- తాజాగా 499 సర్వే నంబర్లో డబుల్ రిజిస్ట్రేషన్ల ఆరోపణలు
- రద్ధు కోరుతూ రెవిన్యూ ఆఫీసర్లకు ఫిర్యాదుల వెల్లువ
- అక్రమార్కుల ఆధారాలు ఇవ్వాలని ఆర్టీఐ(RTI) కింద దరఖాస్తు
- విచారణ జాప్యం చేస్తున్నారని ఇంకొందరు కలెక్టర్ కు ఫిర్యాదు
- సమగ్ర విచారణకు ఆర్డీఓ(RDO)ను మరోసారి ఆదేశించిన కలెక్టర్
- అక్రమాల ఉచ్చు ఎవరి మెడకు?
నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కతాలగూడ భూముల వ్యవహారంలో కొత్త వివాదాలు తెరపైకి వస్తున్నాయి. తాజాగా 499 సర్వే నంబర్కు చెందిన భూములపై ఫేక్, డబుల్ రిజిస్ట్రేషన్లు జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ రిజిస్ట్రేషన్లను రద్దు చేయాలని కోరుతూ బాధితులు అధికారులను ఆశ్రయిస్తుండగా, సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కింద దాఖలైన దరఖాస్తులు అధికార వర్గాల్లో గుబులు రేకెత్తిస్తున్నాయి.
వివరాల్లోకి వెళ్తే…
కతాలగూడలో కొత్త వెంచర్ ఏర్పాటుకు జరుగుతున్న భూముల సేకరణ ప్రక్రియలో అనేక అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. సర్వే నంబర్ 503 నుంచి మొదలైన వివాదాలు 513 వరకు విస్తరించాయి. వీటితోపాటు 524 సర్వే నంబర్లోనూ అక్రమాలు జరిగినట్లు ఆధారాలతో సహా ఏపీబీ న్యూస్ వెలుగులోకి తెచ్చిన సంగతి తెలిసిందే. అసలు భూమి లేకపోయినా ధరణి వ్యవస్థలోని లొసుగులను అడ్డం పెట్టుకుని రికార్డులను తారుమారు చేసిన కొందరు రెవెన్యూ అధికారులు, తమకు అనుకూలమైన వ్యక్తుల పేర్లపై భూముల రిజిస్ట్రేషన్లు జరిపినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ అక్రమాల వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఎవరన్న విషయం అధికారులకు తెలిసినా, ఆ వివరాలను గోప్యంగా ఉంచుతున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉండగా, ఏపీబీ న్యూస్ కథనాలపై స్పందించిన కతాలగూడ రైతులు గతంలో జరిగిన ఫేక్ రిజిస్ట్రేషన్ల ఉదంతాలను బయట పెడుతున్నారు. ఆధారాలతో సహా నల్లగొండ రెవిన్యూ ఆఫీసర్లకు సమర్పించడమేగాక, రిజిస్ట్రేషన్లు రద్ధు చేయాలని, బాధ్యుల పైన కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో కతాలగూడ భూముల వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారి, వివాదం కొత్త మలుపు తిరిగింది.
499 సర్వే నంబర్ లో ఫేక్ రిజిస్ట్రేషన్లు..
499 సర్వేనంబర్లో ఒక ఎకరం (40గుంటలు) భూమిని యాదగిరి అనే వ్యక్తికి 2012లో జగన్మోహన్ అనే అతను విక్రయించాడు. ఈ ల్యాండ్ డాక్యుమెంట్ నంబరు 6339/2012 ద్వారా ఆర్ధిక లావాదేవీలు జరిగాయి. తదనంతరం ఈ భూమిని యాదగిరి 21 ప్లాట్లుగా మార్చి ఇతరులకు విక్రయించాడు. ఎకరం భూమిలో 4,127 గజాలు ప్లాట్లు కాగా, రోడ్డు విస్తీర్ణం 1971 గజాలు. మొత్తం కలిపి 6099 గజాలు అప్పట్లోనే సేల్ చేశారు. ఇంత వరకు అంతా సవ్యంగానే సాగింది. కానీ రెవిన్యూ రికార్డుల్లోంచి ఈ భూమల వివరాలు తొలగించలేదు. అప్పటి ప్రభుత్వం ధరణి పోర్టల్ అమల్లోకి తెస్తుందనే ప్రచారం ఊపందుకోగానే 2016లో తహాశీల్దారు ఆఫీసులో రికార్డులు తారుమారు చేశారు. రికార్డుల నుంచి యాదగిరి పేరు తొలగించకుండా మరోసారి అదే 499 సర్వే నంబర్లోని అదే ఎకరం భూమికి చెందిన 6339/2012 లింక్ డాక్యుమెంట్ ఆధారంగా 11 గుంటల స్థలాన్ని(1331 గజాలు) మరొకరికి డబుల్ రిజిస్ట్రేషన్ చేశారు. ఈ స్థలం డాక్యుమెంట్ నంబరు 11077/2016 ద్వారా ఆర్ధిక లావాదేవీలు జరిగాయి. ఒకసారి ప్లాట్లుగా మార్చి అమ్మిన స్థలాన్ని మళ్లీ మరొకరి పేరు మీద డబుల్ రిజిస్ట్రేషన్ ఎందుకు చేశారు? తెరవెనక జరిగిన ఒప్పందం ఏంటనేది అప్పటి అధికారులకు, విక్రయదారులకే తెలియాలి. కానీ మళ్లీ ఇప్పుడు కొత్త వెంచర్ పుణ్యామాని ఇదే సర్వే నంబర్ ను అడ్డంపెట్టుకుని మరోసారి అక్రమాలకు పాల్పడటంతో వివాదం ఇప్పుడున్న ఆఫీసర్ల మెడకు చుట్టుకుంది.
కొత్త వెంచర్ ఎంట్రీతో నయా దందా..
దాదాపు 30 ఎకరాల్లో కొత్త వెంచర్ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇంతవరకు మున్సిపల్ పర్మిషన్లు కూడా రాలేదు. కానీ భూముల వివాదాలు మాత్రం సంచలనం రేకెత్తిస్తున్నాయి. యాదగిరి నుంచి 11 గుంటల స్థలాన్ని కొనుగోలు చేసిన సదరు వ్యక్తి ఏడాది తర్వాత తన పేరు మీద వ్యవసాయ భూమిగా మార్చుకునేందుకు పెద్ద హైడ్రామానే నడిపించాడు. అప్పటి ఆఫీసర్ల అండతో అదే 499 సర్వే నంబర్ కు ‘బై’ నంబర్లు తగిలించి దాన్నివ్యవసాయ భూమికి మార్పిడి చేసి రెవిన్యూ రికార్డుల్లో ఎక్కించారు. ఫైల్ నంబరు: బి/950/2017తో సర్వే నంబరు 499/3/1 పేరు మీద 11గుంటల జాగకు కొత్తగా పట్టా పాసుపుస్తకం పొందాడు. అసలు భూమి లేదని తెలిసినప్పటికీ, డబుల్ రిజిస్ట్రేషన్లు చేయడం, వాటికి రెవిన్యూ ఆఫీసర్లు ‘బై’ నంబర్లు తగలించి కొత్తగా పట్టా పాసుపుస్తకాలు ఇవ్వడం సంచలనం కలిగించే అంశంగా కాగా.. అదే పాసుపుస్తకాన్ని అడ్డంపెట్టుకుని ఇప్పుడు కొత్త వెంచర్లో తనకు జాగ ఉందని మోసం చేయడమేగాక, రియల్టర్ల అండతో స్థానిక రైతుల పైన దాడులకు పాల్పడుతున్న నేపథ్యంలో బాధితులు రెవిన్యూ ఆఫీసర్లకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయాల్సి వచ్చింది.
అధికార పార్టీ నేతలు ఎంట్రీ?
బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నేతల జాయింట్ వెంచర్ అని ప్రచారం జరుగుతున్న కతాలగూడలో ఇప్పటి వరకు బాధితుల పక్షాన అధికార పార్టీ లీడర్లు ఎవరూ సహరించలేదు. కానీ 499 సర్వే నంబర్ భూమిలో బీఆర్ఎస్ మాజీ లీడర్ల ప్రమేయం ఉందని తెలిసింది. దాంతో కతాలగూడ ప్రజాప్రతినిధులు అధికార పార్టీలోని మరో వర్గాన్ని ఆశ్రయించినట్టు తెలిసింది. ఈ వర్గానికి ఆ వెంచర్ లో భాగస్వామ్యం లేకపోవడంతో బాధితులు ఆదుకోవాలని కోరుతున్నారు. బీఆర్ఎస్ మాజీ లీడర్లు డబుల్ రిజిస్ట్రేషన్ల బాగోతం నడిపించారని, వాటిని రద్ధు చేయించాలని అధికార పార్టీలోని ఆ వర్గం లీడర్ల ను బాధితులు కోరినట్టు తెలిసింది.
కలెక్టర్ ఆదేశాలు అమలయ్యేనా..?
కతాలగూడ భూముల వివాదాన్ని తాడోపేడో తేల్చాలని బాధితులు నల్ల గొండ తహాశీల్దార్లకు మొరపెట్టుకున్నా వినడం లేదని చెప్తున్నారు. కలెక్టర్ విచారణకు ఆదేశించి రెండు నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు బాధ్యుల పైనా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. 504, 505లో అక్రమంగా నిర్మించిన గోడను తొలగించలేదు. 30 ఫీట్ల పొలం బాటను ఆక్రమించడంతో రైతులు చాలా రోజుల నుంచి ఆందోళన చేస్తున్నారు. అంతేగాక కట్టమైసమ్మ, ముత్యాలమ్మ గుళ్లకు కేటాయించిన జాగను ఆక్రమించారు. దీంతో సమగ్ర విచారణ చేయాలని రెండు నెలల క్రితమే కలెక్టర్ ఆర్డర్ ఇచ్చారు. ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో బాధితులు సోమవారం కలెక్టర్ ను కలిసి మరోసారి ఫిర్యాదు చేశారు. దీంతో కలెక్టర్ చంద్రశేఖర్ సమగ్ర విచారణ చేయాలని ఆర్డీఓ అశోక్ రెడ్డిని ఆదేశించారు. ఇంకోవైపు సమాచార హక్కు చట్టం కింద భూముల పూర్తి వివరాలు ఇవ్వాలని బాధితులు ఆప్లికేషన్స్ పెట్టారు. దీంతో ఈ అక్రమాల ఉచ్చు చివరికి ఎవరి మెడకు చుట్టుకుంటోదోనని ఆఫీసర్లు ఆందోళన చెందుతున్నారు.