- డిప్యూటీ సీఎం భట్టి చీఫ్ పీఆర్వో మధు
- తల్లి పార్వతమ్మ కన్నీటి పర్యంతం
- పొద్దున్న లేచింది మీ వార్తల కవరేజ్ పైన టెన్షన్: భార్య జ్యోతి
- భట్టి విక్రమార్క ముందు కుటుంబ సభ్యుల కన్నీటి గోడు
- బాధకు బదులు భరోసా ఇచ్చిన డిప్యూటీ సీఎం
- జ్యోతి ఉద్యోగం బదిలీ పైన హామీ, కొడుకు భవిష్యత్తుకు అండ
నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: గత 20 ఏళ్ల నుంచి నా కొడుకు మిమ్ముల్లే నమ్మాడు. మా కుటుంబానికి ఏ కష్టం వచ్చినా నా కొడుకే అన్నీ చూసుకునేవాడు. మా కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయింది. నేను భాగానే ఉన్నా అమ్మా.. జ్యోతికి ఆరోగ్యం సరిగా ఉండదని ఎప్పుడూ భార్య గురించే బాధపడేవాడు. నల్లగొండ వదిలి నా కొడుకు మిమ్మల్ని నమ్మి వచ్చిండు. ఎంత వద్దని చెప్పినా వినల్లేదు. ఇప్పుడు మేమెవరికి దగ్గరికి వెళ్లాలి. అని చీఫ్ పీఆర్వో మధుసూధన్ తల్లి పార్వతమ్మ కన్నీటి పర్యంతమైంది. గుండెపోటుతో మృతి చెందిన మధుసూధన్ కుటుంబాన్ని శుక్రవారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పరామర్శించారు. కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల అంత్యక్రియలకు హాజరు కాలేకపోయానని చెప్పారు. శుక్రవారం మధు చిన్నకర్మ సందర్భంగా వచ్చిన డిప్యూటీ సీఎం ఎదుట మధు కుటుంబ సభ్యులు బోరుమని విలపించారు. మనకేం ఇబ్బంది లేదు.. ఏదైనా భట్టిన్న చూసుకుంటడని అనేవాడని పార్వతమ్మ భట్టి చేతులు పట్టుకుని కన్నీరు పెట్టుకుంది.

‘పొద్దున్న లేచింది మొదలు మీ వార్తల కవరేజ్ గురించే టెన్షన్ పడేవారని, పత్రికల్లో వచ్చిన వార్తలన్నీ మీకు పంపించి, మీరు ఓకే అన్నాకే బ్రెష్ చేసుకునే వాడని మధు భార్య జ్యోతి విలపించింది. ఎప్పుడూ ‘డ్యూటీ డ్యూటీ’ అని పరుగెత్తేవారని, మీ వార్తల కవరేజ్లో తేడా రాకుండా ఉండేందుకు తెగ టెన్షన్ పడేవారని జ్యోతి చెప్పింది. ఎప్పుడూ మీ గురించి ఆలోచన తప్పా మరొకటి ఉండేది కాదని చెప్పింది. ఉద్యోగ రీత్యా నేను కూడా ఒత్తిడితో సతమతమవుతున్నానని, ఆరోగ్యం పూర్తిగా దెబ్బతిన్నదని, కొన్ని రకాల సమస్యలతో బాధపడుతున్నారని జ్యోతి ఆవేధన వెళ్లగక్కారు.

నాన్న మాకోసం హైదరాబాద్ వచ్చిండని, ఇప్పుడు నాన్న లేకపోవడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నామని కొడుకు సూరజ్ డిప్యూటీ సీఎంకు చెప్పాడు. అమ్మ ఆరోగ్యం కూడా బాగోలేదని, అమ్మ ఉద్యోగం విషయంలో ఆదుకోవాలని భట్టిని కోరారు. ఆర్ధికంగా ఎలాంటి ఆస్తిపాస్తులు లేవని, మా అన్న కుటుంబాన్ని ఆదుకోవాలని మధు తమ్ముళ్లు భట్టికి విజ్ఞప్తి చేశారు.

మధు కుటుంబానికి అండగా ఉంట: భట్టి భరోసా
మధుతో తన అనుబంధం విడదీయలేనిదని, ఆ కుటుంబం పట్ల తనకు పూర్తి బాధ్యత ఉందని భరోసా ఇచ్చారు. కుటుంబ బాగోగులను కచ్చితంగా చూసుకుంటానని హామీ ఇచ్చారు. హైదరాబాద్ లో డెప్యూటేషన్ పైన పనిచేస్తున్న జ్యోతిని పర్మినెంట్గా సీటీకీ బదిలీ చేయిస్తానని, అలాగే కొడుకు సూరజ్ను ఎంటెక్(M.Tech) కొనసాగించాలని సూచించారు. సూరజ్ కు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడం సాధ్యం కాదని, భవిష్యత్తులో కార్పోరేట్ కంపెనీల్లో మంచి ఉద్యోగం వచ్చేలా తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. త్వరలోనే ప్రజాభవన్ కు వచ్చి కలవాలని కుటుంబ సభ్యులకు డిప్యూటీ సీఎం భట్టి సూచించారు.