Breaking News: ఉగ్రవాదుల తరహా దాడి.. దోషులను వదిలిపెట్టేదే లేదు: సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

హైదరాబాద్, ఏపీబీ న్యూస్: శాసనసభ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో చోటుచేసుకున్న కుట్రపూరిత సంఘటనలను ప్రభుత్వం అత్యంత తీవ్రంగా పరిగణిస్తోందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ ఉదంతంలో బాధ్యులైన వారందరిపై సమగ్ర విచారణ జరిపించి, క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షిస్తామని శాసనసభ వేదికగా వెల్లడించారు.

అసెంబ్లీ సమావేశాల తొలిరోజు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ను ఉద్దేశించి దుర్భాషలాడటం, దళితులు నడిచిన నేలను శుద్ధి చేయడం వంటి దురదృష్టకర సంఘటనలపై యావత్ శాసనసభ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా స్పీకర్ కి సభ యావత్తూ అండగా నిలుస్తుందని, మానసిక ధైర్యాన్ని కోల్పోవద్దని విజ్ఞప్తి చేసింది.

బుధవారం శాసనసభలో జరిగిన సుదీర్ఘ చర్చకు సభా నాయకుడు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమాధానమిచ్చారు:

పథకం ప్రకారం జరిగిన దాడి: “ఉన్మాదానికి లోనై, ఉసిగొల్పబడిన కొంతమంది ముష్కరులు అధికారులపై దాడులు చేయడమే కాకుండా సభాపతి స్థానాన్ని, వారి తల్లి గారిని తీవ్రంగా అవమానించారు. దేశంపై దాడికి ప్రయత్నించిన ఉగ్రవాదులు, తీవ్రవాదులకు.. సభాపతిని అవమానిస్తూ మాట్లాడిన మాటలకు ఏమాత్రం తేడా లేదు. ఇది ఒక పక్కా పథకం ప్రకారం జరిగిన దుర్మార్గపు దాడి.”

తెలంగాణ సమాజం ఉపేక్షించదు: “మనది మాతృస్వామ్య సమాజం. స్త్రీని భద్రకాళి, భూమాత, భారతమాత, తెలంగాణ తల్లి అని పూజిస్తాం. అలాంటి తెలంగాణ నేల మీద ఒక తల్లిని అవమానించడం దారుణం. రజాకార్లనే దిగంతాలకు తరిమి మట్టికరిపించిన చరిత్ర ఈ గడ్డది. సభాపతికి జరిగిన అవమానం సమాజానికే జరిగినట్లు, దోషులను తెలంగాణ సమాజం ఎప్పటికీ ఉపేక్షించదు.”

చట్ట ప్రకారం శిక్ష తప్పదు: “ప్రజాస్వామ్యంలో నిరసనలకు ఎన్నో మార్గాలు ఉన్నాయి. కానీ సభాపతి మనస్సును గాయపరచాలనే బరితెగించి వ్యవహరించారు. బాధ్యులను చట్టపరంగా శిక్షించే విషయంలో ప్రభుత్వం పూర్తి బాధ్యతతో వ్యవహరిస్తుంది.”

సెప్టెంబర్ 7వ తేదీ నుంచి ప్రారంభమైన శాసనసభ సమావేశాల్లో ప్రజా సమస్యలపై సుదీర్ఘంగా చర్చించాలని ప్రభుత్వం భావించిందని ముఖ్యమంత్రి తెలిపారు. విద్యారంగానికి సంబంధించిన సమస్యలు, ధరణి అక్రమాలు, 22(ఎ) భూముల వివాదాలతో పాటు ప్రతిపక్షాలు లేవనెత్తిన కీలక అంశాలపై చర్చకు సిద్ధపడ్డామని, అయితే ఉద్దేశపూర్వకంగానే ప్రజా సమస్యలు చర్చకు రాకుండా అడ్డుకున్నారని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు.

Share
Share