- ఏసీబీ చరిత్రలోనే అతిపెద్ద తిమింగలం ఈఎన్సీ మోహన్‌నాయక్‌కు 14 రోజుల రిమాండ్.. చంచల్‌గూడ జైలుకు తరలింపు..
- గచ్చిబౌలి, కొంపల్లి, మియాపూర్‌లో భారీ విల్లాలు, ప్లాట్లు.. బహిరంగ మార్కెట్ విలువ వందల కోట్లు!
- నిజామాబాద్ జిల్లాలో 19 ఎకరాల వ్యవసాయ భూములు.. రిజిస్ట్రేషన్ రేట్ కంటే 10 రెట్లు అధికం!
- ఇంట్లో గుట్టలుగా దొరికిన 60 విదేశీ మద్యం బాటిళ్లు.. రంగంలోకి ఎక్సైజ్ శాఖ (Excise Department)!
హైదరాబాద్ బ్యూరో, ఏపీబీ న్యూస్: తెలంగాణ రోడ్లు, భవనాల శాఖ (R&B) లో అవినీతి సామ్రాజ్యాన్ని స్థాపించిన ఇంజనీర్-ఇన్-చీఫ్ (ENC) పొక్లావత్ మోహన్‌నాయక్‌ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నిందితుడిని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం ముందు హాజరుపరచగా.. న్యాయమూర్తి మోహన్‌నాయక్‌కు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. దీంతో భారీ భద్రత నడుమ అధికారులు ఆయన్ను చంచల్‌గూడ కేంద్ర జైలుకు తరలించారు.
మైండ్ బ్లాంక్ చేసే ఆస్తుల లిస్ట్ – డాక్యుమెంట్లు ఇవే:
సోదాలు ముగిసిన అనంతరం ఏసీబీ అధికారులు మోహన్‌నాయక్ బినామీలు, అతని పేరున ఉన్న అధికారిక రిజిస్ట్రేషన్ విలువలను ప్రకటించారు. అయితే ప్రభుత్వ రిజిస్ట్రేషన్ విలువల కంటే బహిరంగ మార్కెట్ (Open Market Value) లో వీటి ధర 10 రెట్లు అధికంగా ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు.
హైదరాబాద్ లగ్జరీ ప్లాట్లు: ఐటీ హబ్ గచ్చిబౌలిలో 4 ప్రైమ్ ప్లాట్లు, కొంపల్లిలో 3 ప్లాట్లను గుర్తించారు. వీటి కేవలం ప్రభుత్వ రిజిస్ట్రేషన్ విలువే రూ.7.34 కోట్లుగా ఉంది.
ట్రిపులెక్స్ విల్లా: మియాపూర్‌లో అత్యంత విలాసవంతమైన ట్రిపులెక్స్ విల్లాను ఏసీబీ స్వాధీనం చేసుకుంది. దీని రిజిస్ట్రేషన్ విలువ రూ.2.5 కోట్లు.
కూకట్పల్లి నివాసం: కూకట్పల్లి పరిధిలో రూ.62.14 లక్షల రిజిస్ట్రేషన్ విలువ గల ఒక లగ్జరీ హౌస్‌ను గుర్తించారు.
నిజామాబాద్ సామ్రాజ్యం: నిజామాబాద్ నగరంలో అధునాతనంగా నిర్మాణంలో ఉన్న ఒక విల్లాతో పాటు.. నిజామాబాద్ జిల్లా ముల్లగిం పరిధిలో రూ.82.89 లక్షల రిజిస్ట్రేషన్ విలువ కలిగిన 19.38 ఎకరాల అత్యంత విలువైన వ్యవసాయ భూములను ఏసీబీ సీజ్ చేసింది.
అక్రమ మద్యం నిల్వలు – ఎక్సైజ్ కేసు కూడా నమోదు!
ఏసీబీ అధికారుల సోదాల్లో కేవలం నోట్ల కట్టలు, బంగారమే కాకుండా మరో సంచలన విషయం వెలుగుచూసింది. మోహన్‌నాయక్ నివాసంలో దాదాపు 60 కి పైగా ఖరీదైన విదేశీ, స్వదేశీ బ్రాండ్ల మద్యం బాటిళ్లు లభ్యమయ్యాయి. అనుమతికి మించి ఇంత భారీ స్థాయిలో మద్యం దాచడంతో ఏసీబీ అధికారులు తక్షణమే రాష్ట్ర ఎక్సైజ్ శాఖ (Excise Department) ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. దీంతో అవినీతి కేసుతో పాటు మోహన్‌నాయక్‌పై ఎక్సైజ్ చట్టం కింద అక్రమ మద్యం నిల్వలపై మరో క్రిమినల్ కేసు కూడా నమోదు కానుంది. ఏసీబీ చరిత్రలోనే ఇంతటి భారీ ఆస్తుల డాక్యుమెంట్లు, బినామీల లింకులు దొరకడం ఇదే ప్రథమం. రాబోయే రోజుల్లో మోహన్‌నాయక్‌ను ఏసీబీ కస్టడీకి తీసుకుని విచారిస్తే.. ఈ అవినీతి భాగోతంలో వెనక ఉన్న మరికొంతమంది రాజకీయ, ఇతర శాఖల పెద్దల పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉందని సమాచారం.