APB News Exclusive: అప్పుడే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల జోరు..

నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: వచ్చే ఏడాది మార్చితో ముగియనున్న నల్లగొండ – ఖమ్మం – వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి ఇప్పటి నుంచే ఎన్నికల వాతావరణం వేడెక్కుతోంది. అధికారిక ఎన్నికల నోటిఫికేషన్కు ఇంకా సమయం ఉన్నప్పటికీ, ప్రధాన రాజకీయ పార్టీల్లో అభ్యర్థుల కసరత్తు ప్రారంభమైంది. 2021 లో జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి విజయం సాధించారు. అనంతరం 2023 అసెంబ్లీ ఎన్నికల్లో జనగామ ఎమ్మెల్యేగా గెలుపొందడంతో ఎమ్మెల్సీ(MLC) పదవికి రాజీనామా చేశారు. దీంతో 2024 మే లో జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ మద్దతుతో పోటీ చేసిన చింతపండు నవీన్ కుమార్ (తీన్మార్ మల్లన్న) విజయం సాధించారు. ఆయన పదవీకాలం 2027 మార్చి 9తో ముగియనుంది. సాధారణంగా ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్కు నాలుగైదు నెలల ముందే ఓటరు నమోదు షెడ్యూల్ ప్రకటిస్తారు. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ తొలి వారంలో పట్ట భద్రుల ఓటరు నమోదు కార్యక్రమం ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో పోటీకి ఆసక్తి చూపుతున్న నాయకులు ఇప్పటికే తమ ఎన్నికల వ్యూహాలను అమలు చేయడం ప్రారంభించారు.

ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి గట్టి పోటీ ఇచ్చిన ఏనుగుల రాకేష్ రెడ్డి ఈసారి కూడా బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. పార్టీ వర్గాలు కూడా ఇదే సంకేతాలు ఇస్తున్నాయి. ఈ నేపథ్యంలో నిరుద్యోగులు, పట్టభద్రులను ఆకట్టుకునే కార్యక్రమాలపై ఆయన దృష్టి సారించారు. ఇటీవల నల్లగొండ మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి చేతుల మీ దుగా ‘ఈ-క్లాస్’ (eClass)యాప్ను ప్రారంభించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు ఇతర పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న నిరుద్యోగ యువత కోసం ఈ యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చారు. బిట్స్ పిలానీ పూర్వ విద్యార్థి అయిన రాకేష్ రెడ్డి, ‘నిర్మాణ్’ అనే స్వచ్ఛంద సంస్థ ద్వారా విద్య, ఉపాధి రంగాల్లో పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

బీజేపీ తరఫున పార్టీ అధికార ప్రతినిధి రాణి రుద్రమదేవి పేరు ప్రధానంగా వినిపిస్తోంది. జిట్టా బాల కృష్ణారెడ్డి మద్ధతుతో 2021లో పోటీ చేసిన రాణిరుద్రమ గ్రాడ్యుయేట్లను ఆకట్టుకోలేకపోయారు. బాలకృష్ణారెడ్డి మరణించాక బీజేపీలో చేరిన ఆమె అధికార ప్రతినిధిగా ఉన్నారు. గత ఎన్నికల్లో పోటీ చేసిన అనుభవంతో రాణిరుద్రమను పోటీలో దింపే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. నల్లగొండ జిల్లాకు చెందిన మరో సీనియర్ నేత కాసం వెంకటేశ్వర్లు పేరు కూడా ప్రచారంలో ఉంది. స్టూడెంట్ ఉద్యమాల నుంచి కాసం పేరు నిరుద్యోగులకు సుపరిచితమే. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే గా పోటీ చేయాలని భావించారు. గతంలో రెండు సార్లు పోటీచేసిన గుజ్జల ప్రమేందర్ రెడ్డి గ్రాడ్యుయేట్లను ఆకట్టుకోవడంలో విఫలమయ్యారు. వయసు రీత్యా ఈసారి ఆయన్ని పక్కకు తప్పించి కొత్తవాళ్లకు అవకాశం ఇస్తారని సీనియర్లు చెపుతున్నారు.

కాంగ్రెస్ పార్టీ తరఫున ఎవరు బరిలోకి దిగుతారనే అంశంపై ఇప్పటికైతే స్పష్టత రాలేదు. గత రెండు ఎన్నికల్లో చింతపండు నవీన్ కుమార్ పోటీ చేశారు. 2021లో ఓడిపోయిన ఆయన, 2024 ఉప ఎన్నికలో కాంగ్రెస్ మద్దతుతో గెలిచి ఎమ్మెల్సీ అయ్యారు. పట్టభద్రులు, యువతలో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న తీన్మార్ మల్లన్న కాంగ్రెస్లో చేరడం ఆ పార్టీ కి కలిసొచ్చినప్పటికీ, అనంతరం జిల్లా కాంగ్రెస్ నాయకత్వంపై, ముఖ్యంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా పెద్ద దుమారాన్నే లేపాయి. ప్రస్తుతం బీసీ అజెండాతో ఉద్యమాలు కొనసాగిస్తున్న మల్లన్న ఈసారి స్వతంత్రంగా పోటీ చేసే అవకాశాలపై రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. యువతలో ఆయనకు ఉన్న ఆదరణ, సామాజిక మాధ్యమాల్లో చేసే వ్యాఖ్యలకు లభిస్తున్న స్పందన, ఎమ్మెల్సీగా బీసీ సమస్యలను బలంగా ప్రస్తావిస్తున్న తీరు ఆయనకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చాయి. బీజేపీ సీనియర్ నాయకులతోనూ ఆయనకు సత్సంబంధాలు ఉన్నట్లు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో వచ్చే పట్టభద్రుల ఎన్నికల్లో మల్లన్న ఏ రాజకీయ వ్యూహాన్ని ఎంచుకుంటారనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. మొత్తంగా ఎన్నికలకు ఇంకా నెలల సమయం ఉన్నప్పటికీ, ప్రధాన పార్టీల్లో మాత్రం ఇప్పుడే ఎన్నికల సందడి మొదలైంది.

ఎన్నికల ప్రక్రియ ప్రారంభించడానికి ఐదారు నెలల ముందు నుంచే ఓటరు నమోదు కార్యక్రమం మొదలవుతుంది. అధికార వర్గాల సమచారం మేరకు సెప్టెంబర్ లో గ్రాడ్యుయేట్ ఓటరు నమోదుకు షెడ్యూల్ వెలువడే అవకాశాలు ఉన్నాయి. మూడు నెలల పాటు ఓటరు నమోదు కార్యక్రమాన్ని నిర్వహించి ఫిబ్రవరిలో ఫైనల్ ఓటరు జాబితా ప్రకటిస్తారు. మార్చి మొదటి వారంలో ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉండొచ్చని అధికారులు చెప్తున్నారు.

పార్టీల రహితంగా జరిగే ఎన్నికలే అయినప్పటికీ గ్రాడ్యుయేట్లు, నిరుద్యోగుల తీర్పు అధికారంలో ఉన్న ప్రభుత్వ పనితీరును తేటతెల్లం చేస్తుంది. దీంతో ఈ ఎన్నికలకు అంత క్రేజ్ పెరిగింది. 2021లో 72 మంది అభ్యర్థులు పోటీ చేయగా 5 లక్షల పైచిలుకు ఓటర్లు నమోదయ్యారు. 2024 ఉప ఎన్నికల్లో 52 మంది అభ్యర్థులు పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో 4.50 లక్షల మంది ఎన్రోల్ అయ్యారు. కానీ 3.36 లక్షల ఓట్లు పోలయ్యాయి. రెండుసార్లు జరిగిన ఎన్నికల్లో హేమాహేమీలు నిలబడ్డారు. పల్లా రాజేశ్వ రెడ్డి, ప్రొఫెసర్ కోదండరామ్, చింతపండు నవీన్ కుమార్, రాణిరుద్రమ, చెరుకు సుధాకర్, గుజ్జల ప్రేమేందర్ రెడ్డితో సహా అనేక మంది పోటీ చేశారు. ఉప ఎన్నికల్లో మల్లన్న, రాకేష్ రెడ్డి, ప్రేమేందర్ రెడ్డిల మధ్యనే పోటీ జరిగింది.

Share
Share