Breaking News: సాగర్‌ నీటి కోసం ఎంతకైనా సిద్ధం.. గేట్లు బద్దలు కొట్టైనా నీటిని తీసుకుంటాం: జగదీష్‌రెడ్డి

మిర్యాలగూడ, ఏపీబీ న్యూస్: సాగునీటి కోసం అవసరమైతే నాగార్జునసాగర్ ప్రాజెక్టు గేట్లు బద్దలు కొట్టైనా నీటిని తీసుకుంటామని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత గుంటకండ్ల జగదీష్రెడ్డి అన్నారు. సాగునీటి విడుదలను డిమాండ్ చేస్తూ మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు ఆధ్వర్యంలో గురువారం మిర్యాలగూడలో నిర్వహించిన రైతు మహాధర్నాలో ఆయన మాట్లాడారు.

కృష్ణా జలాల్లో తెలంగాణకు ఉన్న హక్కుల మేరకు నికర జలాలను వినియోగించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. గతంలో సాగర్లో నీటిమట్టం తక్కువగా ఉన్నప్పటికీ రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని నీటిని విడుదల చేసిన ఘనత అప్పటి సీఎం కేసీఆర్కు దక్కుతుందని పేర్కొన్నారు. సాగర్ నీటి విషయంలో గతంలో 17 పర్యాయాలు రైతుల కోసం నీటిని విడుదల చేశామని తెలిపారు.

ఆంధ్రా పాలకులు సాగునీటిని తరలించుకుపోతుంటే తెలంగాణ రైతులు ఆందోళన చెందుతున్నారని అన్నారు. నల్లగొండ, మహబూబ్నగర్ జిల్లాల కళ్ల ముందే నీరు తరలిపోతున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. జిల్లాకు చెందిన మంత్రులు రైతుల సమస్యలపై దృష్టి పెట్టకుండా పదవుల కోసం ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారని ఆరోపించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఇదే విధంగా వ్యవహరిస్తే నల్లగొండ జిల్లా ఎడారిగా మారే ప్రమాదం ఉందని జగదీష్రెడ్డి హెచ్చరించారు. మిర్యాలగూడలో రైతు మహాధర్నా నిర్వహించనున్న విషయం తెలియడంతోనే ప్రభుత్వం ముందస్తుగా నీటిని విడుదల చేసిందని అన్నారు.

ఎడమ కాల్వకు నీరు ఇవ్వకుండా కుడి కాల్వకు నీటిని విడుదల చేస్తున్న సమయంలో కేసీఆర్ పాదయాత్ర చేపట్టి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చారని గుర్తు చేశారు. సాగర్ గేట్లు బద్దలు కొడతామని హెచ్చరించిన సందర్భంలో అప్పటి ప్రభుత్వం స్పందించి నీటిని విడుదల చేసిందని తెలిపారు.

ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి చేపట్టిన నిరసన దీక్షను ప్రస్తావిస్తూ.. రైతుల కోసం ముఖ్యమంత్రి, మంత్రుల ఇళ్ల ఎదుట ఆందోళన చేస్తే మరింత ప్రభావం ఉండేదని జగదీష్రెడ్డి వ్యాఖ్యానించారు.

మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో మిర్యాలగూడ నియోజకవర్గం గణనీయమైన అభివృద్ధి సాధించిందన్నారు. గ్రామాల్లో రోడ్లు, డ్రైనేజీతో పాటు పలు అభివృద్ధి పనులు చేపట్టామని చెప్పారు.

రైతులకు సాగునీటి ఇబ్బందులు లేకుండా ఆరు ఎత్తిపోతల పథకాలను మంజూరు చేయించామని, అవి పూర్తయితే నియోజకవర్గంలోని పంట పొలాలకు సాగునీరు అందుతుందని తెలిపారు. వీర్లపాలెంలో యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనన్నారు.

ప్రస్తుత ఎమ్మెల్యే వెయ్యి రోజుల పాలనలో నియోజకవర్గ అభివృద్ధికి ఒక్క రూపాయి కూడా తీసుకురాలేదని భాస్కర్రావు విమర్శించారు. భవిష్యత్లోనూ అభివృద్ధి చేస్తారన్న నమ్మకం లేదన్నారు. మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే మిర్యాలగూడ మరింత అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు.

సాగర్ నీటి కోసం నిర్వహించిన మహాధర్నాకు రైతులు, బీఆర్ఎస్ శ్రేణులు భారీగా తరలివచ్చారు. దీంతో మిర్యాలగూడలోని ప్రధాన రహదారులు జనసందోహంతో కిక్కిరిశాయి. సాగర్రోడ్డు, నల్లగొండ రోడ్డు, కోదాడ రోడ్లపై బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో కనిపించారు.

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సాయంత్రం 4.30 గంటల ప్రాంతంలో హనుమాన్పేట ఫ్లైఓవర్ వద్దకు చేరుకోగా.. పార్టీ శ్రేణులు, ప్రజలు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం ర్యాలీగా ఎన్ఎస్పీ క్యాంప్గ్రౌండ్కు తరలివెళ్లారు. కేటీఆర్ రాక సందర్భంగా పలుచోట్ల ‘కాబోయే సీఎం కేటీఆర్’ అంటూ నినాదాలు చేశారు.

సభలో భాగంగా గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన రైతు డిక్లరేషన్, రైతు బంధు, రుణమాఫీ తదితర అంశాలకు సంబంధించిన హామీలు, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన దృశ్యాలను స్క్రీన్పై ప్రదర్శించారు. మహాధర్నా ప్రకటించిన వెంటనే ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి చిల్లర రాజకీయాలకు తెరలేపారని బీఆర్ఎస్ నేతలు విమర్శించారు.

కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ధీరావత్ రవీంద్రకుమార్, గాదరి కిశోర్కుమార్, నోముల భగత్కుమార్, చిరుమర్తి లింగయ్య, కంచర్ల భూపాల్రెడ్డి, కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి, తిప్పన విజయసింహారెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్, మాజీ జడ్పీ ఛైర్మన్ బండా నరేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Share
Share