- జూన్ 12 వరకు పెద్ద ఎత్తున పర్యావరణ వారోత్సవాలు.. గ్రామాల స్వచ్ఛతకు ప్రత్యేక ప్రాధాన్యం!
- ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మహిళా సంఘాల ద్వారా రూ.1 లక్ష రుణ సదుపాయం!
- పంట అవశేషాలు కాలిస్తే రూ.25 వేల వరకు జరిమానాతో పాటు ఎఫ్ఐఆర్ నమోదు!
చండూరు/నల్లగొండ, ఏపీబీ న్యూస్: పర్యావరణ పరిరక్షణ కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదని, ప్రజలందరి భాగస్వామ్యంతోనే ఇది సాధ్యమవుతుందని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ స్పష్టం చేశారు. ‘ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యాక్రమంలో భాగంగా పర్యావరణ వారోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం చండూరు మండలం, బంగారుగడ్డ గ్రామంలో ప్రత్యేక గ్రామసభ నిర్వహించారు. ఈ సభకు హాజరైన కలెక్టర్.. పల్లెల ప్రగతి, పారిశుద్ధ్యం, మహిళా సాధికారత మరియు పర్యావరణ రక్షణపై దిశా నిర్దేశం చేశారు.
హరితహారం – పారిశుద్ధ్య నిర్వహణ:
తల్లి పేరుతో ఒక మొక్క: పర్యావరణ వారోత్సవాల్లో భాగంగా జూన్ 12 వరకు జిల్లావ్యాప్తంగా పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని కలెక్టర్ కోరారు. ప్రతి ఒక్కరూ తమ తల్లి పేరుతో ఒక మొక్క నాటి, దాన్ని బాధ్యతగా సంరక్షించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్ స్వయంగా గ్రామంలోని నర్సరీలను పరిశీలించి, అమ్మ జ్ఞాపకార్థం ఒక రావి మొక్కను నాటారు.
స్వచ్ఛ పురస్కారాలే లక్ష్యం: వీధుల్లో చెత్త వేయకుండా ప్రత్యేక చెత్త బుట్టలను ఏర్పాటు చేశామని, గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్ది స్వచ్ఛ పురస్కారాలు సాధించేలా ప్రజలు, ప్రజాప్రతినిధులు కృషి చేయాలన్నారు. ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా తగ్గించాలని కోరారు. ఈ క్రమంలో గ్రామ ఉపసర్పంచ్ మహబూబ్ గారు పంచాయతీకి 500 స్టీల్ ప్లేట్లు, 500 గ్లాసులను విరాళంగా ఇవ్వడాన్ని కలెక్టర్ అభినందించారు.
ఇందిరమ్మ ఇళ్లు – సంక్షేమ పథకాలు:
గ్రామీణ పేదల సొంతింటి కల నెరవేర్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్న కలెక్టర్, ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద తొలి విడత ఇళ్లు మంజూరు చేశామని వెల్లడించారు.
రెండో విడతలో గుడిసెల నిర్మూలన: రెండో విడతలో గుడిసెల్లో నివసిస్తున్న అర్హులందరికీ ఇళ్లు అందజేస్తామని హామీ ఇచ్చారు. రోడ్డు విస్తరణ వల్ల ఇళ్లు కోల్పోయిన వారికి ప్రభుత్వ భూమి ఉంటే సర్వే చేసి స్థలాలు కేటాయించాలని అధికారులను ఆదేశించారు.
మహిళా సంఘాలకు అండ: మహిళా సంఘాల ద్వారా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి రూ.1 లక్ష రుణ సదుపాయం కల్పిస్తామన్నారు. అలాగే ‘ఇందిరా మహిళా శక్తి’ కార్యక్రమం ద్వారా పెట్రోల్ బంకులు, రైస్ మిల్లుల వంటి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్లు వివరించారు.
మౌలిక వసతులు & విద్య: ఉపాధి హామీ నిధులతో సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మించుకోవచ్చని, గ్రామంలోని బోరు బావుల మరమ్మతులకు తక్షణ చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. పిల్లలు పదో తరగతితో చదువు ఆపకుండా ఇంటర్, డిగ్రీ, మెడికల్, నర్సింగ్ మరియు స్కిల్ డెవలప్మెంట్ కోర్సులను సద్వినియోగం చేసుకునేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలన్నారు.
వ్యవసాయం, ఆరోగ్యం మరియు కఠిన హెచ్చరికలు:
వర్షపాతం తక్కువగా ఉండే పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులు నీటి అవసరం తక్కువగా ఉండే కందులు, పెసర్లు, మినుములు వంటి ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని సూచించారు. వర్షాకాలంలో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవడం ద్వారా డెంగ్యూ, దోమల వ్యాప్తిని అరికట్టవచ్చన్నారు.
నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ జరిమానా:
గ్రామాల్లో ఎవెన్యూ ప్లాంటేషన్ కింద నాటిన చెట్లను నరికివేస్తే కఠిన చర్యలు ఉంటాయని కలెక్టర్ హెచ్చరించారు. ముఖ్యంగా పొలాల్లో పంట అవశేషాలను (కలిచే అలవాటు) కాల్చితే రూ.5 వేల జరిమానా విధిస్తామన్నారు. ఒకవేళ ఆ మంటల వల్ల ఇతరుల పంటలకు నష్టం కలిగిస్తే రూ.25 వేల జరిమానాతో పాటు అవసరమైతే పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ (FIR) కూడా నమోదు చేస్తామని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో డిపిఓ శంకర్ నాయక్, తహసిల్దార్ రవికాంత్ శర్మ, ఎంపీడీవో బండారు యాదగిరి, ఇంచార్జ్ ఎంపీఓ, కార్యదర్శి కోటి, అగ్రికల్చర్ ఏడి వేణుగోపాల్, సర్పంచ్ బోయపల్లి సునీత, శ్రీను, వివిధ శాఖల అధికారులు మరియు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.