- పూణేలో ఇండియన్ ఆయిల్ ‘MC²+ IGNITE’ సదస్సు
- ఏడు ఇంధన పరివర్తన అంశాల్లో 30 డీప్-టెక్ స్టార్టప్లకు ఎంపిక..
- ఒక్కో స్టార్టప్కు రూ. 50 లక్షల వరకు నిధులు అందించనున్నట్లు ఏఎస్ సహానీ వెల్లడి
హైదరాబాద్/పూణే, ఏపీబీ న్యూస్: దేశీయ ఇంధన రంగంలో సరికొత్త సాంకేతిక ఆవిష్కరణలు, డీప్-టెక్ స్టార్టప్లను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) కీలక అడుగు వేసింది. వెంచర్ సెంటర్, సీఎస్ఐఆర్ – నేషనల్ కెమికల్ లాబొరేటరీ (NCL) భాగస్వామ్యంతో పూణేలోని ఎన్సీఎల్ ఆడిటోరియంలో భారత ఫ్లాగ్షిప్ ఎనర్జీ ఇన్నోవేషన్ యాక్సిలరేటర్ ‘MC²+ IGNITE’ ఔట్రీచ్ కార్యక్రమాన్ని నిర్వహించింది.
కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ మార్గదర్శకత్వంలో ‘MC² ఫౌండేషన్’ ఆధ్వర్యంలో జరిగిని ఈ సదస్సులో దేశంలోని ప్రముఖ ఇంధన రంగ సంస్థలు, పరిశోధనా కేంద్రాలు, శాస్త్రవేత్తలు మరియు డీప్-టెక్ స్టార్టప్ వ్యవస్థాపకులు పాల్గొన్నారు.
‘మేక్ ఇన్ ఇండియా’ నుంచి ‘ఓన్ ఇన్ ఇండియా’ వైపు: డాక్టర్ ఆర్.ఏ. మాషెల్కర్
కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న పద్మవిభూషణ్ డాక్టర్ ఆర్.ఏ. మాషెల్కర్ మాట్లాడుతూ.. “దేశంలోని ఇంధన దిగ్గజాలు తమ ప్రయోగశాలలు, మార్గదర్శకత్వం, పెట్టుబడులు మరియు మార్కెట్ అవకాశాలను భారతీయ ఆవిష్కర్తల కోసం సమకూర్చడం అభినందనీయం. భారతదేశం ‘మేక్ ఇన్ ఇండియా’ నుంచి ‘ఇన్నోవేట్ ఇన్ ఇండియా’ వైపు, ఆపై సొంత మేధో సంపత్తి కలిగిన ‘ఓన్ ఇన్ ఇండియా’ వైపు పయనించాలి” అని స్టార్టప్లకు పిలుపునిచ్చారు.
‘MC²+ IGNITE’ సదస్సు – ప్రధాన ముఖ్యాంశాలు:
భాగస్వామ్యం: ఇండియన్ ఆయిల్, సీఎస్ఐఆర్-ఎన్సీఎల్ ఉమ్మడిగా ముఖ్యంగా హైడ్రోజన్ మరియు మొబిలిటీ రంగాలపై ప్రత్యేకంగా దృష్టి సారించనున్నాయి.
30 డీప్-టెక్ స్టార్టప్లకు అవకాశం: ఏడు ప్రధాన ఇంధన పరివర్తన అంశాల్లో గరిష్టంగా 30 డీప్-టెక్ స్టార్టప్లను ఈ ప్రోగ్రామ్ ద్వారా ఎంపిక చేస్తారు.
రూ. 50 లక్షల వరకు నిధులు: ఎంపికైన ప్రతి స్టార్టప్కు రూ. 50 లక్షల వరకు కన్వర్టిబుల్ ఫండింగ్ లభిస్తుంది.
అదనపు ప్రోత్సాహకం: డెమో డే రోజున అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన స్టార్టప్లకు అదనంగా మరో రూ. 1.5 కోట్ల నిధులు అందుతాయి.
ఐపి (IP) హక్కులు భద్రం: స్టార్టప్ వ్యవస్థాపకులు తమ మేధో సంపత్తి (IP) హక్కులను పూర్తిగా తమ వద్దే ఉంచుకోవచ్చు.
స్టార్టప్లకు మౌలిక సదుపాయాలు కల్పిస్తాం: ఇండియన్ ఆయిల్ చైర్మన్ ఏ.ఎస్. సహానీ
సదస్సులో ఇండియన్ ఆయిల్ చైర్మన్ ఏ.ఎస్. సహానీ మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా మరియు భారతదేశంలో ఇంధన డిమాండ్ వేగంగా పెరుగుతున్నప్పటికీ, దేశీయ స్టార్టప్ పెట్టుబడుల్లో ఇంధన రంగానికి చేరుతున్న వాటా చాలా స్వల్పంగా ఉందన్నారు. ‘MC²+ IGNITE’ ద్వారా ఇండియన్ ఆయిల్ ప్రాథమిక ప్రయోగశాల స్థాయి దాటిన ఆవిష్కరణలను పారిశ్రామిక స్థాయిలో పరీక్షించడానికి తమ మౌలిక సదుపాయాలను స్టార్టప్లకు ఉచితంగా అందుబాటులోకి తెస్తోందని స్పష్టం చేశారు. ఈ సదస్సులో MC² ఫౌండేషన్ మరియు వెంచర్ సెంటర్ మధ్య అవగాహన ఒప్పందం (MoU) కుదిరింది. ఈ కార్యక్రమాన్ని ఐఐటీ మద్రాస్ అమలు చేస్తుండగా.. ఐఐటీ కాన్పూర్, వెంచర్ సెంటర్, సీ-క్యాంప్, ఐఐఎం అహ్మదాబాద్లు ఇంక్యుబేషన్ కేంద్రాలుగా వ్యవహరిస్తున్నాయి. కార్యక్రమంలో డాక్టర్ ఆశిష్ లేలే, డాక్టర్ మధుకర్ గార్గ్, డాక్టర్ ఉమేష్ శ్రీవాస్తవ తదితర ప్రముఖులు పాల్గొన్నారు.