Video:మాజీ ఎమ్మెల్యే బట్టలు చింపేసిన పోలీసులు.. నల్లగొండ జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత

నల్లగొండ/పెద్దవూర, ఏపీబీ న్యూస్: తెలంగాణ శాసనసభ వద్ద బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులపై పోలీసుల తోపులాట, దాడులకు నిరసనగా ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా నిరసన జ్వాలలు ఎగిసిపడ్డాయి. నాగార్జునసాగర్ నియోజకవర్గ పరిధిలోని పెద్దవూర మండల కేంద్రంలో బీఆర్ఎస్ శ్రేణులు చేపట్టిన రాస్తారోకో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. నాగార్జునసాగర్ మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఆందోళన కార్యక్రమంలో పోలీసులు వ్యవహరించిన తీరుపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.

హైదరాబాద్లోని శాసనసభ ప్రాంగణం వద్ద నల్ల చొక్కాలతో నిరసన తెలిపేందుకు వెళ్లిన కేటీఆర్, హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి తదితర బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అడ్డుకోవడాన్ని ఖండిస్తూ పెద్దవూర జాతీయ రహదారిపై గులాబీ శ్రేణులు బైఠాయించాయి.

బీఆర్ఎస్ శ్రేణుల రాస్తారోకోతో జాతీయ రహదారిపై వాహనాలు భారీగా నిలిచిపోయాయి. సమాచారం అందుకుని అక్కడికి చేరుకున్న పెద్దవూర ఎస్సై, ఇతర పోలీసు సిబ్బంది బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో తీవ్ర అసభ్యకరంగా, అనుచితంగా ప్రవర్తించారని స్థానికులు తెలిపారు.

పోలీసుల దౌర్జన్యం: ఆందోళన విరమింపజేసే క్రమంలో పోలీసులు మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్తో తోపులాటకు దిగారు. ఈ క్రమంలో భగత్పై పోలీసులు దాడి చేసి ఆయన దుస్తులు చింపివేసినట్లు బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు.

ఎస్సై వైఖరిపై తీవ్ర ఆగ్రహం: శాంతియుతంగా నిరసన తెలుపుతున్న ప్రజాప్రతినిధులు, కార్యకర్తలపై ఎస్సై దౌర్జన్యానికి దిగడంపై ఆందోళనకారులు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

రోడ్డుపైనే బైఠాయింపు: పోలీసుల రౌడీయిజం నశించాలంటూ మాజీ ఎమ్మెల్యే భగత్ కుమార్, పార్టీ శ్రేణులు రోడ్డుపైనే పడుకుని రాత్రంతా ఆందోళన చేపట్టారు. ‘పోలీస్ దౌర్జన్యం నశించాలి’, ‘రేవంత్ రెడ్డి డౌన్ డౌన్’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పాలనలో ప్రజాస్వామ్యం పూర్తిగా ఖూనీ అయిందని మండిపడ్డారు. అసెంబ్లీలో మాజీ మంత్రులు, మహిళా ఎమ్మెల్యేలపై దాడులు చేయడం, జిల్లాల్లో నిరసన తెలిపే మాజీ ఎమ్మెల్యేల దుస్తులు చింపివేయడం రేవంత్ రెడ్డి అహంకారానికి నిదర్శనమని ధ్వజమెత్తారు. పోలీసులను అడ్డుపెట్టుకుని రాజకీయం చేస్తే కాలమే తగిన బుద్ధి చెబుతుందని హెచ్చరించారు. దాడికి పాల్పడిన ఎస్సై, సంబంధిత పోలీసు సిబ్బందిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో సాగర్ నియోజకవర్గ వ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం చేస్తామని బీఆర్ఎస్ నాయకులు స్పష్టం చేశారు.

Share
Share