- డ్యూటీ, ఒత్తిడి ప్రాణం తీసింది..
- డిప్యూటీ సీఎం భట్టి చీఫ్ పీఆర్వో(CPRO) మృతికి షాకింగ్ కారణాలు
- ఈసీజీ(ECG) నార్మల్ కానీ గుండె ఆగింది.
- ‘సార్కు చెప్పండి’… అదే ‘అన్న’ చివరి మాట
- “అంబులెన్స్‌లోనే పోరాటం.. మూడుసార్లు కార్డియాక్ అరెస్ట్“
- 24 గంటల డ్యూటీ.. నిద్ర, తిండి లేదు.
- సిస్టమ్ ఒత్తిడికి బలి.. చీఫ్ పీఆర్వో మదన్న విషాద గాధ
నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చీఫ్ పీఆర్వో(CPRO) మారబోయిన మధు సూధన్ (మదన్న) మరణం ఒక సాధారణ హార్ట్ ఎటాక్ కాదు.. అది నెమ్మదిగా పేరుకుపోయిన ఒత్తిడి, అలసట, నిర్లక్ష్యం కలిసిన విషాదాంతం. ఈసీజీ(ECG) నార్మల్గా వచ్చినా.. గుండెల్లో ప్రమాదం దాగి ఉంది. చికిత్స కొరకు పరుగులు తీస్తుండగానే మూడుసార్లు కార్డియాక్ అరెస్ట్.. గంట సేపు డాక్టర్లు ప్రయత్నించిన ప్రాణం దక్కలేదు. “సార్కు చెప్పండి…” స్పృహలోకి వచ్చిన క్షణాల్లో పలికిన ఆ మాటే ఆయన చివరి మాట అయింది. రోజుకు 10 నుంచి 15 గంటల డ్యూటీ.. నిద్రలేదు, తిండి లేదు.. ఫోన్ కాల్స్ తో నిండిన జీవితం.. ఇదే మదన్న జీవితం.
మరణించడానికి కొన్ని గంటల ముందు..
మదన్న మరణించడానికి కొన్ని గంటల ముందు చోటుచేసుకున్న పరిణామాలు విన్నాక నా హృదయం బద్దలైంది. మధ్యాహ్నాం 1 గంటకు ప్రజా భవన్ కు చేరుకున్న కొద్దిసేపటికి చాతిలో నొప్పిగా ఉందని తోటి ఉద్యోగులకు చెప్పడంతో గ్యాస్ ప్రాబ్లమ్ అనుకుని టాబ్లెట్ ఇచ్చారు, కానీ ఆ మరుక్షణమే ఎడమ చేయి గుంజుతోందని సహచరులకు చెప్పిన వెంటనే హుటాహుటిన పక్కనే ఉన్న వివేకానంద ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికే మదన్న ఆ విషయాన్ని డాక్టర్ అయిన తన తమ్ముడికి ఫోన్ లో సమాచారం ఇచ్చాడు. దాంతో ఆయన సూచన మేరకు వెంటనే ఆసుపత్రిలో మదన్నకు ఈసీజీ తీశారు. ఈసీజీ నార్మల్ గానే వచ్చింది. మళ్లీ టుడి(2D Echo) తీయమని చెప్పగానే డాక్టర్లు వెంటనే ఆ పని మొదలు పెట్టారు. దాంట్లో బ్లడ్ క్లాట్స్ కనిపిస్తున్నాయని డాక్టర్లు నిర్ధారించారు. స్టంట్ వేయాలని సూచించారు. ఇదంతా జరుగుతుండగానే మదన్నకు ఒక్కసారిగా బలమైన స్ట్రోక్ వచ్చింది. దాంతో స్పృహ కోల్పోయిండు. వెంటనే సీపీఆర్(CPR) చేశారు. మదన్న లో కదలిక వచ్చింది. అన్నా..! ఒకేనా..? అని పక్కనే ఉన్న తన సహచరుడు మదన్నను పలకరించిండు.
అన్న పలికిన చివరి మాటలు అవే..
దాంతో మదన్న ఒకే అని తన సహచరుడికి తంబ్ (బొటనవేలు) చూపించిండు. “సార్ కు చెప్పండి” (భట్టి) అని అతనితో చెప్పిండు. అన్న పలికిన చివరి మాటలు అవే. ఆ తర్వాత వెంటనే మెరుగైన వైద్యం కోసం అమీర్పేట్ లోని అపోలో స్పెక్ట్రా హాస్పిటల్ కి తీసుకెళ్లేందుకు అంబులెన్స్ ఏర్పాటు చేశారు. వివేకానంద ఆసుపత్రి అంబులెన్స్ లోకి ఎక్కిస్తుండానే మరోసారి స్ట్రోక్ వచ్చింది. దాంతో మదన్న పూర్తిగా స్పృహ కోల్పోయిండు. అక్కడి నుంచి అమీర్పేట్ అపోలోకు తరలించగానే అప్పటికే డాక్టర్లు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు. అంబులెన్స్ నుంచి మదన్నను ఎమర్జెన్సీ వార్డుకు తరలించి స్టంట్ వేశారు. ఆ తర్వాత ఎమెర్జన్సీ వార్డుకు తరలించగానే మూడోసారి స్ట్రోక్ వచ్చింది. డాక్టర్లు ఎంత ప్రయత్నించినప్పటికీ స్పృహ రాలేదు. కార్డియాక్ అరెస్ట్ అని డాక్టర్లు నిర్ధారించారు. వెంటలేటర్ మీద ఉంచి గంటసేపు శథవిధాలుగా ప్రాణం కాపాడేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. మధ్యాహ్నాం 3.30 గంటలకు కన్నుమూసిండనే సంగతిని ఆసుపత్రి యాజమాన్యం భట్టి విక్రమార్కకు సమచారం అందించింది. వెంటనే ఆయన ఆసుపత్రికి చేరుకున్నారు. అక్కడే ఉన్న కుటుంబ సభ్యులకు మదన్న చనిపోయిండనే విషయాన్ని వెంటనే చెప్పకుండా డాక్టర్లు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు అని ఓదార్చారు. ఆ తర్వాత కొంత తేరుకుని మదన్న చనిపోయండని విషయాన్ని సాయంత్రం 4.40 గంటలకు పక్కనే ఉన్న మదన్న తమ్ముడుకి చెప్పిండు. మదన్నకు చాతిలో నొప్పి ఉందంటే ఆసుపత్రికి తీసుకొచ్చామని భార్య జ్యోతి, కొడుకు సూరజ్, ఇతర కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. భర్త చనిపోయాడనే సమాచారం భార్య జ్యోతికి వెంటనే చెప్పలేదు. ఆమె ఎమర్జన్సీ వార్డులోకి వెళ్లే వరకు రహస్యంగానే ఉంచారు. లోపలికి వెళ్లాక భర్త చనిపోయిండని తెలియగానే బెడ్ మీదనే చలనం లేకుండా ఉన్న ఆరడుగుల మనిషిని చూశాక బోరుమని విలిపించింది.
డ్యూటీ పట్ల నిబద్ధత.. ప్రజాభవన్ లో స్ట్రెస్..
సీనియర్ జర్నలిస్టుగా వివిధ జిల్లాల్లో పనిచేసిన మదన్న, వృత్తి పట్ల ఎంత నిబద్ధత కలిగిన వ్యక్తి అని చెప్పడానికి చివరి నిమిషంలో ఆయన ‘సార్కు చెప్పండి’ అని పలికిన మాటలే నిదర్శనం. ఐదు నిమిషాలు మదన్న కళ్ల ముందు కనిపించకపోయినా భట్టి ఊకోడని చెప్తుంటారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రోజుకు 10 గంటల పాటు డ్యూటీలో ఉండాల్సిందే. జర్నలిజంలో పని చేసే సంస్థకే జవాబు దారులం, కానీ చీఫ్ పీఆర్వో, పీఆర్వోలు పది పేపర్లు, వందల చానళ్ల భారం అంతా మోయాల్సిందే. కవరేజ్ విషయంలో ఎక్కడా తేడా వచ్చినా సీఎం మొదలు, మంత్రులు, ఎమ్మెల్యేల నుంచి చివాట్లు పడాల్సిందే. సహజంగానే ఒకరితో మాట పడటం అంటే ఇష్టం ఉండని మదన్న ఈ విషయంలో ఒకింత జాగ్రత్తగానే ఉన్నడు. కానీ ఆ జాగ్రత్త అన్ని పేషీలతో పోలిస్తే ప్రజాభవన్లో తీవ్రత ఎక్కువనే ఉంటదని మదన్న అనేక సందర్బాల్లో నాతో చెప్పినప్పుడు లైట్గా తీసుకున్నా. ఎంత కష్టపడి పనిచేసినప్పటికీ దాంట్లో ఏదో ఒక చిన్న లోపం కనిపెట్టడం భట్టి నైజమని చెప్పినప్పుడు పెద్దగా పట్టించుకోలే. అన్ని పేషీల్లో మంత్రులు చెప్పిందే నోట్ చేసుకోవడం వరకే పీఆర్వోల డ్యూటీ, కానీ భట్టి విషయంలో పూర్తిగా భిన్నం. ఆయన కదలికలు, హావాబావాలను నిషితంగా గమనించాలి. మీడియా కవరేజ్ ఏమాత్రం తేడా వచ్చినా అస్సలు ఒప్పుకోడని మదన్న చెప్పినప్పుడు కూడా లైట్ గానే తీసుకున్నా, కానీ మరణించాక నిజమని తెలిసి నిర్ఘాతపోయా.
బడ్జెట్ బడ్జెట్ సెషన్స్ నుంచే వీక్..
రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నప్పటి నుంచే మదన్న ఆరోగ్యంలో తేడా కనిపించిందని సహచరులు చెప్పారు. వారం, పది రోజులు బాగా సిక్ అయ్యిండని తెలిసింది. పీఆర్వో రామకృష్ణ కాలువిరిగి రెస్ట్లో ఉన్న ఆరు నెలలు భారం కూడా మదన్నే మోయాల్సి వచ్చింది. రోజుకు రెండు షిప్ట్లు డ్యూటీ. ఉదయం 8 నుంచి సాయంత్రం 6 గంటల వరకు మదన్న. మధ్యాహ్నాం 3 నుంచి రాత్రి 10 గంటల వరకు పీఆర్వో డ్యూటీ లో ఉంటాడని కుటుంబ సభ్యులు చెప్పారు. గత ఆరు నెలల నుంచి చీఫ్ పీఆర్వో, పీఆర్వో రెండు విధులు మదన్న మోయాల్సి రావడంతో పని భారం పెరిగింది. తీవ్రమైన ఒత్తిడి, అలసట మొదలయ్యాయి. డయాబెటిక్ సమస్య ఎక్కువైంది. కాళ్లు గుంజడం, వొళ్లు వణకడం మొదలైంది. కుటుంబ సభ్యులు కూడా ఉద్యోగం వదిలేయమని వారించారు. షుగర్ కంట్రోల్ కావట్లేదని చెప్పారు, కానీ వృత్తి పట్ల నిబద్థత కలిగిన వ్యక్తి కావడం, తన భార్య, కొడుకు, తల్లి, తమ్ముళ్లకు సర్వసం మదన్నే. ఏ సమస్య వచ్చినా అన్నింటికి ముందుండే పెద్ద మనిషి. మదన్న తండ్రి మరణించాక బాధ్యతలు మరింత పెరిగాయి. దాంతో ఉద్యోగం వదలిపెడితే కుటుంబ సభ్యులు ఇబ్బందుల్లో పడ్తారని భావించి ఒప్పుకోలేదు.
టైంకు తిండి, నిద్ర కరువే.. దిగజారిన పరిస్థితులు..
సీఎంలు, మంత్రుల వద్ద పీఆర్వో, చీఫ్ పీఆర్వోలుగా పనిచేయడానికి జర్నలిస్టులు ఆసక్తి చూపిస్తుంటారు. బీఆర్ఎస్ హాయాంలో అలా పనిచేసిన జర్నలిస్టులకు ఒకింత ప్రయోజనం నెరవేరింది, కానీ కాంగ్రెస్ లో పరిస్థితులు మునిపటిలా లేవు. పీఆర్వో, చీఫ్పీఆర్వోల పరిస్థితి ఘోరంగా మారింది. సపరేట్ వెహికల్స్ ఉండవు. టైంకు నిద్ర, తిండి లేదు. జీతం తప్పా మరో ఆదాయం లేదు. ఇచ్చే జీతంలో కూడా సగం చేతికిచ్చి, సగం జేబులో వేసుకుని మంత్రులు, ఎమ్మెల్సీలు ఉన్నారంటే ఆశ్యర్యం కలుగుతుంది. మంత్రులు, ఎమ్మెల్సీలు పెట్టే బాధలు భరించలేక చాలా మంది ఉద్యోగాలు వదిలివెళ్లి పోయారు. ప్రభుత్వ శాఖల నుంచి పీఆర్వోలుగా వచ్చిన వారు సైతం చెప్పాపెట్టకుండా ఉద్యోగం మానేసిన సందర్బాలు ఉన్నాయి. ఇంతటి తీవ్రమైన ఒత్తిడి భరించలేక చాలా సందర్భాల్లో మదన్న తన బాధను నాతో షేర్ చేసుకునే వాడు. నోటికొచ్చినట్టు రారా.. పోరా అని పిలిచే మినిస్టర్లు కూడా ఉండటం తీవ్రంగా కలిచివేస్తోంది.
చివరి క్షణాల్లోనూ దూరమే.. భట్టి గైర్హాజరుతో చర్చ
మదన్నతో పాటు ప్రజాభవన్ లో ఉండేది మీడియా తరపున ముగ్గురు, నలుగురే, కానీ చివరి చూపు కూడా వాళ్లు నోచుకోలేకపోయారు. మంగళవారం మదన్న అంత్యక్రియలు మిర్యాలగూడెంలో జరిగినప్పుడు డిప్యూటీ సీఎం ఎందుకు రాలేదని చాలా మంది చర్చించుకున్నారు. ఖమ్మంలో పని చేసినప్పటి నుంచే ఇద్దరి మద్య 20 ఏళ్ల అనుబంధం ఉంది. మా జిల్లా మంత్రి ఉత్తమ్ తన వద్ద ఉండమని కోరినప్పటికీ మదన్న ఒప్పుకోలేదంటే భట్టితో మదన్నకు ఉన్న అనుబంధాన్ని మనం అర్ధం చేసుకోవచ్చు. భట్టి విక్రమార్క పీపుల్స్ యాత్ర చేపట్టినప్పుడు నల్గొండ జిల్లాలో అప్పుడున్న కాంగ్రెస్ సీనియర్లు ఎవరూ పట్టించుకోలేదు. దాంతో మదన్న యాత్రను ముందుండి నడిపించాడు. చివరకు భట్టికి వడదెబ్బ తగిలి నకిరేకల్ సమీపంలో చాలా రోజులు విశ్రాంతి తీసుకున్నప్పుడు మదన్న రేయింబవళ్లు ఆయన వెంటే ఉండి బాగోగులు చూసుకున్నాడు. మీడియాతో పాటు, స్థానికంగా ఉండే కాంగ్రెస్ లీడర్లతో మాట్లాడి జనాన్ని సమీకరించాడు. అంతటి స్నేహబావం కలిగిన భట్టి ఆసుపత్రికి వచ్చారు. కానీ అంత్యక్రియలకు రాకపోవడం బాధాకరం. భట్టి వస్తే ఆయనతోపాటే తోటి ఉద్యోగులు వద్దామని అనుకున్నారు, కానీ ఆయనే రాకపోవడంతో మదన్నతో రెండేళ్లు పనిచేసిన సహోద్యోగులకు చివరి చూపు కూడా దక్కపోవడం విషాదకరం.
భట్టి నుంచి రూ. 60 వేలే.. కోమటిరెడ్డి రూ.5 లక్షలు..
మదన్న చనిపోయిన రాత్రి బాడీనీ మిర్యాలగూడెంకు తరలించే క్రమంలో అంత్యక్రియల నిమిత్తం ప్రజాభవన్ నుంచి రూ.60వేల ఆర్ధిక సాయం మాత్రమే అందింది. అంబులెన్స్ కు రూ.12 వేలు, భార్య, పిల్లలు, కుటుంబ సభ్యుల కొరకు ఇన్నోవా పంపారు. కనీసం అంత్యక్రియలకు లక్ష రూపాయాలు కూడా ఇవ్వకపోవడం బాధాకరం. మదన్న ఆకస్మిక మరణంతో కుటుంబం దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. కొడుకు ఎంటెక్ చదువుతున్నాడు. భార్య జ్యోతి ప్రభుత్వ టీచర్. ఆస్తిపాస్తులు పెద్దగా కూడపెట్టుకున్నది ఏమీ లేదు. భార్య జ్యోతి కూడా మదన్నకు మరదలు వరస కాగా మంగళవారం అంత్యక్రియలకు హాజరైన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తక్షణ ఆర్ధిక సాయం కింద రూ.5లక్షలు అందించడం తన ఉదారతను మరోసారి చాటుకున్నారు. అంతేగాక మదన్న కొడుకు సూరజ్ కు భరోసా ఇవ్వడం గమనార్హం.
‘కమ్యూనిస్టులకు స్థూపాలు… జర్నలిస్టులకు నివాళులు’
చివరకు మిగిలేది ఇదే…
మీ
పసుపులేటి కిరణ్
సీనియర్ జర్నలిస్ట్,
ఏపీబీ న్యూస్ నల్లగొండ ప్రతినిధి, 9010448054.