రికార్డు స్థాయి ప్రగతిపై కలెక్టర్ చంద్రశేఖర్‌కు మంత్రి కోమటిరెడ్డి అభినందనలు..

నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: రైతు సంక్షేమమే పరమావధిగా తమ కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని ఆర్అండ్బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి పేర్కొన్నారు. బుధవారం జిల్లా అధికారులతో జరిగిన ఉన్నత స్థాయి సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. జిల్లాలోని ప్రతి ఎకరాకూ సాగునీరు అందించేందుకు ఏఎంఆర్పీ (AMRP) కాలువల లైనింగ్, బ్రాహ్మణ వెళ్లేముల, ఎస్ఎల్బీసీ (SLBC) సొరంగం వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేస్తున్నట్లు తెలిపారు.

బ్రాహ్మణ వెళ్లేముల ప్రాజెక్టు కింద పెండింగ్లో ఉన్న మైనర్, సబ్ మైనర్ కాలువల పనులపై ఇరిగేషన్ అధికారులతో మంత్రి లోతుగా చర్చించారు.

40 మీటర్ల అడ్డంకి క్లియర్: నార్కెట్పల్లి మండలం కొండపాకోనిగూడెంలో ఒక రైతుకు సంబంధించిన పొలంలో కేవలం 40 మీటర్ల మేర కాలువ పనులు ఆగిపోయిన విషయాన్ని అధికారులు మంత్రి దృష్టికి తెచ్చారు.

కలెక్టర్ నిధుల నుండి పరిహారం: దీనిపై మంత్రి కోమటిరెడ్డి తక్షణమే స్పందిస్తూ.. జిల్లా కలెక్టర్ వద్ద ఉన్న ప్రత్యేక నిధుల నుండి సదరు రైతుకు నష్టపరిహారం మంజూరు చేసి, పనులను వెంటనే ప్రారంభించాలని కలెక్టర్ను అక్కడికక్కడే ఆదేశించారు. కొండపాకోనిగూడెం చెరువు నిండితేనే దోమలపల్లి చెరువుతో పాటు మండలంలోని అన్ని గ్రామాలకు సాగునీరు అందుతుందని మంత్రి గుర్తుచేశారు.

రాష్ట్రంలోనే ధాన్యం సేకరణలో నల్లగొండ జిల్లా ప్రథమ స్థానంలో నిలవడం పట్ల జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ ని, పౌరసరఫరాల అధికారులను మంత్రి ప్రత్యేకంగా అభినందించారు. జిల్లాలో ఈసారి రికార్డు స్థాయిలో ధాన్యం పండిందని హర్షం వ్యక్తం చేశారు.

అయితే, రైతులు ప్రతి సీజన్లో కేవలం వరి పంటనే కాకుండా లాభదాయకమైన ప్రత్యామ్నాయ పంటల (Crop Diversification) వైపు దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. పంట మార్పిడి విధానంపై వ్యవసాయ అధికారులతో పాటు గ్రామీణ మహిళా సంఘాల (ఐకేపీ) ద్వారా రైతుల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలని సూచించారు.

ఆర్ అండ్ బి రహదారుల సమీక్షలో భాగంగా నార్కెట్పల్లి వద్ద రైల్వే ఓవర్ బ్రిడ్జి (ROB) పనులను త్వరితగతిన చేపట్టేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు.

బ్రిడ్జి నిర్మాణానికి అవసరమైన మిగిలిపోయిన భూసేకరణకు సంబంధించి వెంటనే చెల్లింపులు పూర్తి చేసి, పబ్లిక్ నోటీస్ (PN) జారీ చేయాలన్నారు. పనులు ఎక్కడా ఆగకుండా వేగవంతం చేసేందుకు కలెక్టర్ పరిధిలో ఉన్న నిధులను వినియోగించుకోవాలని స్పష్టం చేశారు. ఈ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్, నల్లగొండ మున్సిపల్ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి, రెవెన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, స్థానిక సంస్థల ఇంచార్జ్ అదనపు కలెక్టర్ వై. అశోక్ రెడ్డి, ఆర్అండ్బీ ఎస్ఈ శ్రీధర్ రెడ్డి, పంచాయతీరాజ్ ఈఈ గిరిధర్ రెడ్డి, ఇరిగేషన్ ఈఈ పిచ్చయ్య, పౌరసరఫరాల డీఎం రామ్పతి నాయక్ తదితర ముఖ్య అధికారులు పాల్గొన్నారు.

Share
Share