Breaking News: మర్రిగూడ బైపాస్ ఫ్లైఓవర్ ప్రారంభించాలని కంచర్ల ధర్నా.. అరెస్టు..

నల్లగొండ, ఏపీబీ న్యూస్: మర్రిగూడ బైపాస్ వద్ద నిర్మాణం పూర్తయి రెండు నెలలు గడిచినా ఫ్లైఓవర్ను ప్రారంభించకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ నల్గొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి ఆధ్వర్యంలో శనివారం చర్లపల్లి వద్ద ధర్నా నిర్వహించారు. ఫ్లైఓవర్ను వెంటనే ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేస్తూ స్థానికులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున ఆందోళనలో పాల్గొన్నారు. ధర్నా కారణంగా కొంతసేపు ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడి వాహనాలు భారీగా నిలిచిపోయాయి. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. కలెక్టర్ వచ్చి సమస్యను పరిష్కరించే వరకు ధర్నా విరమించబోమని కంచర్ల భూపాల్రెడ్డి ప్రకటించారు.

అనంతరం డీఎస్పీ శివరాంరెడ్డి ఆధ్వర్యంలో భూపాల్రెడ్డి సహా పలువురు నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మొదట మల్లేపల్లి పోలీస్ స్టేషన్కు తరలించిన అనంతరం చివరకు దేవరకొండ పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా భూపాల్రెడ్డి మాట్లాడుతూ, మర్రిగూడ బైపాస్, పానగల్ బైపాస్ల వద్ద గతంలో ఫ్లైఓవర్లు లేకపోవడం వల్ల అనేక ప్రమాదాలు జరిగి పలువురు ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి సమస్యను తీసుకెళ్లడంతో రెండు ప్రాంతాల్లో ఫ్లైఓవర్ల నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయని పేర్కొన్నారు. పానగల్ ఫ్లైఓవర్ ఇప్పటికే ప్రారంభమైనప్పటికీ, మర్రిగూడ ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తయి రెండు నెలలు గడిచినా రాజకీయ కారణాలతో ప్రారంభించడం లేదని ఆరోపించారు. ఇటీవల కూడా ఫ్లైఓవర్ వద్ద జరిగిన ప్రమాదంలో ఒకరు మృతి చెందారని, అయినప్పటికీ అధికారులు స్పందించడం లేదని కంచర్ల విమర్శించారు. ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లకుండా అధికారులు వెంటనే ఫ్లైఓవర్ను ప్రారంభించాలని డిమాండ్ చేశారు.

అరెస్టయిన వారిలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రేగట్టె మల్లికార్జున్రెడ్డి, నల్గొండ మాజీ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, నగర బీఆర్ఎస్ అధ్యక్షుడు భువనగిరి దేవేందర్, కార్పొరేటర్లు దొడ్డి రమేష్, దీప్లా నాయక్, గోపగోని స్వాతి-రాజశేఖర్, గుండ్రెడ్డి యుగంధర్ రెడ్డి, పెండం ధనుంజయ్, మెండు చంద్రశేఖర్ రెడ్డి, అనిల్ నాయక్, చెనగోని నాగరాజు తదితరులు ఉన్నారు.

Share
Share