Breaking News: లంచం అడిగిన చెకింగ్ ఆఫీసర్.. చెప్పుతో కొట్టిన కండక్టర్..

సంగారెడ్డి, ఏపీబీ న్యూస్: ఆర్టీసీలో అవినీతి తిమింగలాల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. టికెట్ లేని ప్రయాణికుడిని పట్టుకుని నిబంధనల ప్రకారం జరిమానా వేయాల్సింది పోయి, అందినకాడికి దండుకోవాలని చూసిన ఒక చెకింగ్ అధికారికి కండక్టర్ మరియు ప్రయాణికులు తగిన శాస్తి చేశారు.

హైదరాబాద్ నుండి నారాయణఖేడ్ వెళ్తున్న ఆర్టీసీ బస్సును సంగారెడ్డి జిల్లా రాయకోడ్ వద్ద టికెట్ స్క్వాడ్ అధికారులు తనిఖీ కోసం ఆపారు. తనిఖీల్లో భాగంగా ఒక ప్రయాణికుడి వద్ద టికెట్ లేదని అధికారులు గుర్తించారు.

సాధారణంగా టికెట్ లేకపోతే ప్రయాణికుడికి జరిమానా విధించి, కండక్టర్పై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలి. కానీ, సదరు చెకింగ్ అధికారి కేసు పెట్టకుండా ఉండాలంటే ప్రయాణికుడి నుండి మరియు కండక్టర్ నుండి కలిపి రూ. 20,000 లంచం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

అధికారి అడిగిన భారీ లంచం విన్న కండక్టర్ ఒక్కసారిగా ఆగ్రహానికి గురయ్యారు. విధి నిర్వహణలో ఉంటూ ఇలాంటి అక్రమాలకు పాల్పడుతున్న ఆ అధికారిని కండక్టర్ అందరి ముందే చెప్పుతో కొట్టారు. కండక్టర్కు మద్దతుగా నిలిచిన ప్రయాణికులు కూడా సదరు అధికారిపై దాడి చేసి దేహశుద్ధి చేశారు.

టికెట్ లేకపోవడం తప్పు అయినప్పటికీ, దానిని ఆదాయ మార్గంగా మార్చుకోవాలని చూసిన అధికారి తీరు గర్హనీయం. సంస్థ ప్రతిష్టను మంటగలుపుతున్న ఇలాంటి అధికారుల వల్ల నిజాయితీగా పనిచేసే కండక్టర్లు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఈ ఘటనపై ఆర్టీసీ ఉన్నతాధికారులు లోతైన విచారణ జరిపి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

Share
Share