Video:డాక్టర్లను తిట్టి తప్పు చేశాను.. క్షమించండి..

హైదరాబాద్ బ్యూరో, ఏపీబీ న్యూస్: సోషల్ మీడియాలో లైకులు, వ్యూస్ కోసం ఆకతాయిలు ఎంతటి తెగింపునకైనా వెనుకాడటం లేదు. ప్రాణాలు కాపాడే ప్రభుత్వ ఆసుపత్రిని సైతం తమ రీల్స్ పిచ్చికి వేదికగా మార్చుకుంటున్నారు. హైదరాబాద్లోని గాంధీ ఆసుపత్రిలో ప్రభుత్వ ఆస్తిని దొంగిలించి, విధుల్లో ఉన్న వైద్యులను అసభ్య పదజాలంతో దూషిస్తూ ఇన్స్టాగ్రామ్లో రీల్ (Instagram Reel) పోస్ట్ చేసిన ఒక యువకుడి వ్యవహారం నగరంలో తీవ్ర కలకలం రేపింది. అయితే, ఈ ఘటనపై వైద్య సంఘాలు, పోలీసులు సీరియస్ కావడంతో సదరు ఆకతాయి లైన్లోకి వచ్చాడు. “డాక్టర్లను తిట్టి తప్పు చేశాను.. నన్ను క్షమించండి” అంటూ మరో వీడియోను విడుదల చేయడం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.

బాధితులు మరియు ఆసుపత్రి వర్గాల కథనం ప్రకారం.. సదరు యువకుడి పిన్ని అనారోగ్యంతో గాంధీ ఆసుపత్రిలో చేరింది. ఈ క్రమంలో వార్డులో ఉన్న సిబ్బందిని ఆమెకు బీపీ చెక్ చేయాల్సిందిగా యువకుడు కోరాడు.

వైద్యులపై దూషణలు: అక్కడ విధుల్లో ఉన్న జూనియర్ డాక్టర్లు వేరే అత్యవసర కేసులో బిజీగా ఉండటంతో కాస్త సమయం పడుతుందని చెప్పారు. దీనికి ఆగ్రహం చెందిన యువకుడు డాక్టర్లను ఇష్టమొచ్చినట్లు దూషించాడు.

రీల్ కోసం చోరీ: అంతటితో ఆగకుండా, ఆసుపత్రి వార్డులో ఉన్న ప్రభుత్వానికి చెందిన బీపీ మిషన్ను (BP Machine) దొంగిలించి, దాన్ని పట్టుకుని నడుచుకుంటూ వెళ్తున్నట్లు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో ఒక రీల్ రికార్డ్ చేసి ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేశాడు.

వైద్యుల నిరసన – పోలీసుల రంగప్రవేశం: ప్రభుత్వ ఆస్తిని దొంగిలించడమే కాకుండా, పవిత్రమైన వైద్య వృత్తిలో ఉన్న ల్యాబ్ అసిస్టెంట్లను, వైద్యులను అవమానించడంపై గాంధీ ఆసుపత్రి జూనియర్ డాక్టర్ల అసోసియేషన్ (JUDA) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. చిలకలగూడ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో లీగల్ యాక్షన్ ప్రారంభమైంది.

పోలీసులు రంగంలోకి దిగి గాలింపు చేపట్టడంతో భయపడిపోయిన సదరు ఆకతాయి యువకుడు.. తన తప్పును ఒప్పుకుంటూ తాజాగా క్షమాపణ వీడియో విడుదల చేశాడు. “ఆవేశంలో డాక్టర్లను తిట్టి చాలా పెద్ద తప్పు చేశాను. నన్ను పెద్ద మనసుతో క్షమించండి. నా ఇన్స్టాగ్రామ్ రీల్ చూసి నాలాగా ఎవరూ ఇటువంటి పిచ్చి పనులు చేయకండి. నిజానికి మా పిన్ని గాంధీ ఆసుపత్రిలో చేరితే ఇక్కడి వైద్యులు చాలా బాగా చూసుకుంటున్నారు. ఉచితంగా మంచి వైద్యం అందిస్తున్నారు. దయచేసి నన్ను వదిలేయండి” అని సదరు యువకుడు కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఈ ఘటనపై స్పందించిన నగర పోలీసులు.. క్షమాపణలు చెప్పినంత మాత్రాన చట్టం నుండి తప్పించుకోలేరని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యుల రక్షణకు భంగం కలిగిస్తే లీగల్ చర్యలు కఠినంగా ఉంటాయని హెచ్చరిస్తున్నారు.

Share
Share