హైదరాబాద్‌: వైన్ షాప్‌లోకి చొరబడి రౌడీ షీటర్ దారుణ హత్య..

హైదరాబాద్, ఏపీబీ న్యూస్: హైదరాబాద్ నగరంలో మరోసారి రౌడీ మూకలు రెచ్చిపోయాయి. నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలో నడిరోడ్డుపై సినిమా ఫక్కీలో ఒక వ్యక్తిని వేటకొడవళ్లు, కత్తులతో వెంటాడి దారుణంగా హత్య చేసిన ఘటన కలకలం రేపింది. ప్రత్యర్థుల దాడి నుంచి ప్రాణాలు కాపాడుకునేందుకు ఓ వైన్ షాప్లోకి వెళ్లి దాక్కున్నప్పటికీ, దుండగులు వదలకుండా లోపలికి చొరబడి నరికి చంపేశారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హత్యకు గురైన వ్యక్తిని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందుకు చెందిన రౌడీ షీటర్ నయీమ్గా పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. గత కొంతకాలంగా పాత కక్షలు ఉన్న నేపథ్యంలోనే ప్రత్యర్థులు పక్కా ప్లాన్ ప్రకారం ఈ దాడికి పాల్పడినట్లు అనుమానిస్తున్నారు.

సోమవారం ఉదయం నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బండ్లగూడ వద్ద ఉన్న ‘సుప్రీమ్ వన్స్’ (Supreme Wines) షాప్ సమీపంలో ఈ ఘోరం చోటుచేసుకుంది. కారులో వచ్చిన గుర్తుతెలియని ముఠా, నయీమ్ను టార్గెట్ చేస్తూ కత్తులు, వేటకొడవళ్లతో ఒక్కసారిగా దాడికి దిగింది.

వెంబడించిన దుండగులు: ప్రాణభయంతో పరుగులు తీసిన నయీమ్, సుప్రీమ్ వైన్స్ షాప్లోకి చొరబడి తలదాచుకునే ప్రయత్నం చేశాడు.

వైన్స్ లోపలే నరికివేత: షాప్లోకి చొరబడిన దుండగులు వైన్స్ లోపలే నయీమ్పై విచక్షణారహితంగా దాడి చేసి తీవ్ర రక్తస్రావంతో అక్కడికక్కడే ప్రాణాలు తీశారు.

కారులో పరార్: దారుణానికి ఒడిగట్టిన అనంతరం నిందితులు వచ్చిన కారులోనే వేగంగా పరారయ్యారు.

సమాచారం అందుకున్న వెంటనే నాగోల్ పోలీసులు, స్పెషల్ టీమ్స్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించాయి. వైన్ షాప్ను తమ ఆధీనంలోకి తీసుకుని క్లూస్ టీమ్ ద్వారా ఆధారాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పరిసర ప్రాంతాల సీసీటీవీ (CCTV) కెమెరాల ఆధారంగా నిందితులు వచ్చిన వాహనం సంఖ్యను, పారిపోయిన మార్గాన్ని గుర్తించేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. పాత కక్షల కోణంలో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు వేగవంతం చేశారు.

Share
Share