిస్తేనే తేలుతుంది. అయితే గవర్నర్ జోక్యం తర్వాతే సభ్యత్వాలపై కదలిక వచ్చిందన్న సమాచారం, సంస్థ నిర్వహణలో ఇప్పటివరకు ఉన్న చురుకుదనంపై ప్రశ్నలు లేవనెత్తుతోంది.

సభ్యత్వాల వివాదం ఒకవైపు ఉంటే, రెడ్క్రాస్ ప్రధాన సేవ అయిన రక్త సేకరణ, పంపిణీ మరోవైపు ప్రశ్నార్థకంగా మారుతున్నాయి. గ్రామాలు, పట్టణాల్లో విస్తృతంగా రక్తదాన శిబిరాలు నిర్వహించి రక్త నిల్వలను పెంచాల్సిన సంస్థలోనే రక్తం కొరత ఎందుకు ఏర్పడుతోంది? సాధారణంగా 60–70 యూనిట్ల వరకు నిల్వలు ఉండాల్సిన చోట 10–15 యూనిట్లకే పరిమితమవుతున్నాయన్న సమాచారం నిజమైతే, ఈ పరిస్థితికి బాధ్యత ఎవరిది? రక్తదాన శిబిరాలు నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందించారా? యువత, స్వచ్ఛంద సంస్థలు, విద్యాసంస్థలను భాగస్వాములను చేసుకున్నారా? అన్న ప్రశ్నలకు సమాధానాలు రావాల్సి ఉంది. గతంలో రెడ్క్రాస్లో ఒక్కో యూనిట్ రక్తం రూ.500–600కే లభించేదని చెబుతుండగా, ప్రస్తుతం ప్రైవేటు ఆసుపత్రుల్లో ఒక్కో యూనిట్కు రూ.2 వేల వరకు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రక్తం కోసం రోగుల కుటుంబాలు ఇబ్బందులు పడుతున్న సమయంలో రెడ్క్రాస్ నిల్వలు ఎందుకు పెరగడం లేదన్న ప్రశ్న మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రైవేటు ఆసుపత్రుల్లో రక్తం ధరలపై వస్తున్న ఆరోపణలు, రెడ్క్రాస్లో నిల్వల కొరతపై సమగ్ర పరిశీలన అవసరం. అయితే ఈ రెండు అంశాల మధ్య సంబంధం ఉందని నిర్ధారించడానికి రక్త సేకరణ, పంపిణీ, ధరలు, లావాదేవీల రికార్డులు పరిశీలించాల్సి ఉంటుంది.

ప్రస్తుత పాలకవర్గం మరోసారి ఎన్నికల్లో విజయం సాధించి రెడ్క్రాస్ పగ్గాలు చేపడితే సంస్థలో మార్పు ఎలా వస్తుందన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇప్పటివరకు వచ్చిన విమర్శలకు సమాధానం చెప్పకుండా, భవిష్యత్తులో ఏం చేస్తామన్న హామీలు మాత్రమే ఇస్తే ప్రజల్లో విశ్వాసం పెరుగుతుందా? గతంలో నిర్వహించిన రక్తదాన శిబిరాల సంఖ్య ఎంత? ఎన్ని యూనిట్ల రక్తం సేకరించారు? ఎంతమంది రోగులకు సహాయం చేశారు? సభ్యత్వాల పెంపునకు ఏ చర్యలు తీసుకున్నారు? సంస్థ ఆదాయ వ్యయాల లెక్కలు ఏమిటి? అన్న వివరాలను ఎన్నికల ముందు ప్రజల ముందుంచాల్సిన అవసరం ఉంది. వ్యాపారాల్లో బిజీగా ఉండే ప్రముఖులు సేవా సంస్థకు సమయం కేటాయించగలరా? అన్న సందేహం వ్యక్తం కావడం వారి ఆర్థిక స్థితి కారణంగా కాదు, సంస్థలో సేవా కార్యక్రమాలపై కనిపిస్తున్న నిర్లక్ష్యంపై వస్తున్న విమర్శల కారణంగా సేవ చేయాలనే నిజమైన సంకల్పం ఉంటే, పెద్ద వ్యాపారవేత్తలైనా సంస్థకు సమయం, వనరులు కేటాయించి ఆదర్శంగా నిలవవచ్చు. కానీ పదవిని ప్రతిష్ఠగా భావించి, సేవా బాధ్యతలను విస్మరిస్తే మాత్రం సంస్థ లక్ష్యమే దెబ్బతింటుంది.

ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలు కేవలం కొత్త పాలకవర్గాన్ని ఎన్నుకునే ప్రక్రియగా మిగిలిపోకూడదు. నల్లగొండ రెడ్క్రాస్ పనితీరుపై వస్తున్న ఆరోపణలకు సమాధానాలు లభించే సందర్భంగా మారాలి. ఎన్నికల నిబంధనలు, సభ్యత్వాల అర్హతలు, ఓటర్ల జాబితా, గత కమిటీల పదవీకాలం, సేవా కార్యక్రమాలు, రక్త నిల్వలు, ఆర్థిక లావాదేవీలపై పారదర్శకత ఉండాలి. జిల్లా కలెక్టర్ పర్యవేక్షణలో సంస్థ కార్యకలాపాలపై సమీక్ష నిర్వహించి, అవసరమైన సంస్కరణలు చేపట్టాలన్న డిమాండ్ వినిపిస్తోంది. ఎవరు పగ్గాలు చేపట్టినా, నల్లగొండ రెడ్క్రాస్ తిరిగి సేవల బాట పట్టకపోతే ఈ ఎన్నికల వల్ల ప్రయోజనం ఏమిటన్న ప్రశ్న మాత్రం మిగిలే ఉంటుంది.

Share
Share