Breaking News: రెండో భార్య కూతురిపై అత్యాచారయత్నం.. ఫోక్సో కోర్టు సంచలన తీర్పు..

నల్లగొండ, ఏపీబీ న్యూస్: అతివలు, చిన్నారుల రక్షణే ధ్యేయంగా పనిచేస్తున్న వ్యవస్థలు మరోసారి తమ పటిష్టతను చాటుకున్నాయి. మైనర్ బాలికపై అఘాయిత్యానికి ఒడిగట్టిన వ్యక్తికి నల్లగొండ జిల్లా ఫోక్సో న్యాయస్థానం (SC POCSO NO: 37/2019) గురువారం కఠిన కారాగార శిక్షను ఖరారు చేసింది.

గుంటూరు జిల్లా మాచర్లకు చెందిన ఉప్పుతల దుర్గాప్రసాద్, నాగార్జునసాగర్కు చెందిన ఒక మహిళను రెండో వివాహం చేసుకున్నాడు. ఆ మహిళకు మొదటి భర్త ద్వారా ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వీరంతా బతుకుతెరువు కోసం నార్కట్పల్లి మండలం కొండపాకొనిగూడెంలోని ఒక కోళ్ల ఫారంలో పనికి చేరారు.

ఏప్రిల్ 20, 2018 సాయంత్రం 7:30 గంటల సమయంలో, దుర్గాప్రసాద్ తన భార్య రెండవ కుమార్తె అయిన 14 ఏళ్ల మైనర్ బాలికను ద్విచక్ర వాహనంపై ఎక్కించుకున్నాడు. కొండపాకొనిగూడెం గ్రామ శివారులోని రైల్వే ట్రాక్ సమీపంలో వాహనం ఆపి, బాలికను బలవంతంగా చెట్ల పొదల్లోకి లాక్కొని వెళ్లి అత్యాచారయత్నం చేశాడు. ఆ బాలిక గట్టిగా కేకలు వేస్తూ అక్కడి నుంచి తప్పించుకుని ఇంటికి చేరుకుంది.

బాధిత బాలిక తల్లి ఫిర్యాదు మేరకు నార్కట్పల్లి పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో సుదీర్ఘ విచారణ చేపట్టిన న్యాయస్థానం, ప్రాసిక్యూషన్ సమర్పించిన సాక్ష్యాధారాలను పరిగణనలోకి తీసుకుని నిందితుడు దుర్గాప్రసాద్కు 7 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష మరియు 4000 రూపాయల జరిమానా విధించింది. అంతేకాకుండా, బాధితురాలికి ప్రభుత్వం తరపున 2 లక్షల రూపాయల పరిహారం అందజేయాలని కోర్టు ప్రకటించింది.

ప్రాసిక్యూషన్: స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వేముల రంజిత్ కుమార్ బలమైన వాదనలు వినిపించారు.

పోలీసు యంత్రాంగం: నాటి నార్కట్పల్లి ఎస్ హెచ్ ఓ కె.గోవర్ధన్ మరియు ప్రస్తుత ఎస్ హెచ్ ఓ విష్ణు సమగ్ర ఇన్వెస్టిగేషన్ నిర్వహించారు.

సహకారం: సిడిఓలు నరసింహ, కిరణ్ మరియు భరోసా లీగల్ ఆఫీసర్ మామిడి కల్పన కేసు పురోగతిలో కీలక పాత్ర పోషించారు.

కుటుంబ సభ్యులే కాలయములై మారుతున్న ప్రస్తుత సమాజంలో, ఈ తీర్పు బాధితులకు భరోసాను ఇస్తుంది. నేరం జరిగిన ఆరేళ్ల తర్వాతైనా న్యాయం జరగడం, పోలీసులు మరియు న్యాయ వ్యవస్థ పట్ల ప్రజలకు నమ్మకాన్ని పెంచుతుంది. మైనర్ల పట్ల అసభ్యంగా ప్రవర్తించే ఎవరికైనా ఇదొక హెచ్చరిక.

Share
Share