‘పేదల ఇళ్లపై కోమటిరెడ్డి కన్ను’.. సీపీఎం నేతల అరెస్ట్‌ను తీవ్రంగా ఖండించిన RS Praveen Kumar, Nalgonda BRS,లు

నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: నల్లగొండ పట్టణంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపులో భారీ అక్రమాలు జరిగాయని, డబ్బులు తీసుకుని అనర్హులకు ఇళ్లను కేటాయించారని ఆరోపిస్తూ నిరసన తెలిపిన సీపీఎం నాయకులను పోలీసులు అరెస్ట్ చేయడాన్ని బీఆర్ఎస్ తీవ్రంగా ఖండించింది. వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో నిర్బంధంలో ఉన్న సీపీఎం నాయకులు సలీం, సత్తయ్య తదితరులను బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, నాగార్జునసాగర్ మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ పరామర్శించి వారికి పూర్తి సంఘీభావం ప్రకటించారు.

డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీలో అర్హులకు తీవ్ర అన్యాయం జరిగిందని గత మూడు రోజులుగా సీపీఎం నేతలు ఆందోళన బాట పట్టారు. అందులో భాగంగా సోమవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టిన సీపీఎం నేతలను పోలీసులు బలవంతంగా వన్ టౌన్ పీఎస్కు తరలించడంతో ఈ పరిణామం చోటుచేసుకుంది.

అక్రమ అరెస్ట్లు శోచనీయం: పేదలకు న్యాయం చేయాలని ఆందోళన బాట పట్టిన ప్రజాస్వామ్య నాయకులను పోలీసులు అక్రమంగా నిర్బంధించడం దారుణమని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు.

మంత్రి కోమటిరెడ్డిపై తీవ్ర ధ్వజం:కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారూ.. మీకు ఆస్తులు బాగానే ఉన్నాయి కదా, చివరకు ఈ పేదవాళ్ల ఇళ్లను కూడా లాక్కోవాల్సి వచ్చిందా?” అని సూటిగా ప్రశ్నించారు.

ఇళ్ల కేటాయింపులో అక్రమాలు జరగకుండా సక్రమంగా పంపిణీ చేసి ఉంటే ఈ రోజు ఉద్యమించాల్సిన అవసరం ఉండేది కాదని, తక్షణమే డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీపై సమగ్ర విచారణ జరిపించి అర్హులైన పేదలందరికీ న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ పరామర్శ కార్యక్రమంలో ట్రైకార్ మాజీ చైర్మన్ రామచంద్ర నాయక్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షుడు రేగట్టె మల్లికార్జున్ రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ మందడి సైదిరెడ్డి, పట్టణ అధ్యక్షుడు బోనగిరి దేవేందర్, రావుల శ్రీనివాస్ రెడ్డి, బాణావత్ దీప్లా, దండంపెల్లి సత్తయ్య, రంజిత్, అల్లి శివశంకర్, నర్రా నిర్మల తదితర ముఖ్య నాయకులు ఉన్నారు.

Share
Share