APB News Exclusive: నల్లగొండ మాదిగలపై వీరేశం గురి..!

నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: మాదిగ సామాజిక వర్గాన్ని ఏకతాటిపైకి తీసుకురావడంతో పాటు ఆ వర్గంలోని యువత, విద్యార్థులు, ఉద్యోగార్థులకు అండగా నిలిచేలా ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే వీరేశం మరో అడుగు ముందుకు వేస్తున్నట్టు సమాచారం. ఇందులో భాగంగా మాదిగ గ్లోబల్ ఫౌండేషన్ ఏర్పాటు చేసి, రాష్ట్రవ్యాప్తంగా సామాజిక కార్యక్రమాలను విస్తరించేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. తొలుత నల్లగొండను కేంద్రంగా చేసుకుని కార్యక్రమాలను ప్రారంభించి, క్రమంగా ఇతర ప్రాంతాలకు విస్తరించేలా ప్రణాళిక రూపొందిస్తున్నట్టు సమాచారం.

ఫౌండేషన్ కార్యక్రమాలను పక్కాగా అమలు చేసేందుకు వివిధ రంగాల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు, మేధావులు, లాయర్ల సహకారం తీసుకోవాలని ప్రణాళిక రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది. సామాజిక, విద్యా, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో అవసరమైన మార్గనిర్దేశం అందించేలా ఆయా రంగాలకు చెందిన వారిని భాగస్వాములను చేయాలని భావిస్తున్నట్టు సమాచారం.

ఇందులో భాగంగా ఇప్పటికే నల్లగొండలో మాదిగలను ఏకతాటిపైకి తీసుకురావడంలో కీలకంగా వ్యవహరించే ముఖ్యులకు బాధ్యతలు అప్పగించినట్టు ప్రచారం జరుగుతోంది. గ్రామ, పట్టణ స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు నెట్వర్క్ను బలోపేతం చేసే దిశగా కసరత్తు జరుగుతున్నట్టు తెలుస్తోంది.

వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి నల్లగొండ నియోజకవర్గం ఎస్సీగా మారితే, ఇక్కడి నుంచే పోటీ చేయడానికి ఫౌండేషన్ కార్యక్రమాలు కూడా దోహదపడతాయని వీరేశం వర్గం భావిస్తున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ఇప్పటి నుంచే నల్లగొండలో మాదిగ సామాజిక వర్గాన్ని బలోపేతం చేసుకునే కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇస్తున్నారనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది.

వీరేశం తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటి నుంచే యువత, విద్యార్థులపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఆయన ప్రారంభించిన ‘ఉద్దీపన’ కార్యక్రమాలు అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా చర్చకు వచ్చాయి. సొంత నిధులు సమకూర్చి పేద విద్యార్థుల చదువులకు సహకరించడం, వారికి విద్యా అవకాశాలు కల్పించేందుకు చేయూతనివ్వడం ద్వారా ప్రత్యేక గుర్తింపు పొందారు.

అదే సమయంలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని అన్ని వర్గాల యువతను లక్ష్యంగా చేసుకుని వారిని చైతన్యవంతులుగా తీర్చిదిద్దే కార్యక్రమాలను కూడా కొనసాగించారు. దీంతో యువతలో వీరేశంకు మంచి క్రేజ్ ఏర్పడిందనే అభిప్రాయం ఆయన అనుచరుల్లో ఉంది.

ఇప్పుడు మరో అడుగు ముందుకేసి ‘మాదిగ గ్లోబల్ ఫౌండేషన్’ పేరుతో విస్తృత కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాలని భావిస్తున్నట్టు సమాచారం. ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనతో పాటు విద్య, న్యాయపరమైన సహాయం, యువతకు మార్గనిర్దేశం వంటి అంశాలపై ఫౌండేషన్ ద్వారా పనిచేయాలని ప్రణాళిక రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది.

మాదిగల సామాజిక అభ్యున్నతికి ఫౌండేషన్ సేవలు ఉపయోగపడటంతో పాటు, రాజకీయంగా తన ఎదుగుదలకు కూడా ఈ కార్యక్రమాలు దోహదపడతాయని వీరేశం వర్గం భావిస్తున్నట్టు సమాచారం. ఒకవైపు సామాజిక సేవా కార్యక్రమాలు, మరోవైపు యువతతో నిరంతర అనుసంధానం.. ఇప్పుడు మాదిగ సామాజిక వర్గాన్ని సంఘటితం చేసే ప్రయత్నం.. ఇవన్నీ రానున్న రాజకీయ పరిణామాలను దృష్టిలో పెట్టుకున్న వ్యూహంలో భాగమా అన్న చర్చ నల్లగొండ రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపుతోంది.

Share
Share