- నామినేటెడ్ పోస్టులపై హైకమాండ్‌కు తలనొప్పి
- రెడ్డి వర్గం నుంచి ముగ్గురు పోటీ.. బీసీ, ఎస్సీలకు ఛాన్స్ దక్కేనా?
- బీసీ, ఎస్సీ నేతల పేర్లు వినిపిస్తున్నా.. ‘రెడ్డి’ సమీకరణాలే కీలకం
- బీసీ నేతలను ప్రతిపాదించడంలో ప్రజాప్రతినిధుల నిరాసక్తత
- సామాజిక సమతుల్యతపై కాంగ్రెస్ అధిష్ఠానం కసరత్తు
నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: రాష్ట్రంలో రెండో విడత నామినేటెడ్ పదవుల భర్తీకి ముహూర్తం సమీపిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్‌లో ఆశావహుల లాబీయింగ్ ఊపందుకుంది. నల్లగొండ జిల్లాలో ఈసారి రెడ్డి సామాజికవర్గం నుంచే ముగ్గురు సీనియర్లు కార్పొరేషన్ చైర్మన్ పదవుల కోసం పోటీ పడుతుండటం కాంగ్రెస్ అధిష్ఠానానికి కొత్త తలనొప్పిగా మారింది. కార్పొరేషన్ చైర్మన్ పదవుల కోసం సూర్యాపేట జిల్లా నుంచి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సన్నిహితుడు చింతకుంట్ల లక్ష్మీ నారాయణ రెడ్డి, సీనియర్ నేత కె. జానారెడ్డి సన్నిహితుడు మాజీ ZPTC కర్నాటి లింగారెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రధాన అనుచరుడు గుమ్మల మోహన్‌రెడ్డి ప్రధానంగా పోటీలో ఉన్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇటీవల కర్నాటి లింగారెడ్డిని వెంటబెట్టుకుని మాజీ మంత్రి జానారెడ్డి, ఎంపీ రఘువీర్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిసినట్లు తెలిసింది. మరోవైపు నల్లగొండలో జరిగిన సీఎం సభ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, గుమ్మల మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రికి ప్రత్యేకంగా పరిచయం చేసి నామినేటెడ్ పదవి ఇవ్వాలని కోరినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇదే సమయంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి జిల్లాకు సంబంధించిన కోటాలో చింతకుంట్ల లక్ష్మీ నారాయణ రెడ్డి పేరును సిఫార్సు చేసినట్లు తెలుస్తోంది.
కార్పోరేషన్ రేసులోనూ రెడ్లే..
ఇప్పటికే ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఇద్దరు ఎంపీలు, ఏడుగురు ఎమ్మెల్యేలు రెడ్డి సామాజికవర్గానికే చెందినవారు. వీరిలో ఇద్దరు మంత్రులుగా ప్రభుత్వంలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో మరోసారి నామినేటెడ్ పదవులను కూడా అదే వర్గానికి కేటాయిస్తే సామాజిక సమతుల్యత దెబ్బతింటుందనే అభిప్రాయం పార్టీ అధిష్ఠానంలో వ్యక్తమవుతున్నట్లు సమాచారం. ముగ్గురు బలమైన నేతల్లో ఎవరిని ఎంపిక చేసినా మిగిలిన వర్గాల్లో అసంతృప్తి నెలకొనే అవకాశముండటంతో హైకమాండ్ ఆచితూచి అడుగులు వేస్తోంది. ఇప్పటికే రెండు ఎమ్మెల్సీ స్థానాలు, ముగ్గురు ఎమ్మెల్యేలకు విప్ పదవులు లభించాయి. తొలి విడత నామినేటెడ్ పోస్టుల్లో బీఆర్ఎస్, టీడీపీ నుంచి కాంగ్రెస్‌లో చేరిన నాయకులకు ప్రాధాన్యం ఇవ్వగా, ఈసారి మాత్రం పార్టీ కోసం దీర్ఘకాలంగా పనిచేసిన కాంగ్రెస్ సీనియర్లకే అవకాశం ఇవ్వాలన్న అభిప్రాయం అధిష్ఠానంలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే సీనియర్ల జాబితాలో ప్రధానంగా రెడ్డి వర్గానికే చెందిన నేతలు ఉండటం నిర్ణయాన్ని క్లిష్టంగా మార్చింది.
కార్పోరేషన్ చైర్మన్ పదవుల్లో బీసీలకు బెర్త్ లేదా..
మరోవైపు జిల్లాలో బీసీ వర్గాలకు ఇప్పటివరకు పెద్దగా ప్రాధాన్యం దక్కలేదన్న అసంతృప్తి కూడా వ్యక్తమవుతోంది. జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవులు మినహా కీలక కార్పొరేషన్ పోస్టుల్లో బీసీలకు అవకాశాలు రాలేదు. ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా ప్రత్యామ్నయంగా బీసీల పేర్లు ప్రతి పాధించేందుకు ఆసక్తిచూపకపోవడం విమర్శలకు తావిస్తోంది. బీసీలకు కార్పొరేషన్ చైర్మన్ పదవులు లభిస్తే తమ నియోజకవర్గాల్లో వారికి రాజకీయంగా ప్రత్యేక గుర్తింపు, బలం పెరిగి భవిష్యత్తులో ప్రత్యామ్నాయ శక్తులుగా ఎదిగే అవకాశం ఉంటుందనే ఆందోళనతో ఎమ్మెల్యేలు, మంత్రులు బీసీ నేతల పేర్లను ప్రతిపాదించేందుకు పెద్దగా ఆసక్తి చూపడం లేదన్న చర్చ కాంగ్రెస్ వర్గాల్లో సాగుతోంది. ఫలితంగా జిల్లాలో బీసీలకు ప్రాధాన్యం కల్పించాలన్న డిమాండ్ ఉన్నప్పటికీ, ముఖ్యనేతల సిఫార్సులు మాత్రం ప్రధానంగా రెడ్డి సామాజికవర్గం నేతలకే పరిమితమయ్యాయని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.
నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం మాజీ ఎమ్మెల్యే నేతి విద్యాసాగర్, బీసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పూజర్ల శంభయ్య పేర్లను ప్రతిపాదించినప్పటికీ, బీఆర్ఎస్ నుంచి వచ్చిన నేతలు కావడంతో వారి అవకాశాలపై స్పష్టత లభించలేదు. సూర్యాపేట జిల్లా నుంచి కూడా బీసీ వర్గానికి చెందిన పేర్లు పెద్దగా వినిపించడం లేదు. అదే సమయంలో మాదిగ వర్గం నుంచి జానారెడ్డి అనుచరుడు కొండేటి మల్లయ్య, సీఎం కోటాలో దుబ్బాక నర్సింహారెడ్డి పేర్లు కూడా పరిశీలనలో ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. అయినప్పటికీ ప్రధాన పోటీ మాత్రం రెడ్డి సామాజికవర్గానికే చెందిన ముగ్గురు నేతల మధ్య కొనసాగుతుండటంతో, సామాజిక సమీకరణాలను దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్ అధిష్ఠానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.