- ముందుగా కేటీఆర్ పాదయాత్ర.. ఆపై కేసీఆర్ బస్సుయాత్ర
- ప్రజలను సమాయత్తం చేసేందుకు కార్యాచరణ..
- రానున్న రెండేళ్లలో బీఆర్ఎస్ యాక్షన్ ప్లాన్
- వచ్చే ఎన్నికల్లో గెలుపు గుర్రాలకే టికెట్లు..
- డీలిమిటేషన్ పైనే పార్టీ దృష్టి
- వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్యనే పోటీ
- దేశవ్యాప్తంగా బీజేపీ చరిష్మా తగ్గుతోంది: నల్లగొండలో మీడియాతో కేటీఆర్
నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇచ్చిన మూడేళ్ల గడువు డిసెంబర్‌తో ముగియనుండటంతో బీఆర్ఎస్ ఇక రాజకీయంగా గేర్ మార్చేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటివరకు ప్రభుత్వం ఏర్పడిన వెంటనే దూకుడుగా వ్యవహరించడం సరికాదన్న ఉద్దేశంతో వేచి చూసిన పార్టీ.. డిసెంబర్ 7తో మూడేళ్ల గడువు పూర్తికానుండటంతో ఆ తర్వాత కార్యాచరణను ఉధృతం చేయాలని నిర్ణయించినట్లు కేటీఆర్ వ్యాఖ్యలను బట్టి స్పష్టమవుతోంది. “డిసెంబర్ తర్వాత కారు గేర్ మారుస్తాం” అన్న ఆయన వ్యాఖ్యలు పార్టీ భవిష్యత్ రాజకీయ వ్యూహంపై ఆసక్తిని పెంచాయి. గురువారం నల్లగొండలో మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో కేటీఆర్.. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో బీఆర్ఎస్ ఓటమికి దారితీసిన కారణాలు, పార్టీ బలహీనతలు, భవిష్యత్ కార్యాచరణ పై సుదీర్ఘంగా చర్చించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే దూకుడుగా వ్యవహరిస్తే బాగుండదని ఇన్నాళ్లు వేచి చూశామని, ఈ ఏడాది డిసెంబర్ 7 నాటికి మూడేళ్ల గడువు పూర్తవుతుందని చెప్పారు. ఇక ఆ తర్వాత బీఆర్ఎస్ సత్తా ఏంటో చూపించేలా కార్యాచరణ ఉంటుందని స్పష్టం చేశారు.
రేవంత్ కు సమయం దగ్గరపడ్డది..
కేసీఆర్ బయటకు రావడం లేదంటూ రేవంత్‌రెడ్డి చేస్తున్న విమర్శలకు కూడా ఇక సమాధానం చెప్పే సమయం ఆసన్నమైందన్న సంకేతాలను కేటీఆర్ ఇచ్చారు. అయితే, వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ముందు కేసీఆర్ బస్సు యాత్ర చేపట్టేలా ప్రణాళిక సిద్ధం చేస్తుండగా, అంతకంటే ముందే ప్రజలను సమాయత్తం చేసేందుకు కేటీఆర్ పాదయాత్ర చేపట్టాలని నిర్ణయించినట్లు ఆయన వ్యాఖ్యల ద్వారా తెలుస్తోంది. తద్వారా రాష్ట్రంలో బీఆర్ఎస్ను క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయడంతో పాటు.. పార్టీ శ్రేణులను, ప్రజలను రానున్న రాజకీయ పోరాటానికి సిద్ధం చేసే దిశగా ఉద్యమ కార్యాచరణ రూపొందుతున్నట్లు స్పష్టమవుతోంది. కేసీఆర్ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం బస్సు యాత్ర చేపట్టనున్నట్లు కేటీఆర్ వెల్లడించారు. అదే క్రమంలో తాను కూడా పాదయాత్ర ప్రారంభించనున్నట్లు తెలిపారు. ముందుగా కేటీఆర్ పాదయాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపడంతో పాటు పార్టీకి అనుకూల వాతావరణాన్ని నిర్మించి.. అనంతరం కేసీఆర్ బస్సు యాత్రతో ఆ రాజకీయ కార్యాచరణను మరింత విస్తృతం చేసే అవకాశం కనిపిస్తోంది.
రెండేళ్లకు పకడ్బందీ కార్యాచరణ
రానున్న రెండేళ్ల కాలం బీఆర్ఎస్కు అత్యంత కీలకమని భావిస్తున్న పార్టీ ఈ వ్యవధిలో పకడ్బందీ కార్యాచరణతో ముందుకు వెళ్లేందుకు సిద్ధమవుతోంది. పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు ఇప్పటికే యాక్టివ్ మోడ్‌లోకి వచ్చారని కేటీఆర్ తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలన పూర్తయిన సందర్భంగా బీఆర్ఎస్ ఇచ్చిన పిలుపు మేరకు చేపడుతున్న కార్యక్రమాలకు ప్రజల నుంచి విశేష స్పందన వస్తోందని అన్నారు. ఇదే ఉత్సాహాన్ని కొనసాగిస్తూ క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయాలని భావిస్తున్నారు. ప్రజా సమస్యలపై ఉద్యమాలు, పార్టీ కార్యక్రమాలు, నాయకుల క్షేత్రస్థాయి పర్యటనలు, ప్రభుత్వంపై రాజకీయ పోరాటం వంటి అంశాలను కలిపి రానున్న రెండేళ్లకు బీఆర్ఎస్ కార్యాచరణను సిద్ధం చేయనున్నట్లు కేటీఆర్ వ్యాఖ్యలు సూచిస్తున్నాయి. ఈ క్రమంలో ఉమ్మడి నల్లగొండతో పాటు ఖమ్మం, మహబూబ్‌నగర్, వరంగల్ జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు ఆయన తెలిపారు. గత ఎన్నికల్లో ఈ జిల్లాల్లో పార్టీకి ఎదురైన ఫలితాలను సమీక్షించి, వచ్చే ఎన్నికల నాటికి పార్టీ బలాన్ని పెంచుకునేలా వ్యూహాన్ని అమలు చేయనున్నారు.
ఈసారి ‘గెలుపు గుర్రాలకే’
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక విషయంలోనూ బీఆర్ఎస్ కీలక మార్పులకు సిద్ధమవుతోంది. గతంలో చేసిన కొన్ని పొరపాట్ల వల్ల పార్టీ నష్టపోయిందన్న విషయాన్ని గుర్తించామని కేటీఆర్ తెలిపారు. మళ్లీ అలాంటి తప్పిదాలు పునరావృతం కాకుండా విజయావకాశాలు ఉన్న అభ్యర్థులనే బరిలో దింపుతామని చెప్పారు. “వచ్చే ఎన్నికల్లో గెలుపు గుర్రాలకే టికెట్లు ఇస్తాం” అన్న కేటీఆర్ వ్యాఖ్యలు.. గతంలో పార్టీకి ఉన్న సంబంధాలు, పాత సమీకరణాల కంటే గెలిచే సామర్థ్యానికే ఈసారి ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు స్పష్టం చేస్తున్నాయి. కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చడం వల్ల ఫలితాలు మెరుగుపడతాయని భావిస్తే.. అక్కడ మార్పులు, చేర్పులు తప్పకుండా ఉంటాయని ఆయన చెప్పారు. దీంతో వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ టికెట్ల కేటాయింపులో క్షేత్రస్థాయి బలం, ప్రజాదరణ, విజయావకాశాలు ప్రధాన ప్రామాణికాలుగా మారనున్నాయి.
డీలిమిటేషన్ పైనా ఆసక్తి
రాష్ట్రంలో నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) అంశంపైనా కేటీఆర్ స్పందించారు. దీనిపై తాను వేచి చూస్తున్నానని తెలిపారు. డీలిమిటేషన్ కారణంగా నియోజకవర్గాల స్వరూపంలో మార్పులు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో.. దానికి అనుగుణంగా పార్టీ భవిష్యత్ వ్యూహాన్ని రూపొందించాల్సి ఉంటుందని బీఆర్ఎస్ భావిస్తోంది. అయితే ఇప్పటికైతే డీలిమిటేషన్ గురించి అమిత్ షా, మోడీ కి మాత్రమే తెలుసని, బయట జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని చెప్పొకొచ్చారు. ఒకవేళ డీలిమిటేషన్ జరిగకపోయినా, రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం ఏపీ, తెలంగాణలో పార్లమెంట్, అసెంబ్లీ స్థానాలు పెంచక తప్పదని, ఈ విషయంలో ఏపీ సీఎం చంద్రబాబు కేంద్రంతో స్పష్టమైన హామీ తీసుకున్నట్టు కేటీఆర్ తెలిపారు. రాష్ట్రంలో ఎన్నికలు 2028లో ఉంటాయని చెప్పిన కేటీఆర్, 2029లో ఎన్నికలు జరుగుతాయని రేవంత్ రెడ్డి మాటలను కూడా కేటీఆర్ కొట్టి పారయలేదు.
కాంగ్రెస్–బీఆర్ఎస్ మధ్యే ప్రధాన పోటీ!
తెలంగాణ రాజకీయాల్లో వచ్చే ఎన్నికల్లో ప్రధాన పోటీ కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్యే ఉండబోతుందన్న సంకేతాలను కేటీఆర్ వ్యాఖ్యలు ఇచ్చాయి. ము ఖ్యంగా రాష్ట్రంలో బీజేపీ ప్రభావం, ఆ పార్టీ నాయకత్వంపై ఆయన చేసిన వ్యాఖ్యలను పరిశీలిస్తే.. ఆ పార్టీని ప్రధాన ప్రత్యర్థిగా బీఆర్ఎస్ పరిగణించడం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. దేశవ్యాప్తంగా బీజేపీ ప్రభావం క్రమంగా తగ్గుతోందని, గతంలో నరేంద్ర మోదీ, బీజేపీని వేర్వేరుగా చూసే ప్రజల్లోనూ ఇప్పుడు మార్పు వచ్చిందన్న కేటీఆర్ వ్యాఖ్యలు ఈ రాజకీయ అంచనాలకు బలం చేకూర్చాయి. తెలంగాణలో బీజేపీకి ప్రజలను రాష్ట్రవ్యాప్తంగా ఆకర్షించే బలమైన నాయకత్వం లేకపోవడాన్ని ఆయన ప్రధాన అంశంగా ప్రస్తావించారు. బండి సంజయ్, అర్వింద్, ఈటల రాజేందర్ వంటి నేతలు ప్రభావం చూపుతున్నప్పటికీ.. అది పరిమిత ప్రాంతాలకే పరిమితమవుతుందని కేటీఆర్ అభిప్రాయపడినట్లు ఆయన వ్యాఖ్యలను బట్టి తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా పార్టీని నడిపించే స్థాయిలో, ప్రజల్లో విస్తృత ఆదరణ ఉన్న నాయకుడు బీజేపీలో లేకపోవడం ఆ పార్టీకి ప్రతికూలంగా మారుతుందని ఆయన అంచనా. మరోవైపు కేసీఆర్, రేవంత్‌రెడ్డి మధ్యే ప్రధాన రాజకీయ పోటీ ఉంటుందన్న విషయాన్ని కేటీఆర్ స్పష్టం చేయడం ద్వారా బీఆర్ఎస్ తన ఎన్నికల పోరును ఏవిధంగా చూడబోతోందన్నది కూడా స్పష్టమైనట్లు కనిపిస్తోంది. అర్బన్ ప్రాంతాల్లో బీజేపీ కొంత మేర బలం పుంజుకున్నట్టు కనిపిస్తున్నప్పటికీ.. దాన్ని అసెంబ్లీ ఎన్నికల విజయంగా మలుచుకునే స్థాయిలో ఆ పార్టీ పరిస్థితి లేదన్నది కేటీఆర్ వ్యాఖ్యల సారాంశంగా కనిపిస్తోంది. మొత్తంగా కేటీఆర్ వ్యాఖ్యలను పరిశీలిస్తే.. కాంగ్రెస్‌ను ప్రధాన ప్రత్యర్థిగా, బీజేపీని పరిమిత ప్రభావం కలిగిన శక్తిగా బీఆర్ఎస్ చూస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీస్తోంది. ముఖ్యంగా దక్షిణ తెలంగాణలో బీజేపీ ప్రభావంపై బీఆర్ఎస్ పెద్దగా ఆందోళన చెందడం లేదన్న సంకేతాలు ఆయన మాటల్లో కనిపిస్తున్నాయి.