APB News Exclusive: నల్లగొండకు హరీష్ రాక… పొలిటికల్ కేక..

నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: బీఆర్ఎస్ సీనియర్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు ఆకస్మిక పర్యటన రాజకీయంగా చర్చకు దారితీసింది. ఆదివారం నాగార్జునసాగర్ లోని పెద్దవూర మండలం బసిరెడ్డిపల్లి గ్రామంలో రిటైర్డ్ సబ్రిజిస్ట్రార్ గోనా విష్ణువర్ధన్ రావు ఆహ్వానం మేరకు ప్రత్యేకంగా వచ్చిన హారీష్ రాక వెనక బలమైన రాజకీయ కోణం ఉందని తెలుస్తోంది. సబ్రిజిస్ట్రార్ అసోసియేషన్ కు రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన విష్ణువర్ధన్ రావు (వెలమ) కూతురు వివాహం ఇటీవల జరిగింది. వివిధ కారణాల దృష్ట్యా ఈ వివాహానికి హరీష్ రావు హాజరు కాలేదు, దాంతో బసిరెడ్డిపల్లిలోని ఆయన తోటలో ఏర్పాటు చేసిన విందు కార్యక్రమానికి హరీష్ రావు ను ఆహ్వానించారు. ఈ కార్యక్రమానికి జిల్లాలోని పలువురు మాజీ ఎమ్మెల్యేలు హాజరుకాగా, మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి మాత్రం దూరంగా ఉన్నారు. నల్లగొండ మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి తిరుపతి పర్యటనలో ఉన్నందున ఆయన రాలేదు. అయితే జగదీష్ రెడ్డి రాకపోవడం గురించి పార్టీలో కొంత ఆసక్తికర చర్చ జరిగింది. విష్ణు వర్దన్ విందు వెనక రాజకీయ కోణం ఉందని తెలుస్తోంది. సబ్ రిజిస్ట్రార్ గ ఉన్నప్పుడే 2014లో సాగర్ లో పోటీకి విష్ణువర్దన్ ని దింపాలని పార్టీ ఆలోచించింది. ఆ తర్వాత మళ్లీ 2023 ఎన్నికల్లో కూడా ఆయన పేరు తెరపై కొచ్చింది, కానీ నోమల నర్సింహాయ్య ఫ్యామిలీకే పార్టీ ప్రియార్టీ ఇచ్చింది. ప్రస్తుతం సాగర్ మాజీ ఎమ్మెల్యే భగత్ రాజకీయంగా రాణించలేకపోతున్నాడని, ఆయనకు బదులు జగదీష్ రెడ్డి అనుచరుడు ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డిని వచ్చే ఎన్నికల్లో రంగంలోకి దింపేందుకు పావులు కదుపుతున్నారు. ఈ నేపథ్యంలో హరీష్ రావు విష్ణువర్ధన్ ఇంట్లో విందు భోజనం చేయడం, మాజీ ఎమ్మెల్యేలు పాల్గొనడం ఆసక్తికరంగా మారింది.

సోమవారం చిరుమర్తి లింగయ్య బర్త్డే సందర్భంగా నల్లగొండ పట్టణంలోని ప్రధాన జంక్షన్లలో ఆయన ఫ్లెక్సీలు కనిపించడం కలకలం రేపింది. ఆదివారం రాత్రి నార్కట్ పల్లి లో ఆయన స్వగృహాంలో బర్త్డే వేడుకులు హరీష్ రావు సమక్షంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమనికి మాజీ ఎమ్మెల్యేలు ఫైళ్ల శేఖర్ రెడ్డి, గాదరి కిషోర్ కుమార్ మరికొంత నాయకులు హాజరుకాగా, తెల్లారేసరికి నల్లగొండలో చిరుమర్తి ఫ్లెక్సీలు కనిపించడం చర్చకు దారితీసింది. కంచర్ల భూపాల్ రెడ్డి ఫ్లెక్సీలు కనిపిస్తేనే చిర్రుమనే కాంగ్రెస్ కేడర్… చిరుమర్తి ఫ్లెక్సీల విషయంలో సైలెంట్గానే ఉండటం అనుమానాలకు తావిస్తోంది. డీలిమిటేషన్ నేపథ్యంలో నల్లొండ ఎస్సీ జనరల్ లేదా మహిళకు రిజర్వు చేస్తే చిరుమర్తి ఇక్కడి నుంచి పోటీ చేసే ఆలోచనతో ఉన్నట్టు తెలిసింది. మహిళ అయితే ఆయన కూతురిని పోటీలో దింపేందుకు సిద్ధంగా ఉన్నారు. నిజానికి ఎస్సీ జనరల్ అయితే తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ కూడా ఇక్కడ సిద్ధంగా ఉన్నారు. కిషోర్ సొంత ఊరు నల్లగొండ కాగా, ఆయనకు మరింత కలిసొస్తది. దీన్ని గ్రహించిన చిరుమర్తి ముందుగానే నల్లగొండలో కర్చీఫ్ వేసిండని పార్టీలో చర్చ జరుగుతోంది. అక్కడ సాగర్లో, ఇక్కడ నల్లగొండలో చోటుచేసుకున్న కర్చీఫ్ రాజకీయాలు బీఆర్ఎస్ లో హాట్ టాపిక్ గా మారాయి.

Share
Share