APB News Exclusive: శ్రీశైల సొరంగం.. నత్తనడకన తవ్వకం..! 100 రోజులు 400 మీటర్లే..

నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ (ఎస్ఎల్బీసీ) సొరంగం తవ్వకం ఆశించిన వేగంతో సాగడం లేదు. పనులు ప్రారంభించి వంద రోజులు గడిచినా ఇన్లెట్, అవుట్లెట్ల వద్ద కలిపి కేవలం 400 మీటర్ల తవ్వకం మాత్రమే పూర్తియ్యింది. ప్రస్తుతం నమోదవుతున్న సగటు వేగం ప్రకారం నెలకు దాదాపు 120 మీటర్లే పురోగతి కనిపిస్తోంది. ఈ లెక్కన మొత్తం 9.11 కిలోమీటర్ల సొరంగం పూర్తవ్వాలంటే ఆరేళ్లకు పైగా సమయం పట్టే పరిస్థితి ఉంది. మరోవైపు ప్రాజెక్టు వ్యయం రూ.12,718 కోట్లకు చేరగా, నిర్మాణ బాధ్యతల్లో జేపీ(JP) స్థానంలో అదానీ గ్రూప్ రావడంతో 2028 జూన్ నాటికి పనులు పూర్తవుతాయా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

టన్నెల్ బోరింగ్ మెషిన్ (TBM)ను తొలగించి, దాని స్థానంలో డ్రిల్లింగ్–బ్లాస్టింగ్ (DBM) విధానంలో పనులు చేపట్టినా శ్రీశైలం సొరంగం తవ్వకానికి ఆశించిన వేగం రావడం లేదు. ఇన్లెట్, అవుట్లెట్ రెండు వైపుల నుంచి మొత్తం 9.11 కిలోమీటర్ల సొరంగాన్ని తవ్వాల్సి ఉండగా, పనుల పురోగతి మాత్రం నత్తనడకన సాగుతోంది. గతేడాది జరిగిన ప్రమాదం తర్వాత నిలిచిపోయిన పనులను ఈ ఏడాది మార్చి 20 నుంచి పునఃప్రారంభించారు. పనులను వేగవంతం చేయాలనే ఉద్దేశంతో టన్నెల్ బోరింగ్ మెషిన్ను తొలగించి, డ్రిల్లింగ్–బ్లాస్టింగ్ విధానాన్ని అమలు చేస్తున్నారు. ఈ విధానంలో రోజుకు 14 మీటర్ల వరకు తవ్వకం చేపట్టవచ్చని అధికారులు అంచనా వేశారు. అయితే క్షేత్రస్థాయిలో ఆ లక్ష్యం ఎక్కడా కనిపించడం లేదు. పనులు తిరిగి ప్రారంభమైనప్పటి నుంచి ఈ నెల తొలి వారం వరకు సుమారు 100 రోజుల్లో కేవలం 400 మీటర్లు మాత్రమే సొరంగం తవ్వగలిగారు. అంటే రోజుకు సగటున నాలుగు మీటర్లు, నెలకు దాదాపు 120 మీటర్ల చొప్పునే పనులు సాగుతున్నాయి. ఈ లెక్కన ఏడాదికి 1.46 కిలోమీటర్ల సొరంగం మాత్రమే తవ్వడం సాధ్యమవుతుంది. మొత్తం 9.11 కిలోమీటర్ల తవ్వకం పూర్తియ్యే సరికి దాదాపు 6 ఏళ్ల సమయం పడుతుంది. ప్రమాదం జరిగిన ఇన్లెట్ వైపు అచ్చంపేట మండలం దోమలపెంట వద్ద శ్రీశైలం జలాశయ గట్టు నుంచి ఇప్పటివరకు 130 మీటర్లు, అవుట్లెట్ వైపు మహబూబ్నగర్ జిల్లా మన్నెవారిపల్లె నుంచి 270 మీటర్లు తవ్వకం పూర్తైంది.

SLBC Left Bank Canal Tunnel DBM Method Progress 2026

సొరంగం మార్గాన్ని 2028 జూన్ నాటికి ఎట్టి పరిస్థితుల్లో పూర్తిచేయాలనే సంకల్పంతో ప్రభుత్వం కొత్త టెక్నాలిజీతో పనులు ప్రారంభించింది. మొదట్లో మంత్రి కోమటిరెడ్డిని విదేశాలకు పంపించి టీబీఎం(TBM) మిషన్ తెప్పించింది. కానీ టీబీఎం మిషన్ వల్ల తరచూ సాంకేతిక సమస్యలు వస్తున్నాయని దానికి బదులు డీబీఎం(DBM) టెక్నాలజీని ప్రవేశపెట్టింది. డీబీఎం మోడ్ లో అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉందని, ఈ విధానంలో సొరంగ మార్గంలో సర్ఫేస్ కు డైరెక్ట్ గా డ్రిల్లింగ్ చేస్తారని, డ్రిల్లింగ్ జరిగిన ప్రదేశంలో బ్లాస్టింగ్ మెటీరియల్ ఫిల్ చేశాక, సొరంగంలో రాతి కండీషన్ బట్టి పేలుడు పదార్ధాలను ప్రయోగిస్తున్నారు. దాంతో రాయి చిన్నచిన్న ముక్కలుగా విడిపోయి కింద పడిపోతుంది. ఈ విధానంలో మాన్ పవర్ ఎక్కువగా అవసరమైనప్పటికీ రోజుకు 4 మీటర్లకు మించి పని జరగడం లేదు. ఇప్పుడు మళ్లీ కొత్తగా మూడు ఆర్మ్ బూమర్ మిషన్లు తెప్పించారు. ప్రస్తుతం ఈ మిషన్లు ముంబై పోర్టుకు చేరాయి. మరికొద్దిరోజుల్లో అక్కడి నుంచి పనిజరిగే సొరంగ మార్గం ప్రాంతానికి చేరుస్తారు. ఈ యంత్రాల సాయంతో సొరంగాలు తవ్వేటప్పుడు రాయిని సులభంగా పగలగొట్టడానికి, డ్రిల్లింగ్ చేయడానికి, సొరంగం పై కప్పును పటిష్టం చేయడానికి ప్రత్యేకంగా ఉపయోగిస్తారు. ఈ మిషన్లతో సొరంగం మార్గం పనుల్లో వేగం పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు. కొత్త మిషన్ల వాడకంతో నెలకు కనీసం 150 మీటర్లు తవ్వొచ్చని అంచనా వేస్తున్నారు. ఈ లెక్కన ఇప్పటి వరకు జరిగిన 400 మీటర్లను మినహాయిస్తే బ్యాలెన్స్ 8.71 కిలోమీటర్లు తవ్వాల్సి ఉంది. నెలకు 150 మీటర్ల చొప్పున తవ్వినా, ఏడాదికి 1.8 కిలోమీటర్లు పూర్తివుతుంది. అంటే 8.71 కిలోమీటర్ల తవ్వేందుకు దాదాపు 5 ఏళ్ల సమయం పడుతుంది.

ఎస్ఎల్బీసీ(SLBC) సొరంగ నిర్మాణ పనుల్లో జేపీ సంస్థ పనితీరు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న జేపీ సంస్థతో పనులు కొనసాగించడం వల్ల ప్రాజెక్టు మరింత ఆలస్యమవుతుందనే అభిప్రాయానికి వచ్చిన ప్రభుత్వం, కాంట్రాక్టు బాధ్యతలను అదానీ సంస్థకు అప్పగించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే అడ్వాన్స్ల రూపంలో జేపీ సంస్థకు సుమారు రూ.400 కోట్లు చెల్లించినప్పటికీ, పనుల పురోగతి మాత్రం ఆశించిన స్థాయిలో లేకపోవడం ఈ నిర్ణయానికి ప్రధాన కారణంగా చెబుతున్నారు. అదానీ సంస్థ బాధ్యతలు చేపట్టిన తర్వాత పనులను వేగవంతం చేసేందుకు అత్యాధునిక ఆర్మ్ బూమర్ యంత్రాలను రంగంలోకి దింపాలని నిర్ణయించారు. ఈ యంత్రాల వినియోగంతో పాటు నిర్మాణ వ్యయాలను పునఃసమీక్షించడంతో ప్రాజెక్టు అంచనా వ్యయం గణనీయంగా పెరిగింది. మొదట టన్నెల్ బోరింగ్ మెషిన్ (TBM) స్థానంలో డ్రిల్లింగ్–బ్లాస్టింగ్ (DBM) విధానాన్ని అమలు చేసినప్పుడు ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.4,618 కోట్లకు పెరిగింది. ప్రస్తుతం అదనపు యంత్రాలు, సాంకేతిక మార్పులు, ఇతర నిర్మాణ అవసరాలను పరిగణనలోకి తీసుకోవడంతో మొత్తం అంచనా వ్యయం రూ.12,718 కోట్లకు చేరింది. ఈ లెక్కన మొత్తం 9.11 కిలోమీటర్ల సొరంగ నిర్మాణానికి సగటున కిలోమీటరుకు దాదాపు రూ.1,400 కోట్లు ఖర్చు అవుతోంది. అయితే వ్యయం భారీగా పెరిగినా, పనుల వేగం కూడా అదే స్థాయిలో పెరిగి ప్రభుత్వం నిర్దేశించిన 2028 జూన్ గడువులోగా ప్రాజెక్టు పూర్తవుతుందా లేదా అన్నది ఇప్పుడు కీలక ప్రశ్నగా మారింది.

Share
Share