- పార్టీ సామాజిక మాధ్యమాల విభాగం రాష్ట్ర చైర్మన్ పదవికి పేరు పరిశీలన
- పీసీసీ నుంచి ఏఐసీసీకి ప్రతిపాధన
- సెప్టెంబర్ లో డెయిరీ చైర్మన్ పదవీకాలం ముగింపు
- పార్టీ కోసం చేసిన సేవలకు గుర్తింపుగా అధిష్ఠానం కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం
నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: తెలంగాణ డెయిరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గుత్తా అమిత్‌రెడ్డికి రాష్ట్ర కాంగ్రెస్‌లో కీలక బాధ్యతలు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. పార్టీ సామాజిక మాధ్యమాల విభాగం రాష్ట్ర చైర్మన్ పదవికి ఆయన పేరును పీసీసీ(PCC) నుంచి ఏఐసీసీ(AICC)కి ప్రతిపాదించినట్లు కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. పార్టీ మీడియా విభాగంలో త్వరలో చేపట్టనున్న మార్పులు, చేర్పుల్లో భాగంగా అమిత్‌రెడ్డికి ఈ బాధ్యత అప్పగించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి రాజకీయ వారసుడిగా కాంగ్రెస్‌లో అడుగుపెట్టిన అమిత్‌రెడ్డి తక్కువ కాలంలోనే పార్టీ కార్యకలాపాల్లో తనదైన ముద్ర వేశారు.
మున్సిపల్ ఎన్నికల సమయంలో గాంధీ భవన్ ఎన్నికల నియంత్రణ కేంద్రం (వార్ రూమ్) ఇన్చార్జిగా పనిచేయడంతో పాటు, చిట్యాల మున్సిపల్ ఎన్నికలకు పార్టీ ఇన్చార్జిగా వ్యవహరించి విజయవంతంగా బాధ్యతలు నిర్వర్తించారు. పార్టీ కోసం చేసిన కృషిని గుర్తించిన అధిష్ఠానం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన అనంతరం తెలంగాణ డెయిరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా అవకాశం కల్పించింది. గత రెండేళ్లుగా డెయిరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా పనిచేస్తున్న అమిత్‌రెడ్డి సంస్థను గాడిలో పెట్టేందుకు పలు చర్యలు చేపట్టారు. నష్టాల్లో ఉన్న సంస్థను ఆర్థికంగా బలోపేతం చేయడంతో పాటు, తెలంగాణ డెయిరీ ఉత్పత్తుల విక్రయాల పెంపుపై ప్రత్యేక దృష్టి సారించారు. డెయిరీ ఆస్తుల పరిరక్షణకు చర్యలు తీసుకోవడంతో పాటు, నల్లగొండ, రంగారెడ్డి పాల ఉత్పత్తిదారుల పరస్పర సహకార సంఘం (NARMUL)ను ఢిల్లీ మదర్ డెయిరీతో అనుసంధానించే ప్రక్రియలో కీలక పాత్ర పోషించారు. ఈ ఒప్పం దం కుదిరేలా ఉద్యోగులు, కార్మికులను ఒప్పించడంలోనూ ఆయన చొరవ చూపినట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.
త్వరలో పార్టీ మీడియా విభాగంలో మార్పులు..
ప్రస్తుతం రాష్ట్ర సామాజిక మాధ్యమాల విభాగం అధ్యక్షుడిగా సతీష్ మన్నె, మీడియా, కమ్యూనికేషన్ విభాగం అధ్యక్షుడిగా సామా రామ్మోహన్ రెడ్డి కొనసాగుతున్నారు. పార్టీ ప్రచార వ్యవస్థను మరింత బలోపేతం చేసే లక్ష్యంతో ఈ విభాగాల్లో త్వరలో మార్పులు, చేర్పులు చేపట్టనున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే సామాజిక మాధ్యమాల విభాగం రాష్ట్ర అధ్యక్ష పదవికి అమిత్‌రెడ్డి పేరును పీసీసీ ప్రతిపాదించినట్లు తెలిసింది. కాంగ్రెస్‌లో మీడియా సంబంధిత నియామకాలపై తుది నిర్ణయం ఏఐసీసీ తీసుకుంటుంది. పీసీసీ నుంచి వచ్చే ప్రతిపాదనలను పరిశీలించిన తర్వాతే అధికారికంగా నియామకాలను ప్రకటిస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్ గౌడ్ సూచనల మేరకే అమిత్‌రెడ్డి పేరును ఏఐసీసీకి పంపినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే క్రియాశీల రాజకీయాలపైనే ఆసక్తి ఉన్న అమిత్‌రెడ్డి భవిష్యత్తులో ప్రత్యక్ష రాజకీయాల్లో మరింత చురుకైన పాత్ర పోషించాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం నియోజకవర్గ స్థాయి బాధ్యతలు అప్పగించే పరిస్థితి లేకపోయినా, పార్టీ ఏ బాధ్యత అప్పగించినా నిర్వహించేందుకు ఆయన సిద్ధంగా ఉన్నట్లు కాంగ్రెస్ నాయకులు వెల్లడిస్తున్నారు.