- మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మెంటల్ ఎక్కింది..
- “దళిత నియోజకవర్గాలపై మీ పెత్తనమేంటి?
- మా జోలికొస్తే పనికత్తులు లేస్తాయి ఖబర్దార్”
- తుంగతుర్తి శాసనసభ్యుడి సంచలన వ్యాఖ్యలు.
- నల్లగొండ రాజకీయం రచ్చ రచ్చ..
సూర్యాపేట/తిరుమలగిరి, ఏపీబీ న్యూస్: ఉమ్మడి నల్లగొండ జిల్లా కాంగ్రెస్ రాజకీయంలో అంతర్గత విభేదాలు భగ్గుమన్నాయి. రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి లక్ష్యంగా తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు అత్యంత తీవ్రమైన విమర్శలు గుప్పించారు. స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన, మంత్రి కోమటిరెడ్డి వ్యాఖ్యలు, వైఖరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
దళిత నియోజకవర్గాలపై పెత్తనమేంటి?
“నల్లగొండ జిల్లా అంటే శ్రమజీవుల జిల్లా, పోరాటాల గడ్డ” అని గుర్తుచేసిన ఎమ్మెల్యే సామేలు, మంత్రి కోమటిరెడ్డికి మైండ్ పనిచేయడం లేదని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాలపై కోమటిరెడ్డి బ్రదర్స్ పెత్తనం చెలాయించాలని చూస్తున్నారని మండిపడ్డారు. “మా మాదిగల నియోజకవర్గాల జోలికొస్తే సహించేది లేదు. మా చిర్రా మొగుద్ది, మా చిటిక మొగుద్ది, మా పనికత్తులు లేస్తాయి.. ఖబర్దార్” అంటూ తీవ్రస్థాయిలో హెచ్చరికలు జారీ చేశారు.
ఎమ్మెల్యే మందుల సామేలు విమర్శలు:
- మంత్రి వైఖరిపై ధ్వజం: మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మెంటల్ ఎక్కింది.
- రోడ్ల నిర్వహణపై అలసత్వం: తుంగతుర్తి నియోజకవర్గంలో అధ్వానంగా ఉన్న రోడ్ల గురించి ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోలేదు.
- నైతిక హక్కు లేదు: నా నియోజకవర్గ వ్యవహారాలు, అభివృద్ధి గురించి మాట్లాడే అర్హత మంత్రికి లేదు.
- మండల కమిటీల స్పష్టత: టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నియమించిన మండల అధ్యక్షులే తుంగతుర్తిలో కొనసాగుతారు.
నియోజకవర్గ రోడ్ల దయనీయ స్థితి
తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలో రోడ్ల దుస్థితిపై ఆర్ అండ్ బీ మంత్రిగా ఉన్న కోమటిరెడ్డికి పలుమార్లు వినతులు సమర్పించినా ఏమాత్రం పట్టించుకోలేదని సామేలు అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజాసమస్యలు పట్టించుకోని మంత్రికి తమ నియోజకవర్గం గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని స్పష్టం చేశారు. అలాగే నియోజకవర్గంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నియమించిన కమిటీలు, మండల అధ్యక్షులే అధికారికంగా కొనసాగుతారని, ఇతరుల జోక్యాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ సహించబోమని తేల్చిచెప్పారు.