- గ్రామాల్లోనే లింగ వివక్ష పట్ల అవగాహన
- మూడు జిల్లాల్లో 960–980 మధ్యలోనే
- సూర్యాపేట జిల్లాలోనే కాస్తంత మెరుగు
- నల్లగొండ జిల్లాలో తగ్గిపోతున్న స్త్రీ సంతానోత్పత్తి
- గ్రామాలతో పోలిస్తే పట్టణాల్లోనే లింగ వివక్ష
నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: స్త్రీ, పురుషుల మధ్య లింగ వివక్ష రూపుమాపేందుకు ఎన్నో రకాల కార్యక్రమాలు చేపడుతున్నా ఫలితం కనిపించడం లేదు. స్త్రీ సంతానోత్పత్తి విషయంలో తీవ్రమైన వివక్షత కనిపిస్తోంది. లింగనిర్ధారణ పరీక్షలు చేయోద్దని ఆరోగ్య శాఖ, అంగన్ వాడీలు చేస్తున్న ప్రచారం కూడా ఫలితాలు రాబట్ట లేకపోతున్నాయి. గుట్టచప్పుడు కాకుండా లింగనిర్ధారణ పరీక్షలు చేయడం, ఆడ సంతానం అని తెలియగానే అబార్షన్ చేయించుకోవడం వంటి సంఘటనలు తెరవెనక ఎన్నో జరుగుతున్నాయి. చట్టపరంగా ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ లింగ వివక్షను అడ్డుకోలేకపోతున్నారు. సామాజిక ఆర్ధిక సర్వేలో ప్రతి వెయ్యి పురుషులకు 960 నుంచి 980 మంది మహిళలే ఉండటం కలవరపాటుకు గురిచేస్తోంది. గ్రామాలతో పోలిస్తే పట్టణాల్లోనే లింగ వివక్షత స్పష్టంగా కనిపిస్తోంది.
నల్లగొండ జిల్లాలో గ్రామాల్లో ప్రతి వెయ్యి మంది పురుషులకు 965 మంది మహిళలు ఉండగా, పట్టణాల్లో మరీ దారుణం 950 మాత్రమే ఉన్నారు. యాదాద్రి జిల్లాలోని గ్రామాల్లో ప్రతి వెయ్యి మందికి 975 మహిళలు ఉండగా, పట్టణాల్లో 960 మంది ఉన్నారు. సూర్యాపేట జిల్లాలోనే కాస్తంత ఫర్వాలేదనిపించింది. ఈ జిల్లాలో ప్రతి వెయ్యి మంది పురుషులకు 985 మంది స్త్రీలు ఉండగా, పట్టణాల్లో 970 మంది ఉన్నారు. ఈ జిల్లాలోనే మహిళల శాతం ఎక్కువ ఉండటం విశేషం.
ఒక్కరితోనే ఆగిపోతున్న దంపతులు..
పల్లెల్లో స్త్రీ, పురుషుల మధ్య అంతరం అంతగా లేదు, కానీ పట్టణాల్లో నివసిస్తున్న దంపతులు ఒక్కరిని కనడంతోనే ఆగిపోతున్నారు. ఆర్ధిక సమస్యలు, ఖర్చుల భారం భరించలేక మొదటి సంతానంతోనే ఫుల్స్టాప్ పెడుతున్నారు. ఆడ, మగ ఎవరో ఒకరు పుట్టడంతోనే ఆగిపోతున్నారు. వారసత్వం కోరుకుంటున్న కుటుంబాలు ఆడపిల్ల అని తెలియగానే అభార్షన్ చేయిస్తున్నారు. రెండో ప్రయత్నంలో మగ సంతానం అనగానే అంతటితో ఆగిపోతున్నారు. దాంతో 0-6 ఏళ్ల లోనే లింగ వివక్ష చాలా స్పష్టంగా కనిపిస్తోంది. నల్లగొండ జిల్లాలో వెయ్యి మంది అబ్బాయిలకు గ్రామాల్లో 935-940 మంది జన్మిస్తే, పట్టణాల్లో 920-930 మంది మాత్రమే జన్మిస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రతి వెయ్యి మంది అబ్బాయిలకు గ్రామాల్లో 940-945 మంది జన్మిస్తే, పట్టణాల్లో 925-930 మంది మాత్రమే జన్మిస్తున్నారు. సూర్యాపేట జిల్లాలో కూడా ప్రతి వెయ్యి మంది అబ్బాయిలకు గ్రామాల్లో 945-950 మంది జన్మిస్తే, పట్టణాల్లో 930- 935 మంది జన్మించడం లింగ వివక్ష ఏ స్థాయికి చేరిందో అద్ధం పడుతోంది.