- 9 రోజుల్లో 223 కోట్లు టార్గెట్
- లిక్కర్ సేల్స్‌లో వెనకబడ్డ ఉమ్మడి నల్లగొండ జిల్లా
- వేసవిలో జోరుగా బీర్ల అమ్మకాలు
- ఈ నెల సేల్స్ అంచనా రూ.405 కోట్లు.. ఇప్పటి వరకు రూ.182 కోట్లే
- బ్యాలెన్స్ టార్గెట్ రూ.223 కోట్లు చేరుకోవడం పైనే ఎక్సైజ్ శాఖ ఫోకస్
- బీర్లు 15,165 కాటన్లు అధికం, లిక్కర్ 25,585 పెట్టెలు మైనస్
నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: ఉమ్మడి జిల్లా మద్యం అమ్మకాల్లో వెనకబడింది. సేల్స్ లో రాష్ట్రంలో ఎప్పుడూ ముందుండే జిల్లా ఈ సీజన్ లో వెనకబడటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. సేల్స్ పెంచేందుకు ప్రభుత్వం ఈసారి అనేక సడలింపులు కూడా ఇచ్చింది. పట్టణాల్లో ఎక్కడైన షాపులు పెట్టుకునే వెసులుబాటు కల్పించింది, అంతేగాక మండల కేంద్రాల్లో షాపులను మేజర్ గ్రామాల్లో ఏర్పాటు చేసుకునే అవకాశం కల్పించింది. బెల్టు షాపుల్లో అధిక రేట్లకు మద్యం అమ్ముతున్నారే ఉద్దేశంతో ప్రభుత్వం కొత్త పాలసీలో మార్పులు చేసింది. అయినప్పటికీ సేల్స్ ఆశించిన స్థాయిలో పెరగడం లేదు. ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం రావట్లేదు. సాధారణంగా ఈ సీజన్లో పెళ్లిళ్లు, ఫంక్షన్లు, దావత్‌లు జోరుగా సాగుతుంటాయి. ముఖ్యంగా వేసవిలో బీర్లు కాటన్లకు కాటన్లు ఖాళీ అవుతుంటాయి. లిక్కర్ తో పోలిస్తే బీర్ల సేల్స్ కాస్తంతా ఫర్వాలేదనిపిస్తోంది, కానీ లిక్కర్ మాత్రం పూర్తిగా తగ్గిపోయింది. జిల్లాలో నాటుసారా ఆనవాళ్లు కూడా అంతగా లేవు. కల్తీ లిక్కర్ ఆస్కారం లేదు. కానీ సేల్స్ ఎందుకు తగ్గుతున్నాయో ఎక్సైజ్ శాఖకు కూడా అంతు చిక్కడం లేదు.
ఆర్డనరీ లిక్కర్ వైపే మొగ్గు…
ఈ నెల 1 నుంచి 20 తేదీ వరకు ఉమ్మడి జిల్లాలో మద్యం అమ్మకాలను పరిశీలిస్తే లిక్కర్ 1,57,148 కాటన్లు అమ్ముడుకాగా, బీర్లు 3,09,847 పెట్టెలు అమ్ముడయ్యాయి. గతేడాది ఇదే రోజుల్లో లిక్కర్ 1,82,733 పెట్టెలు కాగా, బీర్లు 2,94,602 పెట్టెలు అమ్ముడయ్యాయి. అంటే గతేడాదితో పోలిస్తే లిక్కర్ 25,585 పెట్టెలు తగ్గింది. బీర్లు మాత్రం 15,165 పెట్టెలు పెరిగాయి. గతేడాది ఇదే రోజుల్లో ఎక్సైజ్ ఆదాయం రూ.190 కోట్లు కాగా, ఈ సారి రూ.182కోట్లు మాత్రమే వచ్చింది. రూ.8 కోట్ల ఆదాయం తగ్గింది. గతేడాది ఏప్రిల్ లో ప్రీమియం బ్రాండ్లు భారీగా సేల్ కాగా, ఈ ఏడాది ఆర్డనరీ బ్రాండ్లు సేల్ పెరిగింది. ప్రీమియం బ్రాండ్ల సేల్ తగ్గింది. ఏప్రిల్ 1 నుంచి 20 వరకు గతేడాది ఆర్డనరీ లిక్కర్ సేల్స్ 20,855 పెట్టెలు కాగా, ఈసారి 23,746 పెట్టెలు పెరిగాయి. ప్రీమియం బ్రాండ్లు గతేడాది 1,61,878 పెట్టెలు(కాటన్లు) సేల్ కాగా, ఈసారి 1,33,402 పెట్టెలు తగ్గాయి. అంటే గతేడాది తో పోలిస్తే ఈసారి ఆర్డనరీ లిక్కర్ 2,891 పెట్టెలు పెరిగితే, ప్రీమియం 28,476 పెట్టెలు తగ్గాయి.
ఆశించిన ఆదాయం రావట్లే…
ప్రభుత్వానికి, ఎక్సైజ్ శాఖ మధ్య గ్యాప్ పెరిగింది. గత కొంత కాలంగా ఎక్సైజ్ శాఖలో రాష్ట్ర వ్యాప్తంగా తలెత్తున్న విభేదాలు జిల్లాలో స్టేషన్ల వరకు పాకాయి. కానిస్టేబుళ్ల పంచాయితీల మొదలు ఈఎస్(ES) ల వరకు ఎవరికి వారే ఇష్టం వచ్చినట్టు వ్యవహారిస్తున్నారు. దాంతో లిక్కర్ సేల్స్ పైన డిపార్ట్మెంట్ ఫోకస్ తగ్గింది. ప్రభుత్వం నిర్ధేశించిన టార్గెట్లను నిర్లక్ష్యం చేస్తున్నారు. ఎక్సైజ్ శాఖకు ఆదాయం తెచ్చి పెట్టే సీజన్లో వేసవి ప్రధానమైంది, కానీ ఈ ఏప్రిల్ 20 రోజుల్లోనే 337.62 కోట్ల ఆదాయం రావాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకు కేవలం రూ.182.48 కోట్ల ఇన్ కం మాత్రమే వచ్చింది. రోజుకు రూ.25 కోట్ల మద్యం సేల్స్ జరగాలి, కానీ కేవలం రోజుకు రూ.7 కోట్ల ఆదాయమే వస్తోంది. గతేడాది ఇదే రోజుల్లో రూ.190.53 కోట్ల ఆదాయం వచ్చింది.
223 కోట్ల ఆదాయం ఎట్లా తేవాలే…
గతేడాది ఏప్రిల్ 30 రోజుల్లో ప్రభుత్వానికి రూ.337.62 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ నెల సర్కార్ రూ.405.15 కోట్ల టార్గెట్ పెట్టింది. కానీ ఇప్పటి వరకు రూ.182.48 కోట్ల ఆదాయం మాత్రమే వచ్చింది. 45 శాతం టార్గెట్ మాత్రమే చేరుకుంది. ప్రభుత్వం టార్గెట్ ప్రకారం లెక్కిస్తే బ్యాలెన్స్ రూ. 223 కోట్లు ఈ 9 రోజుల్లో రాబట్టాలి, ఒక వేళ టార్గెట్ మిస్సైనా కనీసం గతేడాది ఏప్రిల్ టార్గెట్ అయినా రీచ్ కావాలి లేదంటే ప్రభుత్వానికి మరింత గడ్డుకాలం తప్పదు.
ఆ మూడు స్టేషన్లు టాప్… వెనకబడ్డ చండూరు, మోత్కూరు
ఉమ్మడి జిల్లా సేల్స్ లో ముందంజలో నల్గొండ, సూర్యాపేట, మిర్యాలగూడ స్టేషన్లు ఉండగా, చండూరు, మోత్కూరు, నాంపల్లి ఎస్ హెచ్ ఓ(SHO)లు వెనకబడ్డాయి. నల్గొండ SHO రూ.20.29 కోట్లతో అగ్రస్థానంలో ఉంది. సూర్యాపేట రూ.18.28 కోట్లు, మిర్యాలగూడ రూ.17.32 కోట్లు, భువనగిరి రూ.16.23 కోట్లతో టాప్ లో ఉన్నాయి. ఈ స్టేషన్లలో బీర్లకు ఫుల్ గిరాకీ, లిక్కర్ విక్రయాలలో మిర్యాలగూడ, కోదాడ, భువనగిరి స్టేషన్లు ఫర్వాలేదనిపించాయి. బీర్ల విక్రయాల్లో నల్గొండ (35,323 కాటన్లు), సూర్యాపేట (31,069 కాటన్లు), భువనగిరి (29,414 కాటన్లు) టాప్‌లో నిలిచాయి. చండూర్ లో రూ.7.46 కోట్లు, మోత్కూరు రూ.8.01 కోట్లు, తుంగతుర్తి రూ. 8.85 కోట్లతో తక్కువ స్థాయిలో ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో బీర్, లిక్కర్ రెండింటి అమ్మకాలు తగ్గాయి.
ఈనెల 1 నుంచి 20 వరకు ఉమ్మడి జిల్లాలో మద్యం సేల్స్
| స్టేషన్ | లిక్కర్ | బీర్లు | విలువ (కోట్లలో) |
| చండూరు | 6387 | 12464 | 7.46 |
| దేవరకొండ | 9360 | 16263 | 10.71 |
| హాలియా | 8855 | 18429 | 10.33 |
| మిర్యాలగూడ | 16370 | 26083 | 17.32 |
| నకిరేకల్ | 6986 | 19390 | 9.24 |
| నల్లగొండ | 16287 | 35323 | 20.29 |
| నాంపల్లి | 7174 | 15447 | 8.91 |
| హుజూర్నగర్ | 11216 | 13538 | 10.68 |
| కోదాడ | 12928 | 15078 | 12.06 |
| సూర్యాపేట | 15621 | 31069 | 18.28 |
| తుంగతుర్తి | 6904 | 17973 | 8.85 |
| ఆలేరు | 10530 | 21988 | 12.77 |
| భువనగిరి | 13296 | 29414 | 16.23 |
| మోత్కూరు | 6404 | 15384 | 8.01 |
| రామన్నపేట | 8830 | 22004 | 11.33 |