- ఏదుల రిజర్వాయర్ నుంచి 437.375 మీటర్ల వద్దే
- గ్రావిటీ ద్వారా నీటి తరలింపునకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్
- నల్లగొండ, మహబూబ్ నగర్ జిల్లాల మధ్య కుదిరిన ఒప్పందం
- రూ.1,800 కోట్ల హెడ్వర్క్స్కు జీవో, హైడ్రాలిక్ డిజైన్ల ఆమోదం
- 600 ఎకరాల భూసేకరణే ప్రధాన అడ్డంకి
- 3.60 లక్షల ఎకరాలకు సాగునీటి ఆశలు
- రైతుల అంగీకారం లభిస్తేనే పనులకు శ్రీకారం
నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: ఎన్నో ఏళ్లుగా వివాదాలు, అనిశ్చితుల మధ్య సాగిన డిండి ఎత్తిపోతల పథకం కీలక దశకు చేరుకుంది. ఇప్పటి వరకు నల్లగొండ, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాల మధ్య నెలకొన్న నీటి పంపకాల వివాదానికి ప్రభుత్వం తెరదించింది. పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టులోని ఏదుల రిజర్వాయర్ నుంచి 437.375 మీటర్ల నీటిమట్టం వద్దే డిండి ప్రాజెక్టుకు పూర్తిగా గ్రావిటీ ద్వారా నీటిని తరలించాలని నిర్ణయిస్తూ ప్రభుత్వం పరిపాలనా అనుమతులు (జీవో) జారీ చేసింది. హెడ్వర్క్స్కు సంబంధించిన హైడ్రాలిక్ డిజైన్ల కు కూడా ఆమోదం లభించడంతో సాంకేతిక అడ్డంకులు తొలగిపోయాయి. అయితే ఇప్పుడు మొత్తం ప్రాజెక్టు భవితవ్యాన్ని నిర్ణయించేది 600 ఎకరాల భూసేకరణ మాత్రమే.
పాత నీటి వివాదానికి ముగింపు
డిండి ప్రాజెక్టుకు నీటిని ఏ లెవల్లో ఇవ్వాలన్న అంశంపై గతంలో తీవ్ర వివాదం నెలకొంది. డిండికి ఎత్తైన లెవల్ నుంచి నీటిని తరలిస్తే 30 టీఎంసీ లకు బదులుగా కేవలం 7 టీఎంసీలే అందుతాయని అప్పట్లో ఇంజినీర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పునఃసమీక్ష చేపట్టి పాలమూరు–రంగారెడ్డి, డిండి ప్రాజెక్టులకు ఒకే స్థాయిలో, 437.375 మీటర్ల వద్ద నుంచే నీటిని గ్రావిటీ ద్వారా తరలించాలని నిర్ణయించడంతో ఆ వివాదానికి పూర్తిగా తెరపడింది. ఏదుల రిజర్వాయర్ నుంచి డిండి వరకు 2.5 కిలోమీటర్ల ఓపెన్ కెనాల్, 16 కిలోమీటర్ల టన్నెల్, 5 కిలోమీటర్ల కాలువ, 3.8 కిలోమీటర్ల సహజ వాగు మార్గం ద్వారా నీటిని పూర్తిగా గ్రావిటీ పద్ధతిలో తరలించనున్నారు. ఎక్కడా ఎత్తిపోతల అవసరం లేకుండా నీరు డిండి రిజర్వాయర్లకు చేరేలా ప్రణాళిక రూపొందించారు.
రూ.6,190 కోట్ల ప్రాజెక్టులో రూ.4 వేల కోట్ల పనులు పూర్తి
2015లో రూ.6,190 కోట్లతో డిండి ఎత్తిపోతల పథకాన్ని రూపొందించారు. ఇప్పటివరకు సుమారు రూ.4 వేల కోట్ల విలువైన పనులు పూర్తయ్యాయి. శివన్నగూడెం, కిష్టరాంపల్లి రిజర్వాయర్ల పనులు 90 శాతం పూర్తికాగా, గొట్టిముక్కల, సింగరాజుపల్లి రిజర్వాయర్లు చివరి దశలో ఉన్నాయి. 66 కిలోమీటర్ల ప్రధాన కాలువలో 40 కిలోమీటర్ల నిర్మాణం పూర్తైంది. చింతపల్లి, ఇర్విన్ ఆఫ్లైన్ రిజర్వాయర్లు మాత్రం భూసేకరణ సమస్యతో ఇంకా ప్రారంభం కాలేదు. డిండి ఎత్తిపోతల పథకం పూర్తయితే నల్లగొండ జిల్లాతో పాటు పరిసర ప్రాంతాల్లో మొత్తం 3.60 లక్షల ఎకరాలకు సాగునీరు అందనుంది. వరదకాలంలో శ్రీశైలం నుంచి వచ్చే నీటిని వినియోగిస్తూ 60 రోజుల్లో 30 టీఎంసీల నీటిని డిండి వ్యవస్థకు అందించేలా ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది.
రూ.1,800 కోట్ల హెడ్వర్క్స్కు సిద్ధం
డిండి ఎత్తిపోతల పథకం ద్వారా మొత్తం 3.60 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యం. శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహాలు వచ్చిన సమయంలో రోజుకు సుమారు 0.5 టీఎంసీ చొప్పున 60 రోజుల్లో 30 టీఎంసీల నీటిని వినియోగించేలా ప్రణాళిక రూపొందించారు. ఏదుల రిజర్వాయర్ సామర్థ్యం 5.5 టీఎంసీలు కాగా, నిరంతర పంపింగ్ కారణంగా రిజర్వాయర్లో పంపుహౌజ్ నుంచి నిత్యం నీటిని డిండి రిజర్వాయర్లకు అందేలా ప్రణాళిక సిద్ధం చేశారు. డిండి ప్రాజెక్టుకు నీటిని తరలించేందుకు రూ.1,800 కోట్ల వ్యయంతో హెడ్ వర్క్స్ నిర్మించనున్నారు. ఇందుకు సంబంధించిన నాలుగు ప్యాకేజీల టెండర్లు ఇప్పటికే పూర్తయ్యాయి. ఏడాది క్రితమే కాంట్రాక్టులు ఖరారైనా, భూసేకరణ, హైడ్రాలిక్ డిజైన్ల ఆమోదం ఆలస్యం కావడంతో పనులు నిలిచిపోయాయి. ఇప్పుడు జీవో జారీ కావడంతో పరిపాలనా, సాంకేతిక అడ్డంకులు తొలగినా, భూములు అందుబాటులోకి రావాల్సి ఉంది.
600 ఎకరాల భూసేకరణే అసలు సవాల్
హెడ్వర్క్స్ నిర్మాణానికి అవసరమైన సుమారు 600 ఎకరాల భూమి మొత్తం నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాల్లోనే ఉంది. ఎకరానికి సగటున రూ.15 లక్షల చొప్పున పరిహారం చెల్లించాల్సి ఉండటంతో భూసేకరణకే దాదాపు రూ.90 కోట్ల వ్యయం కానుంది. భూములు అందకపోతే హెడ్వ ర్క్స్ పనులు ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్లే పరిస్థితి లేదు. ఇప్పటికే పనులు టెండర్లు పిలిచి ఏడాది పూర్తియ్యింది. నీటి పంపకాల వివాదాం తేల్చేందుకే ఏడాది సమయం పట్టింది. ఇప్పుడు పనులు మొదలు పెట్టేందుకు భూసేకరణ ప్రధాన సమస్యగా మారింది. సేకరించాల్సిన భూములన్నీ మహబూబ్ నగర్ జిల్లాలోనే ఉన్నాయి. దీంతో ఆ జిల్లాలోని రైతాంగం భూములు త్యాగం చేసేందుకు సిద్ధపడటం లేదు. ఇక్కడి నుంచి నీళ్లు నల్లగొండ జిల్లాకు తరలించడమేగాక, మా భూములను ఎందుకు త్యాగం చేయాలని అక్కడి రైతాంగం ఆందోళనకు సిద్ధమవుతోంది.
“భూములు మావి.. నీళ్లు నల్లగొండకా?”
భూసేకరణ ప్రతిపాదనలు వెళ్లిన గ్రామాల్లో రైతుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. “భూములు మేం కోల్పోవాలి.. ప్రయోజనం నల్ల గొండ జిల్లాకా?” అనే భావన కొందరిలో కనిపిస్తోందని సమాచారం. దీంతో భూసేకరణ ప్రక్రియ ఆశించిన వేగంతో ముందుకు సాగడం లేదు. స్థానిక ప్రజాప్రతినిధుల సమన్వయం, రైతుల విశ్వాసం లేకుండా ఈ ప్రక్రియ పూర్తికావడం కష్టమేనని అధికార వర్గాలు చెబుతున్నాయి. డిండి హెడ్వర్క్స్ భవిష్యత్తు మొత్తం 600 ఎకరాల భూసేకరణ మీదే ఆధారపడింది. రైతుల సహకారం లభిస్తే రెండేళ్లలో హెడ్వర్క్స్ పూర్తయ్యే అవకాశం ఉంది. లేకపోతే మరోసారి డిండి ప్రాజెక్టు భూముల వివాదంలోనే చిక్కుకునే పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికప్పుడు భూసేకరణ పనులు మొదలు పెట్టిన పూర్తియ్యేందుకు కనీసం ఐదారు నెలల సమయం పట్టొచ్చని అధికారులు భావిస్తున్నారు. వనపర్తి, నాగర్ కర్నూల్ జిల్లాల ఎమ్మెల్యేలు సహరించి, రైతులను ఒప్పిస్తే తప్పా భూసేకరణ సాఫీగా సాగేందుకు ఆస్కారం ఉంటదని అధికారులు అంటున్నారు. కానీ ఒకేసారి 600 ఎకరాలు కోల్పోవాల్సిన పరిస్థితులు తలెత్తడం, అది కూడా తమ జిల్లా అవసరాలకు కాకుండా, నల్లగొండ జిల్లా అవసరాల కొరకు తామెందుకు భూములు త్యాగం చేయాలని రైతులు ప్రశ్నిస్తున్నారు.