రాజ్యాంగం పేదవాడి చేతిలో బ్రహ్మాస్త్రం: మంత్రి కోమటిరెడ్డి..

తిప్పర్తి/నల్గొండ, ఏపీబీ న్యూస్: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం పేదవాడి చేతిలో బ్రహ్మాస్త్రం లాంటిదని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. మంగళవారం అంబేద్కర్ 135వ జయంతిని పురస్కరించుకుని తిప్పర్తి మండల కేంద్రంలో ఆర్ అండ్ బి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్, డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ కాంస్య విగ్రహాలను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రూ. 10.75 కోట్ల వ్యయంతో సుందరీకరించిన తిప్పర్తి జంక్షన్ను మంత్రి ప్రారంభించారు.

సమావేశంలో మంత్రి మాట్లాడుతూ అభివృద్ధికి చదువే మూలమని, అంబేద్కర్ స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ చదువుకోవాలని పిలుపునిచ్చారు.

ఇంటిగ్రేటెడ్ స్కూల్స్: రాష్ట్ర ప్రభుత్వం రూ. 200 కోట్లతో ప్రతి నియోజకవర్గానికి ఒకటి చొప్పున యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలను నిర్మిస్తోందని, నల్గొండలోని ఎస్ఎల్బీసీ కాలనీలో నిర్మిస్తున్న స్కూల్ను డిసెంబర్ చివరి నాటికి ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభిస్తామని తెలిపారు.

పబ్లిక్ స్కూల్స్: నియోజకవర్గానికి ఒక పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేయడమే కాకుండా, విద్యార్థులను ఇంటి వద్ద నుండి తీసుకురావడానికి ప్రభుత్వమే బస్సులను ఏర్పాటు చేస్తుందని మంత్రి వెల్లడించారు.

తిప్పర్తి మండల అభివృద్ధిపై మంత్రి పలు కీలక ప్రకటనలు చేశారు:

డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు: ఇప్పటికే 135 ఇళ్లు సిద్ధంగా ఉండగా, మరో 100 ఇళ్లు మంజూరు చేశామని, మొత్తం 235 ఇళ్లను నెల రోజుల్లో లబ్ధిదారులకు అందజేస్తామన్నారు.

మౌలిక సదుపాయాలు: తిప్పర్తిలో కోటి రూపాయలతో గ్రామ పంచాయతీ భవనం, విడతల వారీగా రూ. 10 కోట్లతో డ్రైనేజీ పనులను చేపడతామన్నారు.

సాగునీరు: ఏఎమ్మార్పీ కాలువలకు రూ. 450 కోట్లతో లైనింగ్ పనులు చేపడుతున్నామని, ఇది పూర్తయితే మండలం చివరి భూములకు సాగునీరు అందుతుందని హామీ ఇచ్చారు.

చట్టసభల్లో మహిళా రిజర్వేషన్లకు ప్రభుత్వం మద్దతు ఇస్తుందని, అయితే దీనివల్ల దక్షిణ భారత దేశానికి అన్యాయం జరగకూడదని మంత్రి అభిప్రాయపడ్డారు. దేశ జీడీపీలో సగం వాటా అందిస్తున్న దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాలను కాపాడాల్సిన అవసరం ఉందన్నారు.

జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ మాట్లాడుతూ రాజ్యాంగ స్ఫూర్తితోనే ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని చెప్పారు. తిప్పర్తి జంక్షన్ సుందరీకరణ, సెంట్రల్ లైటింగ్ పనులు పూర్తవ్వడం సంతోషకరమని, రైతులు ఐకెపి ధాన్యం కొనుగోలు కేంద్రాలను వినియోగించుకుని మద్దతు ధర పొందాలని కోరారు.

ఈ కార్యక్రమంలో నల్గొండ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి, అదనపు కలెక్టర్లు జె. శ్రీనివాస్, వై. అశోక్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ జూకిరి రమేష్, వివిధ శాఖల అధికారులు మరియు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Share
Share