నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: నల్లగొండ జిల్లాలో నకిలీ కరెన్సీ నోట్లను ముద్రిస్తూ మార్కెట్లో చెలామణి చేస్తున్న ఒక ప్రమాదకరమైన ముఠా గుట్టును చండూర్ పోలీసులు అత్యంత చాకచక్యంగా గుట్టు రట్టు చేశారు. రద్దీగా ఉండే వ్యాపార సముదాయాలు, గ్రామీణ ప్రాంతాల వారంతపు సంతలు, వృద్ధులు కౌంటర్లలో ఉండే దుకాణాలనే లక్ష్యంగా చేసుకుని నకిలీ నోట్లను చలామణి చేస్తున్న భార్యాభర్తలను పోలీసులు అరెస్టు చేశారు.
ఈ సంచలన కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను నల్లగొండ డీఎస్పీ K Shivaram Reddy సోమవారం నాడు మీడియాకు వెల్లడించారు. నిందితుల నుండి భారీగా నకిలీ నోట్లు, ప్రింటర్, స్కానర్ మరియు ఒక పల్సర్ బైక్ను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు.
మిల్క్ సెంటర్లో దొరికిపోయిన రాజీవ్: K Shivaram Reddy
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చండూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 12వ తేదీన ఈ నకిలీ నోట్ల వ్యవహారం వెలుగుచూసింది. చండూర్ మండలం తాస్కానిగూడెం గ్రామానికి చెందిన ఆవుల కిరణ్ అనే వ్యక్తి చండూర్ టౌన్లోని శ్రీ మాధురి మిల్క్ సెంటర్ వద్ద పాలు విక్రయిస్తుంటాడు. సాయంత్రం 7 గంటల సమయంలో నిందితుడు బెజవాడ రాజీవ్ @ రాజు అక్కడికి వచ్చి పాల ప్యాకెట్ కొనుగోలు చేసి రూ.500 నోటు ఇచ్చాడు.
అయితే ఆ నోటును నిశితంగా గమనించిన కిరణ్.. అది నకిలీ నోటుగా గుర్తించి వెంటనే చండూర్ పోలీసులకు సమాచారం అందించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు చండూర్ పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ 75/2026 లో నూతన భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్లు 178, 179, 180, 181 r/w 3(5) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు డీఎస్పీ వివరించారు.
యూట్యూబ్లో నకిలీ నోట్ల విద్య – భార్యతో కలిసి నేరం
నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఐపీఎస్ ఆదేశాల మేరకు డీఎస్పీ K Shivaram Reddy పర్యవేక్షణలో, చండూర్ సీఐ టి. రాము, ఎస్ఐ జె. శివకుమార్ తమ సిబ్బందితో ప్రత్యేక బృందంగా ఏర్పడి నిందితుల కోసం గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో జూన్ 15న ఉదయం 10 గంటల సమయంలో నల్లగొండ మిర్యాలగూడ రోడ్డులోని ఏచూరి గార్డెన్ సమీపంలో గల కంచర్ల టవర్స్, ఫ్లాట్ నెం. 506 పై పోలీసులు ఆకస్మిక దాడి చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
విచారణలో నిందితులు బెజవాడ రాజీవ్ (38) మరియు అతని భార్య దుర్గం పావని (26) లు తమ ఆర్థిక ఇబ్బందుల నుండి గట్టెక్కడానికి యూట్యూబ్లో (YouTube) నకిలీ నోట్ల తయారీ వీడియోలు చూసి నేర్చుకున్నట్లు ఒప్పుకున్నారు. ఆన్లైన్లో హై క్వాలిటీ బాండ్ పేపర్లు, హెచ్పీ ప్రింటర్ కొనుగోలు చేసి రూ. 500 నకిలీ నోట్లను ముద్రిస్తున్నట్లు అంగీకరించారు. దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుందని తెలిసినా సులభంగా డబ్బు సంపాదించాలనే దురాశతోనే ఈ దందాకు తెరలేపినట్లు నిందితులు పేర్కొన్నారు.
ముఠా లీడర్ రాజీవ్ నేర చరిత్ర – స్వాధీనం చేసుకున్న వస్తువులు
పోలీస్ రికార్డుల ప్రకారం ప్రధాన నిందితుడు బెజవాడ రాజీవ్ సాధారణ నేరస్థుడు కాదని, అతనిపై మిర్యాలగూడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో రౌడీ షీట్ (Rowdy Sheet) కూడా ఉందని డీఎస్పీ కె శివరాం రెడ్డి తెలిపారు. రాజీవ్కు గతంలో ఒక హత్య కేసు, ఒక హత్యాయత్నం కేసుతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని మహబూబాబాద్, తొర్రూర్, కరీంనగర్, గోదావరిఖని, జనగాం, అద్దంకి, సుబేదారి పోలీస్ స్టేషన్లలో కలిపి మొత్తం 07 నకిలీ నోట్ల చలామణి కేసులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

నిందితుల నుండి స్వాధీనం చేసుకున్న సొత్తు:
- నకిలీ రూ. 500 నోట్లు – 15 (రూ. 7,500 విలువైనవి)
- నెంబర్ ప్లేట్ లేని ఒక పల్సర్ బైక్
- హెచ్పీ (HP) కంపెనీ కలర్ ప్రింటర్ & స్కానర్
- 100 జేకే ఎక్సెల్ సూపర్ వైట్ బాండ్ పేపర్లు (JK Excel Bond Papers)
- 20 కట్ చేసిన నకిలీ నోట్ల పేపర్ ముక్కలు
- కత్తెర, స్పార్కెల్ పెన్ మరియు రెండు స్టీల్ స్కేళ్లు.
అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ నకిలీ నోట్ల కేసును డీఎస్పీ కె శివరాం రెడ్డి పర్యవేక్షణలో వేగంగా ఛేదించిన చండూర్ సీఐ టి. రాము, ఎస్ఐ జె. శివకుమార్, ఏఎస్ఐ శ్రీరాములు మరియు పిసిలు ఆనంద్ రెడ్డి, శివరాం కృష్ణ, నరేందర్, ఉపేందర్లను జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ ప్రత్యేకంగా అభినందించి రివార్డులను ప్రకటించారు.