నల్గొండ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో విజిలెన్స్ తనిఖీలు… అదుపులో ఆరుగురు ప్రైవేటు వ్యక్తులు..

నల్లగొండ, ఏపీబీ న్యూస్: నల్గొండ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో విజిలెన్స్ అధికారులు బుధవారం ఆకస్మిక సోదాలు నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న సాధారణ తనిఖీలలో భాగంగా నల్లగొండలోని స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో విజిలెన్స్ సిఐ దశరథ మనోజ్ కుమార్ నేతృత్వంలో సోదాలు చేపట్టారు. ఈ తనిఖీలలో పలు డాకుమెంట్లను, రికార్డులను, అటెండెన్స్ రిజిస్టర్ను పరిశీలించారు. స్లాట్ బుకింగ్ జరిగిన విధానంతో పాటు రిజిస్ట్రేషన్ ప్రక్రియను అడిగి తెలుసుకున్నారు. నల్లగొండ సబ్ రిజిస్ట్రార్ పగిళ్ల నగేష్ విజిలెన్స్ అధికారులు అడిగిన సమాచారాన్ని అందించారు.

ఇదిలా ఉండగా ప్రభుత్వం నుండి, రిజిస్ట్రేషన్ శాఖ నుండి ఎలాంటి ధ్రువీకరణ పత్రాలు లేకుండా అనధికారికంగా విధులు నిర్వర్తిస్తున్న ఆరుగురు సిబ్బందిని విజిలెన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఇందులో ఇద్దరు మహిళలు కాగా నలుగురు పురుషులు ఉన్నారు. వీరిని విజిలెన్స్ కార్యాలయానికి తరలించి వ్యక్తిగతంగా అందరిని వేర్వేరుగా విచారణ చేస్తున్నారు. వీరంతా ఎవరు అనే దానిపై విజిలెన్స్ అధికారులు వారి నుంచి స్టేట్మెంట్లను రికార్డు చేసి పంపించారు. ఎంతకాలం నుండి పని చేస్తున్నారు, ఎంత వేతనం పొందుతున్నారు, ఆ వేతనం ఎక్కడి నుండి వస్తుంది అనే విషయాలపై విచారణ చేపట్టారు. అంతేకాకుండా గత కొన్ని సంవత్సరాల నుండి చేసిన రిజిస్ట్రేషన్ లపై డాక్యుమెంట్ వారిగా రికార్డులను పరిశీలిస్తున్నారు. తనిఖీల సందర్భంగా రికార్డుల పరిశీలనకు సంబందించి పూర్తి వివరాలను ప్రభుత్వానికి నివేదిస్తారు.

ఈ సందర్భంగా విజిలెన్స్ అధికారులు మాట్లాడుతూ ఇది రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న సాధారణ తనిఖీలల్లో బాగంగా నిర్వహించడం జరిగిందని తెలిపారు. అయితే విజిలెన్స్ అధికారుల సోదాల నేపథ్యంలో సబ్ రిజిస్టర్ ఆఫీస్ పరిసరాల్లో ఉన్న డాక్యుమెంట్ రైటర్లు అప్రమత్తమై తమ షాపులను బంద్ పెట్టారు. ఈ విజిలెన్స్ తనిఖీల ఎస్ఆర్వో మనోహర్, హెడ్ కానిస్టేబుల్ నర్సింహా రెడ్డి, వెంకటయ్య, పాషా తదితరులు ఉన్నారు.

Share
Share