APB News Exclusive: నల్లగొండ జిల్లాలో సాగునీరు… ఉపాధి కరువే.. మహిళల అక్షరాస్యత అంతంత మాత్రమే..

నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: నల్లగొండ జిల్లా కష్టాల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతోంది. ప్రాజెక్టులు పూర్తిగాకా గత కొన్నేళ్ల నుంచి భూగర్భజలాల పైనే ఆధారపడి పంటలు సాగుచేస్తున్నారు. దీంతో ఉపాధి కరవుతోంది. నీటి కొరత కారణంగా ఉపాధి కోసం జనాలు పట్టణాలకు వలస పోతున్నారు. ప్రభుత్వం తాజాగా ప్రకటించిన సామాజిక ఆర్ధిక కులగణన సర్వేలో ఆర్ధికంగా, సామాజికంగా అభివృద్ధి చెందుతున్న జిల్లాలో సూర్యాపేట ముందంజలో ఉండగా, యాదాద్రి జిల్లా అక్షరాస్యతలో మొదటి స్థానంలో నిలిచింది. మహిళ అక్షరాస్యత సాధించడంలో కూడా నల్లగొండ వెనకబడే ఉంది.

అక్షరాస్యత సాధించడంలో యాదాద్రి జిల్లా టాప్లో నిలిచింది. నల్లగొండ, సూర్యాపేట జిల్లాలతో పోలిస్తే మెరుగైన విద్యా ప్రమాణాలు సాధిస్తోంది. హైదరబాద్ కు సమీపంలో ఉండటం వల్ల విద్యా అవకాశాలు మెరుగ్గు ఉన్నందున అక్షరాస్యత సాధించడంలో ముందంజలో ఉంది. ఈ జిల్లాలో అక్షరాస్యత 67 నుంచి 69 శాతం నమోదైంది. రెండో ప్లేస్ లో సూర్యాపేట జిల్లా నిలిచింది. పట్టణ ప్రభావం ఉన్న సూర్యాపేట, కోదాడలో విద్యా ప్రమాణాలు విస్తరించి ఉన్నందున అక్షరాస్యత సాధిస్తోంది. 65-67శాతం మధ్య అక్షరాస్యత నమోదైంది. నల్లగొండ జిల్లాలో అక్షరాస్యులు 64–66 శాతం మధ్య ఉన్నారు. ఈ జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల పైనే ఆధారపడి చదువుకుంటున్న వాళ్లే ఎక్కువ. ప్రైవేటు స్కూళ్లు ఉన్నప్పటికీ ఫీజులు లక్షల్లో ఉండటంతో పేద, మధ్య తరగతి ప్రజలు ప్రభుత్వ బడుల వైపే ఆసక్తి చూపిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మహిళల అక్షరాస్యత తక్కువగా ఉండటం కలవరపర్చే అంశం. గతంలో వయోజన విద్య కార్యక్రమాల అమల్లో ఉండటం వల్ల గ్రామాల్లో మహిళలకు చదువు నేర్పించడం జరిగేది, కానీ గత కొన్నేళ్ల నుంచి అక్షరాస్యత కార్యక్రమాలు ఆపేశారు. దీంతో మళ్లీ ఫిమేల్ లిట్రసీ తగ్గిపోయింది.

ఉమ్మడి జిల్లాలో వలస పోతున్న జనాలు అత్యధికంగా నల్లగొండ జిల్లాలో ఉన్నారు. ఈ జిల్లా ప్రజల ప్రధాన వృత్తి వ్యవసాయం కాబట్టి కూలీ పనుల పైనే ఆధారపడి జీవిస్తున్నారు. వ్యవసాయ పనులకు కొరత ఏర్పడితే పట్టణాలకు వలసపోతున్నారు. దేవరకొండ, నల్లగొండ, మునుగోడు, నకిరేకల్ ప్రాంతాల ప్రజలు ఉపాధి కోసం దుబాయి, ముంబై, హైదారాబాద్, బెంగళూరు వంటి సీటీలకు మైగ్రేట్ అవుతున్నారు. దాంతో ఇక్కడ వ్యవసాయ కూలీలకు కొరత ఏర్పడింది. బీహార్, యూపీ, ఛత్తీస్గఢ్, ఒరిస్సా నుంచి నల్లగొండకు వలసలు పెరిగిపోతుండగా, ఈ జిల్లా ప్రజలు ఉపాధి కోసం మరొక ప్రాంతాలకు వలసెళ్లడం కలవరపాటుకు గురిచేస్తోంది. శాశ్వత ఉపాధి దొరక్కపోవడం కూడా ప్రధాన సమస్యే. జాతీయ రహాదారిని ఆనుకుని ఉన్న సూర్యాపేట జిల్లాలో వ్యవసాయ, బిజినెస్, ట్రాన్స్పోర్ట్ వ్యాపారాలతో కళకళలాడుతోంది. వ్యాపారానికి సూర్యాపేట జిల్లా అనువైన ప్రాంతం. యాదాద్రి జిల్లాలో వ్యవసాయం, చిన్నచిన్న బిజినెస్ లు, పరిశ్రములు, సేవల రంగంతో అభివృద్ధి దిశగా అడుగులు వేస్తోంది.

మూడు జిల్లాలో ఆదాయం విషయంలో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి, కాకపోతే యాదాద్రి జిల్లాలో పట్టణీకరణ వేగవంతంగా అభివృద్ధి చెందుతున్న క్రమంలో ప్రజలు కాస్తంత మెరుగైన జీవన స్థాయి కలిగి ఉన్నారు. నల్లగొండ జిల్లా పూర్తిగా వర్షాదార పైనే ఆధారపడి ఉంది. కాబట్టి ఈ జిల్లా ప్రజల ఆదాయం స్థిరంగా లేదు. అన్నింటికి హైదరాబాద్ సమీపంలోనే ఉండటంతో తక్కువ నుండి మధ్యస్థంగానే ఆదాయం కనిపిస్తోంది. సుస్థిరమైన ఆదాయం అనేది లేదు. వర్షాల పైనే ఆధారపడి పంటలు సాగుచేయాల్సిన పరిస్థితులు ఉన్నాయి. సూర్యాపేట జిల్లాలో ఆదాయం ఎక్కువగానే ఉంటోంది. ఇక్కడ వ్యవసాయంతోపాటు, బిజినెస్ ఎక్కువ, రవాణా సౌకర్యం వల్ల ఆదాయం పెరుగుతుంది.

నల్లగొండ జిల్లాలో ఎండ ప్రాంతం ఎక్కువ, దాంతో నీటి వనరులు తక్కువగానే ఉన్నాయి. భూగర్భజలాల పైన ఆధారపడి పంటలు సాగు చేస్తున్నారు. ప్రధానంగా వరి, పత్తి, మిర్చి పంటల సాగు ఎక్కువ. కాగా, సూర్యాపేట జిల్లాలో నీటి వనరులు అధికం. నాగార్జునసాగర్ ఎడమ కాల్వ, ఎస్సారె స్సీ(SRSP) నీటి జలాలు ప్రవహిస్తున్నందున రెండు జిల్లాలతో పోలిస్తే నీటి వనరులు సూర్యాపేట జిల్లాలో ఎక్కువ అనే చెప్పాలి. కాబట్టి ఈ జిల్లాలో వరి, పత్తితో పాటు, మిర్చి వంటి వాణిజ్య పంటలు కూడా సాగుచేస్తున్నారు. పైగా విస్తృతమైన మార్కెటింగ్ సదుపాయాలు కూడా అందుబాటులో ఉన్నాయి. దాంతో రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర లభిస్తోంది. యాదాద్రి జిల్లాలో మిశ్రమ వ్యవసాయం సాగువుతోంది. వరి, మక్క, పత్తి పంటల సాగు విస్తీర్ణం ఎక్కువ, మూసీ నదీ, గోదావరి జలాల వల్ల కొంత మేర సేద్యానికి అవసరమయ్యే నీటి వనరులు ఉన్నాయి.

అక్షరాస్యత సాధించడంలో యాదాద్రి జిల్లా ముందంజలో ఉంది. ఆదాయంలో సూర్యాపేట జిల్లాలో టాప్లో ఉండగా, నల్లగొండ జిల్లా ప్రజలు వ్యవసాయం మీద ఎక్కువ ఆధారపడి జీవిస్తున్నారు. రాష్ట్రంలో భౌగోళికంగా నల్లగొండ జిల్లా విస్తీర్ణం పెద్దది.  నల్లగొండ, మిర్యాలగూడ, దేవరకొండ, నకిరేకల్, చందంపేట, దామరచర్ల మండలాల్లో వ్యవసాయం ప్రధాన వృత్తిగా కనిపిస్తోంది. విజయవాడ-హైదరాబాద్ ప్రధాన జాతీయ రహాదారిని ఆనుకుని ఉన్న సూర్యాపేట జిల్లాలో వ్యాపారం ఎక్కువగా నడుస్తోంది. దీంతో ఈ జిల్లాలో ఆదాయం కూడా ఎక్కువగానే వస్తోంది. ప్రధానంగా సూర్యాపేట, కోదాడ, హుజూర్నగర్, నడిగూడెం, తిరుమలగిరి మండలాలు బిజినెస్ లో అగ్రగామిగా నిలిచాయి. హైదరాబాద్, వరంగల్ కు మధ్యలో ఉన్న యాదాద్రి భువనరిగి జిల్లా అభివృద్ధి దిశగా దూసుకుపోతోంది. రెండు జిల్లాలతో పోలిస్తే ఈ జిల్లాలో అక్షరాస్యత శాతం ఎక్కువ. భువనగిరి, చౌటుప్పుల్, ఆలేరు, మోత్కూ రు, యాదగిరిగుట్ట మండలాల పైన హైదరాబాద్ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది.

నల్లగొండ జిల్లాలో నల్లగొండ, మిర్యాలగూడ, దేవరకొండ మండలాల్లో అక్షరాస్యత 65 శాతం ఉండగా, ఆదాయం హెచ్చుతగ్గుల మధ్య ఉంది. ఈ మండలాల్లో ప్రజల ప్రధాన వృత్తి వ్యవసాయం. యాదాద్రి భువనగిరి జిల్లాలో భువనగిరి, ఆలేరు, చౌటుప్పుల్ మండలాల్లో అక్షరాస్యత 68 శాతం కాగా, ఆదాయం మధ్యస్థంగా ఉంది. ఇక్కడ ప్రజల ఉపాధి వివిధ రంగాల పైన ఆధారపడి జీవిస్తున్నారు. వ్యవసాయం, ఫార్మా కంపెనీల్లో ఉద్యో గాలు, రియల్ ఎస్టేట్ ఇలా విభిన్న వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. సూర్యాపేట జిల్లాలో సూర్యాపేట, కోదాడ, హుజూర్నగర్ మండలాల్లో అక్షరాస్యత 66 శాతం కాగా, ఆదాయం కొన్ని చోట్ల హెచ్చుతగ్గులు కనిపిస్తుంటే, మరికొన్ని మండలాల్లో ఆదాయం ఎక్కువగా సంపాదిస్తున్నారు. ఇక్కడ ప్రజలు ట్రేడింగ్, వ్యవసాయ ప్రధాన వృత్తి.

Share
Share