Breaking News: ఇసుక కోసం ‘చెక్ డ్యాం’ కూల్చివేత: అర్ధరాత్రి ఇసుక మాఫియా అరాచకం..

దేవరకద్ర/మహబూబ్నగర్, ఏపీబీ న్యూస్: నీటి చుక్క కోసం రైతు తపిస్తుంటే.. ఆ నీటిని అడ్డుగా భావించిన ఇసుక మాఫియా ఏకంగా చెక్ డ్యాంనే లక్ష్యంగా చేసుకుంది. మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర మండలం బస్వాపూర్ గ్రామంలో ఇసుక మాఫియా చేసిన అరాచకం ఇప్పుడు స్థానికంగా పెను దుమారం రేపుతోంది.

బస్వాపూర్ సమీపంలోని వాగుపై నిర్మించిన చెక్ డ్యాంలో ప్రస్తుతం పుష్కలంగా నీరు నిల్వ ఉంది. అయితే, ఈ నీరు ఉండటం వల్ల వాగులో ఉన్న ఇసుకను అక్రమంగా తరలించడానికి వీలు పడటం లేదని మాఫియా భావించింది.

అర్ధరాత్రి అటాక్: నీటిని బయటకు పంపేస్తే ఇసుక మేటలు బయటపడతాయని కుట్ర పన్నిన మాఫియా.. మంగళవారం అర్ధరాత్రి సమయంలో భారీ హిటాచీ (Hitachi) యంత్రంతో చెక్ డ్యాం వద్దకు చేరుకుంది.

ధ్వంసం: చెక్ డ్యాం పైభాగాన్ని హిటాచీతో కూల్చివేయడం ప్రారంభించారు. దీంతో నిల్వ ఉన్న నీరు వృథాగా కిందికి వెళ్లడం మొదలైంది.

రైతు సాహసం: అదే సమయంలో పొలం వద్ద ఉన్న ఓ రైతు ఈ అరాచకాన్ని గమనించారు. ప్రాణాలకు తెగించి ఆయన మాఫియాను అడ్డుకోవడంతో, పట్టుబడతామనే భయంతో ఇసుక మాఫియా హిటాచీతో సహా అక్కడి నుండి పరారైంది.

చెక్ డ్యాం పైభాగం దెబ్బతినడంతో నీటి నిల్వ తగ్గిపోతుందని, దీనివల్ల భూగర్భ జలాలపై ప్రభావం పడుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల అండదండలు లేకుండా ఇంత సాహసం చేయలేరని, వెంటనే విచారణ జరిపి నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.

ప్రభుత్వం లక్షల రూపాయలు వెచ్చించి నిర్మించిన చెక్ డ్యాంలను మాఫియా కూల్చివేస్తుంటే నిఘా వర్గాలు ఏం చేస్తున్నాయి? ఒక సామాన్య రైతు అడ్డుకోకపోయి ఉంటే ఈపాటికి ఆ చెక్ డ్యాం నామరూపాల్లేకుండా పోయేది. ఇసుక దందా కోసం జలవనరులను నాశనం చేయడం క్షమించరాని నేరం.

Share
Share