Viral News: ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ పిచ్చితో లైక్స్ కోసం ‘ఆత్మహత్య’ డ్రామా.. చివరికి..

కామారెడ్డి, ఏపీబీ న్యూస్: వ్యూస్ వస్తే చాలు, ప్రాణాలైనా పణంగా పెట్టేందుకు సిద్ధపడుతున్నారు నేటి కాలం యువత. కామారెడ్డి పట్టణానికి చెందిన రెడ్లాన్ రోహిత్ అనే యువకుడు ఇన్స్టాగ్రామ్లో ఫేమస్ అవ్వడం కోసం తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ఒక వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ వీడియో కాస్తా వైరల్ కావడంతో ఆందోళన చెందిన నెటిజన్లు పోలీసులకు సమాచారం అందించారు.

రోహిత్ పోస్ట్ చేసిన వీడియోను చూసి అతను నిజంగానే ఆత్మహత్య చేసుకుంటున్నాడని భావించిన పోలీసులు తక్షణమే స్పందించారు. టెక్నాలజీ సాయంతో అతని లోకేషన్ను గుర్తించి, హుటాహుటిన రోహిత్ ఇంటికి చేరుకున్నారు. తీరా అక్కడికి వెళ్లేసరికి రోహిత్ క్షేమంగా ఉండటంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే, కేవలం ఇన్స్టాగ్రామ్లో లైక్స్, ఫాలోవర్లను పెంచుకోవడానికే ఈ ఆత్మహత్య డ్రామా ఆడానని అతను ఒప్పుకోవడంతో పోలీసులు నిర్ఘాంతపోయారు.

సామాన్య ప్రజలను ఆందోళనకు గురిచేయడమే కాకుండా, అత్యవసర సేవలందించే పోలీసుల విలువైన సమయాన్ని మరియు వనరులను వృథా చేసినందుకు రోహిత్పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

సోషల్ మీడియా కీర్తి కోసం ఇతరులను భయభ్రాంతులకు గురిచేయడం నేరం. యువత ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ వంటి వేదికలను సృజనాత్మకత కోసం వాడుకోవాలి తప్ప, ఇలాంటి విపరీత ధోరణులకు పాల్పడకూడదు. రోహిత్ చేసిన పని వల్ల నిజంగా ఆపదలో ఉన్న వారికి సాయం అందడంలో జాప్యం జరిగే ప్రమాదం ఉంది.

Share
Share