- రంగంలోకి ఎంఈఓ..
- అనుమతులు, సిబ్బంది అర్హతలు, భారీ ఫీజులపై తల్లిదండ్రుల ఆగ్రహం..
- దర్యాప్తు చేపట్టిన ఉప్పల్ మండల విద్యాశాఖ..
హైదరాబాద్/ఉప్పల్, ఏపీబీ న్యూస్, సెప్టెంబర్ 30, 2026): మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఉప్పల్ పరిధిలో కొనసాగుతున్న ప్రముఖ ‘శ్లోకా ది గ్లోబల్ స్కూల్’ (Sloka The Global School) యాజమాన్యంపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పాఠశాల నిర్వహణ, విద్యా ప్రమాణాలు, పరిపాలనా లోపాలు, సిబ్బంది అర్హతలు మరియు భారీ ఫీజుల వసూళ్లకు సంబంధించి విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ఫిర్యాదులు రావడంతో విద్యాశాఖ అధికారులు సీరియస్గా స్పందించారు. ఈ వ్యవహారంపై విచారణ చేపట్టిన విద్యాశాఖ, పాఠశాల యాజమాన్యానికి నోటీసులు జారీ చేసింది.
నగరం నడిబొడ్డున భారీ బహుళ అంతస్తుల భవనాలు, మౌలిక వసతులు ఉన్నప్పటికీ, ఆ స్థాయిలో విద్యా ప్రమాణాలు మరియు విద్యార్థుల పర్యవేక్షణ లేకపోవడంపై తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రిన్సిపల్ అందుబాటులో ఉండకపోవడంపై అసంతృప్తి!
పాఠశాలలో దాదాపు 200 మందికి పైగా విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నప్పటికీ, బాధ్యతాయుతమైన ప్రిన్సిపల్ తరచుగా అందుబాటులో ఉండకపోవడంపై తల్లిదండ్రులు మండిపడుతున్నారు. విద్యార్థుల విద్యా ప్రగతి, భద్రత, కేరింగ్ వంటి సమస్యలపై మాట్లాడేందుకు వెళ్తే పాఠశాల యజమాన్యం నుంచి సరైన స్పందన లభించడం లేదని ఆరోపిస్తున్నారు.
తల్లిదండ్రుల ప్రధాన ఆరోపణలు & సందేహాలు:
పరిపాలనా లోపాలు: ప్రిన్సిపల్ అందుబాటులో లేకపోవడం, విద్యార్థుల పర్యవేక్షణలో నిర్లక్ష్యం వహించడం.
సిబ్బంది వివరాల దాపరికం: పాఠశాల అధికారిక వెబ్సైట్లో బోధన, బోధనేతర సిబ్బంది వివరాలు, వారి విద్యా అర్హతలు పారదర్శకంగా ఉంచకపోవడం.
భారీ ఫీజులు: మౌలిక వసతుల పేరుతో భారీ మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నప్పటికీ, దానికి తగిన విద్యా ప్రమాణాలు అందించకపోవడం.
ప్రభుత్వ అనుమతులు: పాఠశాల నిర్వహణకు అవసరమైన రాష్ట్ర ప్రభుత్వ గుర్తింపు, ఇతర అనుమతులపై స్పష్టత కొరవడటం.
విచారణ జరిపి చర్యలు తీసుకుంటాం: ఎంఈఓ రామారావు
ఈ వివాదంపై ఉప్పల్ మండల విద్యాశాఖాధికారి (MEO) రామారావు స్పందించారు. పాఠశాలకు సంబంధించిన అనుమతులు, రికార్డులను విద్యాశాఖ కార్యాలయంలో ప్రాథమికంగా పరిశీలించిన అనంతరం పాఠశాల యాజమాన్యానికి వివరణ కోరుతూ నోటీసులు ఇచ్చామన్నారు.
పాఠశాలలో ఉన్న లోపాలు, తల్లిదండ్రుల ఆరోపణలపై క్షేత్రస్థాయి విచారణ కొనసాగుతోందని, విచారణ పూర్తయిన తర్వాత నిబంధనల ఉల్లంఘన నిర్ధారణ అయితే యాజమాన్యంపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని ఎంఈఓ స్పష్టం చేశారు. ఈ అంశంపై శ్లోకా ది గ్లోబల్ స్కూల్ యాజమాన్యం అధికారికంగా తమ వివరణ ఇవ్వాల్సి ఉంది.