APB News Exclusive: ఎపిసోడ్ -8: కతాలగూడలో భూముల్లో.. తవ్వేకొద్ది అక్రమాలు

నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: నల్లగొండ కార్పోరేషన్ పరిధిలోని కతాలగూడ డివిజన్ లో భూముల వ్యవహారంలో తవ్వేకొద్దీ కొత్త అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే 504, 505 సర్వే నంబర్ల భూములకు సంబంధించిన వివాదాలు చర్చనీయాంశంగా మారగా, తాజాగా 524 సర్వే నంబర్ భూముల్లోనూ నకిలీ రిజిస్ట్రేషన్లు జరిగినట్లు పక్కా ఆధారాలు లభ్యమయ్యాయి. ధరణి పోర్టల్లోని లొసుగులను అడ్డంపెట్టుకుని కొందరు అక్రమార్కులు భూములను చేతులు మారుస్తున్నట్లు తెలుస్తోంది. రెవెన్యూ రికార్డుల్లో తగిన మార్పులు చేయకపోవడం, క్షేత్రస్థాయిలో పరిశీలన లేకపోవడంతో ఈ అక్రమాలకు అవకాశం ఏర్పడిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. స్లాట్ బుక్ కావడమే ఆలస్యం, భూముల అసలు స్థితిగతులు పరిశీలించకుండా రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి.

సుమారు 30 ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్న కొత్త వెంచర్లో అసలు రైతులు ఎవరు, నకిలీ రైతులు ఎవరు అనే విషయాన్ని అధికారులు గుర్తించలేక పోతున్నారు. స్లాట్ బుక్ కాగానే క్షేత్రస్థాయి పరిశీలన లేకుండా రెవెన్యూ అధికారులు భూముల రిజిస్ట్రేషన్లు చేయడం వివాదాలకు దారితీస్తోంది. ఇప్పటికే 504, 505 సర్వే నంబర్లలో 12.30 గుంటల భూమికి సంబంధించి జరిగిన అక్రమ డబుల్ రిజిస్ట్రేషన్ వ్యవహారాన్ని ఏపీబీ న్యూస్ వరుస కథనాల ద్వారా వెలుగులోకి తీసుకురాగా, అధికారులు ఆ రిజిస్ట్రేషన్ను రద్దు చేసిన విషయం తెలిసిందే. తాజాగా 524 సర్వే నంబర్లోనూ అదే తరహాలో నకిలీ రిజిస్ట్రేషన్లు జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. క్షేత్రస్థాయిలో ఉనికిలో లేని భూములకు సైతం రిజిస్ట్రేషన్లు జరగడం వివాదాస్పదంగా మారింది. రెవెన్యూ రికార్డుల్లో మ్యూటేషన్ జరగకపోవడం, ధరణి రికార్డుల్లో ఎలాంటి మార్పులు లేకపోవడంతో పట్టాదారు పాస్పుస్తకాల ఆధారంగానే భూముల లావాదేవీలు కొనసాగుతున్నాయి. ఆయా భూములకు రైతుబంధు ప్రయోజనాలు కూడా అందుతున్నట్లు తెలుస్తోంది.

కతాలగూడ కు చెందిన కొందరు దళారుల చేతుల్లో నల్లగొండ రెవిన్యూ ఆఫీసర్లు కీలు బొమ్మలుగా మారిపోయారనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. రెవిన్యూ రికార్డుల్లో భూములు మార్పులు చేయకపోవడాన్ని ఆసరాగా చేసుకుని, కొందరు దళారులు మధ్యవర్తిత్వం వహిస్తూ పట్టాదారు పాస్పుస్తకాల ఆధారంగా భూములను విక్రయిస్తున్నారు. ఫలితంగా అదే సర్వే నంబర్ల పరిధిలో రైతులు బాట కోసం, అలాగే ముత్యాలమ్మ, కట్టమైసమ్మ గుళ్ల కోసం, శ్మశాన వాటికల కోసం వదిలి పెట్టిన స్థలాలను సైతం రియల్టర్లు స్వాధీనం చేసుకుంటుండటంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

సర్వే నంబర్ 524/4లో 0.3450, 524/13/1/1లో 0.06 గుంటలు, 524/10/1లో 0.06 గుంటలు మొత్తం కలిపి ఒక ఎకరం 3గుంటల జాగ ఎప్పుడో 2003లోనే ప్లాట్ల కింద ఇతరులకు విక్రయించారు. ఇదే సర్వే నంబర్లో అప్పట్లో మహాలక్ష్మీ వెంచర్ అని ఏర్పాటు అయ్యింది. దీనిలో భాగంగా రైతుల భూములను రియల్టర్లకు విక్రయించారు. 2003 నుంచి 2024 వరకు సుమారు 30 మందికి రోడ్లతో సంబంధం లేకుండా ప్లాట్లను విక్రయించారు. కానీ ఈ భూమి రెవిన్యూ రికార్డుల్లో మారలేదు. రికార్డుల్లో మ్యూటేషన్ చేయకపోవడంతో ధరణి పోర్టల్లో యధావిధిగా ఎక్కింది. వీటి ఆధారంగా టీ282000222050 నంబర్ తో పాసుపుస్తకం కూడా జారీ అయ్యింది. దీనికి రైతుబంధు కూడా వస్తోంది. ఇదే సర్వే నంబర్లలో ఇప్పుడు కొత్త వెంచర్ ఏర్పాటు చేస్తున్నందున చాలా మంది రైతులు భూములు విక్రయిస్తున్నారు. వీళ్లలో కొందరు రైతులు తమకు భూమి లేదనే సంగతి తెలిసి కూడా దళారులు డబ్బు ఆశ చూపడంతో గతంలో విక్రయించిన భూములనే మళ్లీ ఇతరులకు విక్రయించి అక్రమాలకు పాల్పడుతున్నారు. పట్టాదారు పాసుపుస్తకం ఆధారంగా రిజిస్ట్రేషన్ స్లాట్ బుక్ కాగానే, ఆఫీసర్లు తడుముకోకుండా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు.

ఇదే పద్ధతిలో 524/4 సర్వే నంబర్లో పేర్కొన్న 34.50 గుంటల భూమిలో 22 గుంటల స్థలాన్ని గతేడాది అక్టోబర్ 25న నల్లగొండ తహాశీల్దార్ ఆఫీసులో రిజిస్ట్రేషన్ జరిగింది. డాక్యుమెంట్ నంబర్ 1969/2025 పేరు మీద ఇతరులకు విక్రయించడం జరిగిందని కతాలగూడ రైతులు చెప్పారు. మిగతా 12.50 గుంటల స్థలాన్ని తమ వారసుల పేరు మీద ఇంకో రిజిస్ట్రేషన్ జరిగింది. వీళ్లద్దరి పేర్ల మీద రిజిస్టర్ అయిన ఈ 34.50గుంటల స్థలాన్ని మళ్లీ ఈ ఏడాది మార్చి 28న రియల్టర్లకు విక్రయించారు. ఆ డాక్యుమెంట్ నంబరు 363/20 26అని స్థానిక రైతులు చెప్పారు. అదేవిధంగా ఒక మహిళ పేరు మీద ఉన్న 4 గుంటల జాగను మరొక దళారి ఏకంగా తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకున్నాడని చెప్తున్నారు. ఎవరికైతే భూమి లేకుండా పట్టా ఉందో కనిపెట్టి వాళ్లతో నకిలీ రిజిస్ట్రేషన్లు చేయించడం ఇతని బాధ్యత అని, దీనిలో భాగంగానే ఒక మహిళ పేరు మీద ఉన్న 4 గుంటల జాగను ఈ ఏడాది ఫిబ్రవరి 26న తహాశీల్దార్ ఆఫీసులో రిజిస్ట్రేషన్ చేశారు. డాక్యుమెంట్ నంబర్ 264/2026 అని స్థానిక రైతులు చెప్పారు. ఇలాంటి అక్రమాలు చాలా ఉన్నాయని, వెంచర్ చేస్తున్న సర్వే నంబర్లలో క్షుణ్ణంగా పరిశీలిస్తే నకిలీ రిజిస్ట్రేషన్ల అసలు బండారం బయట పడుతుందని రైతులు చెప్తున్నారు.

Share
Share