నల్లగొండలో పండుగలా ‘తెలంగాణ అవతరణ’ వేడుకలు…

నల్లగొండ, ఏపీబీ న్యూస్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 12 సంవత్సరాలు పూర్తి చేసుకుని, 13వ సంవత్సరంలో అడుగుపెడుతున్న శుభ సందర్భాన్ని పురస్కరించుకుని నల్లగొండ జిల్లా కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ అధికారిక వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర రోడ్లు & భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించి, జిల్లా ప్రజలకు అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.

ఎందరో అమరవీరుల త్యాగఫలితంగా 4 కోట్ల ప్రజల 60 ఏళ్ల ప్రత్యేక రాష్ట్ర కల సాకారమైందని, ఆనాడు సోనియా గాంధీ తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయం వల్లే తెలంగాణ సాధ్యమైందని మంత్రి ఈ సందర్భంగా స్మరించుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రగతి పథంలో దూసుకుపోతోందని, నల్లగొండ జిల్లాను సర్వతోముఖాభివృద్ధి చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.

రాష్ట్రంలో జరుగుతున్న ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికా” కార్యక్రమంలో భాగంగా జిల్లాలో సాధించిన వివిధ శాఖల ప్రగతి వివరాలను మంత్రి వెల్లడించారు:

మహాలక్ష్మి పథకం: జిల్లాలో మహిళలు, ట్రాన్స్ జెండర్లకు ఆర్టీసీ బస్సుల్లో ఇప్పటివరకు 10 కోట్ల 83 లక్షల ఉచిత ప్రయాణాల ద్వారా రూ.508.85 కోట్ల లబ్ధి చేకూరింది. రూ.500 కే గ్యాస్ సిలిండర్ పథకం కింద 2,52,963 మంది లబ్ధిదారులకు రూ.44.12 కోట్ల సబ్సిడీ అందించారు.

గృహజ్యోతి: 200 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగించే 2,51,117 మంది వినియోగదారులకు జీరో బిల్లులు జారీ చేయగా, దీనికోసం ప్రభుత్వం రూ.184.40 కోట్ల సబ్సిడీ భరించింది.

ఇందిరమ్మ ఇండ్లు: మొదటి విడతలో జిల్లాకు 18,837 ఇండ్లు మంజూరు కాగా, పురోగతిలో ఉన్న గృహాలకు రూ.275 కోట్లు చెల్లించారు. 2,067 గృహాలు పూర్తి కాగా, రెండవ విడతలో ప్రతి నియోజకవర్గానికి మరో 2,000 ఇండ్లు ఇవ్వనున్నట్లు మంత్రి ప్రకటించారు.

రాష్ట్రంలోనే అగ్రస్థానం: యాసంగి (2025-26) సీజన్ లో క్వింటాకు రూ. 2,389 మద్దతు ధరతో, 459 కేంద్రాల ద్వారా 7,24,033 మెట్రిక్ టన్నుల ధాన్యము సేకరించి నల్లగొండ జిల్లాను రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిపిన జిల్లా కలెక్టర్ను మంత్రి అభినందించారు. ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లోనే 78,650 మంది రైతుల ఖాతాల్లో రూ.1223.88 కోట్లు జమ అయ్యాయి.

రైతు రుణమాఫీ: జిల్లాలో రైతు రుణమాఫీ పథకం కింద 2,33,981 మంది రైతులకు రూ.2004.83 కోట్ల రుణాలు మాఫీ అయ్యాయని మంత్రి తెలిపారు.

సాగునీటి రంగానికి నిధులు: నాగార్జునసాగర్ ఎడమ కాలువ లైనింగ్ పనులకు రూ.54 కోట్లు, AMR SLBC ప్రాజెక్టు పనులకు రూ.444 కోట్లు (హై-లెవల్), రూ.52 కోట్లు (లో-లెవల్) మంజూరై పనులు పురోగతిలో ఉన్నాయి. డిండి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ హెడ్ రీచ్ పనులకు రూ.1800 కోట్లు మంజూరయ్యాయి.

రహదారుల విస్తరణ: హైబ్రిడ్ యాన్యుటి మోడల్ (HAM) కింద జిల్లాలో ఫేజ్-1 పరిధిలో 532.05 కి.మీ రహదారుల వెడల్పు పనులకు రూ.1457.66 కోట్లు, ప్లాన్ నిధుల కింద రూ.949.95 కోట్లు మంజూరయ్యాయి. నల్లగొండ పట్టణంలో ఘాట్ రోడ్డు నిర్మాణానికి రూ.140 కోట్లు మంజూరై పనులు వేగంగా సాగుతున్నాయి.

విద్యా రంగం: రూ.20 కోట్లతో నల్లగొండ ఐటిఐ ప్రాంగణంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ప్రారంభించారు. ప్రతి నియోజకవర్గంలో రూ.200 కోట్లతో ఒక ‘యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల’ నిర్మాణం చేపట్టనున్నారు. మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయంలో ఈ ఏడాది నుండే బి.ఫార్మసీ, లా కాలేజీ తరగతులు ప్రారంభమవుతాయి.

వైద్యారోగ్యం: రాజీవ్ आरोग्यశ్రీ పరిమితిని రూ.10 లక్షలకు పెంచడం ద్వారా జిల్లాలో 11,388 మంది లబ్ధి పొందారు. ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి ఉన్నతీకరణకు రూ.32.85 కోట్లు, నూతన ప్రభుత్వ నర్సింగ్ కళాశాల కోసం రూ.40 కోట్లు మంజూరయ్యాయి.

యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్: ప్లాంట్కు సంబంధించి 4 యూనిట్ల నిర్మాణం పూర్తయి వాణిజ్య విద్యుత్ ఉత్పత్తి ప్రారంభమైంది. ప్రస్తుతం రోజుకు సుమారు 76.8 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతుండగా, మిగిలిన చివరి యూనిట్ పనులు 2026 జూలై నాటికి పూర్తవుతాయని మంత్రి వెల్లడించారు.

ఈ వేడుకల సందర్భంగా తెలంగాణ రాష్ట్ర అమరుల కుటుంబ సభ్యులను మంత్రి ఘనంగా సన్మానించారు. విధి నిర్వహణలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ప్రభుత్వ ఉద్యోగులకు ప్రశంసా పత్రాలను, పోలీస్ సేవ పథకాలను అందజేశారు.

అనంతరం చండూరు మండలం ఉడతలపల్లి గ్రామానికి చెందిన లబ్ధిదారురాలు కొరివి శ్రీదేవికి ఇందిరమ్మ ఇంటి పట్టాను మంత్రి అందజేశారు. మెప్మా (MEPMA) ద్వారా లబ్ధిదారులకు రూ.6 కోట్ల 46 లక్షల 50 వేల చెక్కుతో పాటు, స్త్రీ నిధి రుణాలను స్వయం సహాయక మహిళా సంఘాలకు పంపిణీ చేశారు. వివిధ పాఠశాలల విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక నృత్యాలు, జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖలు రూపొందించిన ప్రగతి శకటాల ప్రదర్శనలు వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

ఈ ప్రగతి వేడుకల్లో ఎమ్మెల్సీలు నెల్లికంటి సత్యం, శంకర్ నాయక్, నల్లగొండ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డి, జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్, ఎస్పీ శరత్ చంద్ర పవార్, అదనపు కలెక్టర్ జే. శ్రీనివాస్, ఆర్డీవో వై అశోక్ రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు మరియు అధికారులు పాల్గొన్నారు.

Share
Share